DIRECTOR: Screenwriter: Zuzana Liová Country : Slovakia-Czech
co-production Language: Czech-English Subtitles Duration: 97 minutes.
ది హౌస్ : సంప్రదాయ కుటుంబ సంబంధాలు - యువత
తిరుగుబాటు ధోరణులు, తరాల అంతరాలు, పాత-కొత్త తరాల
ఆకాంక్షలు-ఘర్షణలను ప్రతిబింబిస్తుందీ చిత్రం.
“ఎవా”(Eva) తన తలి-దండ్రులు “వియారా”(Viera)-“ఎం రిచ్”( Imrich) లతో స్లొవేకియాలో నివసిస్తూ ఉంటుంది. అతి సుందరమైన
పర్వతాలు-మనోహరమైన ప్రకృతి రమణీయతల మధ్య అందంగా అలరారే ఒక చిన్నపట్టణం స్లొవేకియా.
ఆమె తండ్రి ఎం రిచ్ బాట్లింగ్ ప్లాంట్ లో
ప్రతిరోజూ యాంత్రికంగా చేసే ఉద్యోగం ఇష్టం లేకపోయినా తన మనసును చంపుకుని అదే
ఉద్యోగం చేస్తూ బతుకు వెళ్ళదీస్తుంటాడు. ఆయన తన కుమార్తె లిద్దరికోసం ఒక్కొక్క
ఇటుకనూ పేర్చుకుంటూ తన ఇంటికి కుడి ప్రక్కనున్న స్థలంలో ఒక ఇల్లు కట్టడమే ఒక కలగా, అదే తన జీవితాశయంగా
బతుకుతుంటాడు.
పెద్ద కుమార్తె జన (Jana) కమ్యూనిస్టు పార్టీ
నాయకుని కుమారుడైన ఒక వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు పరమ సనాతనవాది యైన
ఎం రిచ్ ఆ పెళ్లిని ఆమోదించలేడు. ఏడేళ్ళ తర్వాత ముగ్గురు పిల్లల తల్లైన తర్వాత
కూడా ఆమె పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ పేరెత్తితే భగ్గుమంటాడు. పాఠశాల నుండి
గ్రాడ్యుయేషన్ పూర్తి చెయ్యబోతున్న ఎవా మీద తన పంచప్రాణాలూ నిలుపుకుంటాడు. పెద్ద
కుమార్తె ఇచ్చిన షాక్ వల్ల మరింత అప్రమత్తంగా వళ్ళంతా కళ్ళు చేసుకుని ఎవాను
కనిపెడుతూ ఉంటాడు. ఒంటి చేత్తో ఇల్లు కడుతూ, ఆ ఇంటి నిర్మాణంలో ఎవాను మాత్రమే పాలు
పంచుకోమంటాడు. ఎవా-జన చిన్నతనంలో క్రయాన్స్ తో ఆటలాడేటప్పుడు “తమ కుటుంబం కోసం
పిల్లలిద్దరూ ఇల్లు కట్టడ”మనే సుందర దృశ్యం ఆయన మనసులో తిష్ఠ
వేసుకుపోయింది.దాన్ని మర్చిపోలేక ఆయన వాళ్ళిద్దరికోసం తాను ఇల్లు కట్టించి
ఇవ్వాలనే దాన్నే తన ఏకైక జీవిత లక్ష్యంగా మలచుకున్నాడు.అంతేగాక తన చిన్నతనంలో
కమ్యూనిస్టు జీవితంలోని నిరాశా-నిస్పృహలు ఆయన్ని వదలవు. అందువల్ల స్వంతిల్లు ఆయన
గాఢ వాంచగా రూపుదిద్దుకుంటుంది.దురదృష్టవశాత్తూ ఆయనకున్న సీరియస్ గుండెజబ్బు వల్ల
ఇల్లు పూర్తి చెయ్యలేనేమోనని ఆరాటపడతాడు.ఈ బాధలేవీ ఎవాకి పట్టవు.
