Recent Post

11, జనవరి 2017, బుధవారం

“నిశ్శబ్ద, ప్రశాంత ఉషోదయాలు”



బోరిస్ ‘వాసిల్యేవ్’ నవల ఆధారంగా అదే పేరుతో ‘స్టానిస్లవ్ రొస్టోట్స్కీ’(Stanislav Rostotsky)  దర్శకత్వం వహించి, 1972 లో దృశ్యీకరించిన యుద్ధ వ్యతిరేక ప్రపంచ ప్రసిద్ధ సోవియట్ చిత్రం “The Dawns here are Quiet”. అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన పదహారుమంది నాజీ సైనికులతో ఆరంటే ఆరుగురు రష్యన్ లు జరిపిన వీరోచిత పోరాటాన్ని ఆద్యంతం దిగ్భ్రాంతి కలిగించేలా తెరకెక్కించారు డైరెక్టర్ స్టానిస్లవ్.
యుద్ధం ప్రజల జీవితాల లోని మరీ ముఖ్యంగా స్త్రీల జివితాల్లోని అన్ని పార్శ్వాలనూ, కలల్ని, సర్వస్వాన్ని ఏవిధంగా నాశనం చేసి వదులుతుందో అనే విషయాన్ని ఐదుగురు రెడ్ ఆర్మీ యువతుల జీవితాలు, వారి పోరాటాల ద్వారా బొమ్మ కట్టి చూపించడమే ఈ సినిమా ఇతివృత్తం.
రెండవ ప్రపంచ యుద్ధం సమయం. 1942 మే. జర్మన్ పైశాచికత్వాన్ని అనుభవిస్తున్న రష్యా జాతీయాభిమానంతో మహోద్రిక్తంగా ఉంది. సీనియర్ సార్జెంట్ ‘ఫెదోత్ వస్కోవ్’ యూనిట్ లో విధి నిర్వహణ కోసం మొత్తం మహిళలతో కూడిన ఒక దళం "కామ్రేడ్, విమాన విధ్వంసక బెటాలియన్ కి చెందిన మేము మీ నాయకత్వాన ఈ స్థావరాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాము"అని సీనియర్ సార్జెంట్ సైనిక యువతి అసిస్టెంట్ ప్లటూన్ కమాండర్ ‘కిర్యానోవా’ వస్కోవ్ కి రిపోర్ట్ చేస్తుంది. ఆమె రిపోర్ట్ చెయ్యగానే అంతకు ముందున్న తన దళంలోని తాగుడుకి అలవాటు పడిన పురుష సైనికులందర్నీ రిలీవ్ చేసేస్తాడు వస్కోవ్.
‘రీతా ఒస్యానినా’ బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు తమ పరిసరాల్లో ఇద్దరు జర్మన్లు సంచరిస్తున్నట్లు పసిగడుతుంది. రీతా పరుగున వచ్చి వస్కోవ్ కి రిపోర్ట్ చేస్తుంది. అందరూ ఆలోచించి, రష్యాని విధ్వంసం చేసే ప్రణాళికలో భాగంగా, జర్మన్ నాజీ విద్రోహ దళాల నుంచి వచ్చి ఉంటారని తేల్చు కుంటారు. అడవిని గాలించడానికి పైనుంచి ఆదేశమవుతుంది. వస్కోవ్ విమాన విధ్వంసక శతఘ్ని దళానికి చెందిన ఐదుగురు రెడ్ ఆర్మీ యువతులు ‘రీతా ఒస్యానినా’, ‘బ్రిచ్కీనా లీజా’, ‘జేన్యా కొమెల్కోవా’,’గాల్యా చెత్ వెర్తాక్’లతో పాటు జర్మన్ భాష తెలిసిన ‘సోన్యా గూర్విచ్’ ను తన దళ సభ్యులుగా ఎంచుకుంటాడు సీనియర్ సార్జెంట్ మేజర్ వస్కోవ్. ఈ ఆరుగురికీ వివిధ కారణాల వల్ల నాజీల మీద కక్ష ఉంది. జర్మన్లను రష్యా దేశం లోకి ప్రవేశించకుండా మధ్యలోనే అడ్డగించిఅంతం చెయ్యాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ జాడలు వెతుక్కుంటూ ఆరుగురూ అన్ని జాగ్రత్తలతో బయల్దేరతారు!
మొదటగా వస్కోవ్, సోన్యా గూర్విచ్, బ్రిచ్కీనా లీజా, జేన్యా కొమెల్కోవా, గాల్యా చెత్ వెర్తాక్, చివరగా జూనియర్ సార్జెంట్ రీతా ఒస్యానినా -ఈ వరసలో నడుస్తారు. దారిలో భయంకరమైన బురదతో నిండిన ఒక ఊబిని దాటవలసి వస్తుంది. గొంతు వరకూ ఉన్న ఊబిలో మొదటి అడుగుతోనే కూరుకుపోతాడు వస్కోవ్. గాల్యా ఒక కాలి బూటు బురదలో ఇరుక్కుపోతుంది. పెర్చి అనే కర్ర సాయంతో లాగేస్తున్న ఊబిలోంచి నానా తంటాలూ పడుతూ బయటికొస్తారు. గాల్యా కి వెంటనే ఒక బూటును తయారుచేస్తాడు వస్కోవ్.