ఆయన ఆశలు,కోరికల పట్ల ఎవాకి మనసులో రవ్వంత కూడా
ఖాతరుండదు. తండ్రికి తనవంతు సహాయంగా కష్టపడి పనిలో పాలు పంచుకుంటుంది గానీ ఆమె
భవిష్యత్తు గురించి ఆమెకు స్వంత ప్రణాళికలుంటాయి. స్కూలు చదువు పూర్తి కాగానే ఈ
పల్లెటూరిని వదిలేసి ఆకర్షణీయంగా కనిపించే లండన్ రంగులప్రపంచంలోకి పారిపోవాలని ఎవా
ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది.వెబ్సైట్లో ఆన్ లైన్ ప్రొఫైల్ పెట్టి ఉద్యోగం కోసం
ప్రయత్నిస్తుంది. నానీ వంటి ఎంత చిన్న పనైనా సరే సంపాదించి, తన కాళ్ళమీద తాను నిలబడి, చదువు కోసం డబ్బు
కూడబెట్టుకోవాలనుకుంటుంది. ఎం రిచ్ కుమార్తె చదువు కోసం డబ్బిచ్చే ఉద్దేశ్యం ఉంది
కానీ ఆయన ఇష్ట ప్రకారం నడచుకోవాలి. ఆయన చెప్పినట్లు వినాలి. ఎవా మంచి ప్రతిభ గల
అమ్మాయి.తన జీవితాన్ని తనకిష్టమైనట్లు నిర్మించుకుని స్వేచ్చగా బతకాలని తపించే
యువతి. క్రమశిక్షణ-సంప్రదాయాలతో పెంచాలనే తండ్రి- మారిన పరిస్థితుల్లో వ్యక్తిగత
స్వేచ్చను కోరుకున్న కుమార్తెలు - జీవితాన్ని గురించిన అంచనాలలో తండ్రీ-కూతుళ్ళకు
చాలా తేడాలున్నాయి.
మంచితనమే కానీ నిస్సహాయురాలైన తల్లి, ఎప్పుడూ కోపంతో
కరకరలాడుతూ భరించరాని తలనొప్పిగా తయారైన తండ్రి, అక్క జన (Jana) దూరమవడం- ఇంట్లో ఈ పరిస్థితుల్లో ఎవాకు
"దూరపు కొండలు నునుపు" అన్నట్లుగా నగర జీవితం పట్ల లేనిపోని ఆశలు
పెట్టుకుని ఊరించే ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో లండన్ నగరం నుంచి
వచ్చిన వివాహితుడైన “ జాకబ్” (Jakub) అనే ఆంగ్ల ఉపాధ్యాయుడు తనముందు మిణుగురులా
మెరుస్తూ కనిపిస్తాడు. స్కూలు చదువు చివరి సెమిస్టర్ లో ఉన్నఎవా తనే ఎక్కువ చొరవ
తీసుకుని అతడితో సంబంధం పెట్టుకుంటుంది.
కళాశాల కెళ్ళే వయసుకొచ్చిన కుమార్తె ఎవా స్వతంత్ర
ఆలోచనలు గనక తండ్రికి తెలిస్తే ద్వేషంతో రగిలిపోతాడని తెలుసు. ఆమె తండ్రి పట్ల
కోపంతో నిరంతరం మనసులో తిట్టుకుంటూనే ఉంటుంది.అందుకే స్కూలు ఎగ్గొట్టి రహస్యంగా
డబ్బు సంపాదించడానికి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది. చదువుకోవడానికి
స్నేహితురాలి ఇంటికెళ్ళాలని చెప్పి ఇంగ్లీష్ టిచర్ తో సిటీ కెళ్ళిపోతుంది.తండ్రి
ఎంత నియంతృత్వం చెలాయించినప్పటికీ ఎవా తనకోసం తాను అది తప్పో-ఒప్పో అని
ఆలోచించకుండా కొన్ని ఆనందపు సమయాల్ని సాధించుకుంటుంది.ఆయనతో తరచూ కలుస్తూనే
ఉంటుంది. ఆమె తండ్రి ఇంటి నిర్మాణంలో ఎవా సహకారం కోసం సెల్ ఫోన్ లో ఎన్నిసార్లు
కాల్ చేసినా లెక్క చెయ్యదు. తండ్రి అచ్చు భారతదేశంలో తండ్రుల లాగానే "నువ్వు
రాత్రుళ్ళు బయటికి వెళ్ళడానికి వీల్లేదు.కావాలంటే ఆ స్నేహితురాలినే మనింటికి
రమ్మని చెప్ప"మంటాడు. అలా అని తలి-దండ్రుల పట్ల విశ్వాసం, ప్రేమానురాగాలు
లేవనుకుంటే పొరపాటే. తన శక్తి యుక్తులన్నీ ఉపయోగించి తండ్రికి భోరున కురిసే
వర్షంలోకూడా ఒక్కొక్క ఇటుక అందిస్తూ ఉంటుంది. తండ్రి ఔదార్యం తెలుసు కానీ ఆయన
క్రోధస్వభావం, నియంత్రణలను సహించలేదు.