రెండు భాగాలుగా ఉన్న సినిమా మొదటిభాగం ఇక్కడ ముగుస్తుంది.
ఇద్దరు జర్మన్లు కిరోవ్ రైలు మార్గానికీ, కామ్రేడ్ స్టాలిన్ పేరు కలిగిన తెల్ల సముద్రం-బాల్టిక్ కాల్వకీ చేరుకునే లక్ష్యంతో రహస్యంగా చొచ్చుకు వస్తున్నారని తెలుసుకుంటారు. వాళ్ళని చాలా ముందే కనుక్కుని అడ్డగించ డానికి వీలుగా ఒక అనువైన స్థావరాన్ని ఎంచుకుంటారు. వస్కోవ్ తనకూ మహిళా సైనికులకు కూడా ఒక్కొక్కచోట వారి స్థావరాలను నిర్ణయించి కొంచెం సేపు సేద దీరమంటాడు. తన సైనికులొక్కొక్కరి దగ్గరికీ స్వయంగా వెళ్ళి, వారి క్షేమ సమాచారాలు ఆరా తీస్తాడు. ఒక్కొక్కరికి ఏ యే విద్యల్లో ప్రావీణ్యముందో తెలుసుకుంటాడు. అప్పుడు వారి గురించిన జీవిత విశేషాలు ప్రేక్షకులకు తెలుస్తాయి.
రీతాకి ఒక రెడ్ ఆర్మీకమాండర్ లెఫ్టినెంట్ ‘ఒస్యానినా’ తో వివాహమవుతుంది. సరిహద్దు స్థావరంలో ఆమెను మహిళా సమితికి ఎన్నుకుని అన్ని రకాల శిక్షణలూ ఇస్తుంది రెడ్ ఆర్మీ. గాయపడిన వాళ్ళకు వైద్యం చెయ్యడం, తుపాకులు కాల్చడం, గుర్రపు స్వారీ, గ్రెనేడ్లు విసరడం, విషవాయుదాడులనుండి తప్పించుకోవడం మొదలైనవన్నీ నేర్చుకుంటుంది. తర్వాత సంవత్సరం ఒక బాబు పుడతాడు. ఆ తర్వాత సంవత్సరం యుద్ధం మొదలవుతుంది. అందరిలాగా ఆమె భీతిల్లలేదు. బాబుని తలి-దండ్రుల దగ్గరకు పంపేస్తుంది. పదిహేడు రోజులు కాల్పుల శబ్దం వింటూ, నిబ్బరంగా తన భర్త తిరిగి వస్తాడని ఎదురు చూస్తుంది. చివరికి అంతా నిశ్శబ్దమైపోయి నిరాశే మిగిలింది. ఆమెను నాయకత్వం యుద్ధ రంగం నుంచి ఇంటికెళ్ళమని ఆదేశిస్తే, ఆమె మాత్రం తనని పోరాట శ్రేణుల్లోకి తీసుకోవాలని అర్ధించింది. తనకి తానుగా కొన్ని బాధ్యతలనూ, లక్ష్యాలనూ నిర్దేశించుకుంది.
జేన్యా కొమెల్కోవాని తోటి మహిళా సహచరులే "సముద్ర కన్యలా ఉన్నావనీ, చెక్కిన దివ్య సుందర శిల్పంలా అతిలోక సౌందర్యంతో వెలిగిపోతున్నావనీ తెగ పొగిడేస్తారు. అమ్మనీ, తమ్ముణ్ణీ, చెల్లెల్నీ కాల్చి చంపుతుంటే పక్కింట్లో నుంచి ప్రత్యక్షంగా చూస్తుంది జేన్యా. . “రెడ్ ఆర్మీ కమాండర్ కూతురంటే ప్రపంచంలో దేనికీ భయపడకూడదు”- అని వాళ్ళ నాన్న బోధించినట్లే జేన్యా కొమెల్కోవా దేనికీ భయపడదు. గుర్రపు స్వారీ, రైఫిల్ కాల్చడం, పందుల్ని వేటాడటం, జిప్సీ, స్పానిష్ డ్యాన్స్ చెయ్యడం, గిటారు వాయించడం-ఇలా ఎన్నో రకాల విద్యల్లో ఆమె ప్రావీణ్యురాలు. జేన్యా కుటుంబం చంపబడ్డాక ఆమె సోవియట్ యుద్ధ ట్రూపుల్లోకి వస్తుంది.  తన జీవితం ఎంత విషాద భరితమైనదైనా చిలిపిగా, కొంటె పనులు చేస్తూ, అందరితో కలుపుగోలుగా అందర్నీ నవ్విస్తూ, నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ, సాహిత్యాన్ని అలవోకగా ఆశువుగా చెప్తూ సెక్షన్ నంతటినీ ఆహ్లాదపరిచేది.