వాస్తవానికి ఇలా ఒకరిపట్ల మరొకరికి అంతగా
-సామరస్యం లేని కుటుంబంలో తల్లి వియారా ఒక్కతే గొప్ప స్థిర చిత్తంతో అందరి మధ్య
సయోధ్య కుదర్చడానికీ కుటుంబం యొక్క బంధాల్ని బలంగా నిలిపి ఉంచడానికీ శతధా
ప్రయత్నిస్తుంది.పెద్ద కుమార్తె-అల్లుడు ముగ్గురు చిన్నారులతో ఆర్ధికంగా
చితికిపోయి నిలువనీడ లేకుండా నిస్సహాయంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రకమైన సహాయమైనా
చేయడానికి ససేమిరా వీల్లేదని ఎం రిచ్ గట్టిగా హెచ్చరిoచినప్పటికీ
అతనికి నచ్చజెప్పి ద్వేషంతో నైనా జీవన మార్గం తెలుసు కునేలా చేస్తుంది. ఎవా కూడా
తల్లితో పాటు స్పందిస్తుంది. జాకబ్ కూడా ఎవా సోదరి-తండ్రుల మధ్య శాంతి
సామరస్యాలకోసం గట్టిగా ప్రయత్నిస్తాడు.
అంతగా ఇంగ్లండ్ వెళ్ళాలని ఆశ పడిన ఎవా జాకబ్ తనతో
ఉండడానికి ఒప్పుకుంటే గనక పల్లెలోనే ఉండిపోతానంటుంది. జాకబ్ నాకు కుటుంబం ఉంది,వీలుకాదంటాడు.నిరాశతో
గందరగోళ పడిన ఎవా ఇంటినుంచి పారిపోతుంది.కానీ చివరికి సగంలో ఆగిపోయిన తన ఇంటికే
తిరిగి వచ్చేస్తుంది.తలి-దండ్రులు బాధ్యతగా తనకోసం బాధపడటాన్ని చాటుగా
వింటుంది.వాళ్ళు అక్కడినుంచి పక్కకెళ్ళాక వాళ్ళ నాన్న ఓవర్ కోట్ లో ఒదిగిపోయి
ముడుచుకు పడుకుని నిశ్చింతగా నిద్ర పోతుంది.ఆమె చదువుకోసం లండన్ వెళ్ళిందీ లేనిదీ
మనకు తెలియదు కానీ చివరికి ఆమెకు తనదైన "ఇల్లు" ఎక్కడుందో ఎవా కి తెలిసి
వస్తుంది .
పాఠశాల విద్యార్ధి-గురువు మధ్య లైంగిక సంబంధం
అనేది ప్రపంచంలో దాదాపు అన్ని చోట్లా నైతిక విరుద్ధం కాబట్టి ఈ సినిమా ముగింపు
మనకంత రుచించదు.జాకబ్ కి ఉద్యోగం ఊడిపోతుంది.అతి కష్టంగా పాఠశాల విద్య పూర్తి
చేసుకోవడానికి ఎవాని స్కూలు యాజమాన్యం అంగీకరిస్తుంది.తలిదండ్రులు చర్చ్ పాస్టర్
దగ్గర ఎవా చేత ప్రాయశ్ఛిత్తం చేయిస్తారు.
మనకందరికీ తెలిసిన నిస్తేజమైన మామూలు విషయాన్నే
కథాంశంగా తీసుకున్నప్పటికీ ప్రతిభావంతురాలైన యువ నిర్మాత జుజాన లియోలా (Zuzana Liová)చేతిలో మనోహరంగా , విలక్షణంగా అందరి
సమ్మతినీ పొందేవిధంగా రూపొందిందీ వాస్తవ చిత్రం. తూర్పు గ్రామీణ యూరోప్ లోని
పల్లెటూరి జీవితం యొక్క ఒక అరుదైన జీవిత శకలాన్ని చాలా సహజంగా మనముందుంచుతుంది.
ఇతివృత్తం సాధారణంగా ఉండి మన ఇళ్ళల్లో జరిగే మన కథలాగే ఉన్నప్పటికీ చిన్న చిన్న
హాస్య సంఘటనలతో స్క్రిప్ట్ ను సంక్షిప్తంగా ఏ ఆర్భాటాలూ లేకుండా రూపొందించి
విజయవంతం చేసిన నిర్మాణ పద్ధతి ఆశ్చర్యపరుస్తుంది.
స్లోవేకియా - చెక్ రిపబ్లిక్ సంయుక్తాధ్వర్యంలో
వచ్చిన ఈ సినిమా పాశ్చాత్య ప్రేక్షకులకు సోవియట్ తూర్పు యూరోప్ లోని తళుకు బెళుకుల
గ్రామీణ జీవితం గురించి ఒక సంగ్రహావలోకన మిస్తుంది . అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా
ఆస్తి యాజమాన్యాల కోసం ఆరాటపడే ఒక కొత్త మధ్యతరగతి ఆవిర్భావం గురించి సూక్ష్మ
వ్యాఖ్యలు చేస్తుంది .
ఒక తరం సార్వత్రిక-స్థిరత్వాన్ని కోరుకుంటుంటే
నవతరం - వ్యక్తిగత స్వేచ్ఛను కాంక్షిస్తుంది. ముందుతరం భద్ర
జీవితం-బాగుంటుందనుకుంటుంటే ఎదుగుతున్న తరం ఏవో తెలియని ఊరించే ఆకర్షణీయమైన
లోకాలకి ఎగిరి పోవాలని తపించిపోతుంది. విశ్వజనీనమైన ఈ విభేదాలు సృష్టించి మెప్పించడంలో
యువ దర్శకురాలి అద్భుతమైన ప్రతిభ కనపడుతుంది.
పల్లెటూరి పర్వతాల మధ్య బురదలో పెరడు లో సగం
నిర్మించిన ఇళ్ళు, నిడివిలో
తక్కువైనప్పటికీ పదునైన పాత్రల గాఢత, సమకాలీనత ఆకట్టుకుంటాయి. గ్రామాల్లోఉండే పాత పగలు,మాట పట్టుదలలు “నా మాటే నెగ్గి
తీరాలనే “పంతానికి పోవడాలూ మొదలైన అద్భుతమైన దృశ్యమాన సంఘటనలు ప్రేక్షకులను
కట్టిపడేస్తాయి.
సరి కొత్త నటి జ్యుడిట్ బార్డోస్ ( Judit Bardos) తన జీవితానికి
సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకోవాలి గానీ తండ్రైనా మరెవరైనా జోక్యం చేసుకోకూడదనే
తెలివైన యువతరానికి ప్రతీకగా సహజసిద్ధంగా ,అద్భుతంగా
నటించింది. కానీ ఇంగ్లీష్ టీచర్ తో ఉండడం,"నాకు
పెళ్ళైంది.మనమిలా కలవకూడదు.ఇది తప్పు" అని జాకబ్ చెప్తున్నా వివిపించుకోకుండా
మనం ఇంగ్లండ్ కి వెళ్ళిపోదామని అతనిమీద ఒత్తిడి తేవడాన్ని మనం జీర్ణించుకోలేం యూరో
సంక్షోభం-యూరో కరెన్సీ వాడకం కనిపిస్తుంది.


కామెంట్‌లు లేవు:
Write comments