ఉమ్మడి కుటుంబంలో పెరిగిన సోన్యా గూర్విచ్ బాల్యమంతా గందరగోళంగా రకరకాల ఒత్తిళ్ళ మధ్య కరిగిపోయింది. చొరవ లేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోయేది. భయస్తురాలు. స్కూల్లోనూ, విశ్వ విద్యాలయంలోనూ అత్యధిక మార్కు లొచ్చాయి. కవిత్వమంటే ప్రాణం. కవిత్వాన్ని పైకి చదువుకుంటూ ఉంటుంది. నిశ్శబ్ద వాతావరణంలో గాలి నీ స్వరాన్ని మోసుకుపోయి శత్రువుకి పట్టిస్తుంది.పైకి చదవొద్దంటాడు వస్కోవ్.
యూనిట్ మొత్తంలో నీరసంగా, బలహీనంగా, మురికిగా కనిపించేది ‘గాల్యా చెత్ వెర్తాక్’. గాల్యా చెత్ వెర్తాక్ ఒక అనాధ బాలిక. అనాధ శరణాలయంలో పెరిగిన గాల్యా చెత్ వెర్తాక్ వాస్తవ ప్రపంచంలో కన్నా కల్పిత ప్రపంచం లోనే ఎక్కువగా బతుకుతూ ఉంటుంది. గాల్యాకి అన్ని రకాలుగా శిక్షణ నిస్తుంది జేన్యా. ఇప్పుడామె అన్ని విద్యల్లో ఆరితేరిన ఒక అందమైన అమ్మాయిగా తయారవుతుంది. ఇక రీతా, జేన్యా, గాల్యా మంచి స్నేహితులవుతారు.
అడవిలోని ఏ జంతువు కూతనైనా అనుకరించగలరు- జేన్యా, రీతా.
బ్రిచ్కీనా లీజా బాల్యంలోనే చదువు మానేసి మరణ శయ్య మీదున్న తల్లికి సహాయపడుతూ, తండ్రికి సేవ చేస్తూ కష్టాల్లోనే కాలం గడుపుతుంది. యుక్త వయసులో ఒకతన్ని ఇష్టపడుతుంది. అతను లీజాని ఖాతరు చెయ్యడు. బ్రిచ్కీనా లీజా అడవి ప్రాంతం. అడవి ఆనుపానులన్నీ తెలిసిన యువతి. అడవిలో ఒక అందమైన చోట తనకి తానే బహు చక్కని గూడుని ఏర్పరచుకుంటుంది. ఆమె సామర్ధ్యాన్ని చూచి చకితుడవుతాడు వస్కోవ్. లీజాని పరామర్శించడానికి వచ్చినప్పుడు వస్కోవ్
 “లీజా, లీజా, లీజా వేతా,
కాల్చిన బంగాళాదుంప కంటే తియ్యనైన దానా
ముందుగా ప్రియుణ్ణి నువ్వే ఎంచుకుంటావా?
లేదా నేను వెళ్లి నీకోసం నేను ఎంచి పెట్టనా?”
అని పాట పాడతాడు. ఇది మాప్రాంతంలో పాడే జానపద పాట అని చెప్తాడు. లీజా సిగ్గు పడుతూ నాకూ తెలుసు, మాప్రాంతంలోనూ పాడతారని చెప్తుంది. యుద్ధం ముగిసి,  శాంతి స్థాపన జరిగాక మనం కలుద్దామని చెప్తాడు. మొదటి చూపులోనే వస్కోవ్ పట్ల లీజాకి ఇష్టం ఏర్పడుతుంది.
బాగా గమనించిన తర్వాత జర్మన్లు ఇద్దరు కాదనీ, పదహారు మంది అనీ, మెషిన్ గన్నులు, అత్యాధునిక ఆయుధాలతో ఉన్నారనీ మొదటగా గమనిస్తుంది సోన్యా గూర్విచ్. వస్కోవ్ కి కంగారుతో బుర్ర పని చెయ్యనని మొరాయిస్తుంది. పైకి గంభీరంగానే ఉంటాడు.
ఈ వార్త పై అధికారులకి చేరవెయ్యడం కోసం, సహాయం అర్ధించడం కోసం బ్రిచ్కీనా లీజాని తిరిగి ప్రధాన స్థావరానికి పంపిస్తాడు వస్కోవ్. "వెళ్ళగలవు కదా, ఊబిని దాటేటప్పుడు జాగ్రత్త సుమా” అంటూ ఎన్నో హెచ్చరికలు చేసి లీజాని పంపిస్తాడు. ఒక పక్షి దూసుకు పోతున్నట్లే దూసుకెళ్తుంది లీజా!
లీజా వెళ్ళాక మిగిలింది నలుగురే, శత్రు సైనికులు బాగా దగ్గర కొచ్చేస్తారు. వాళ్ళ దృష్టి మళ్ళించడానికి ఏదైనా ఉపాయం చెప్పమంటాడు వస్కోవ్. అమ్మాయిలే కట్టెలు కొట్టేవాళ్ళలాగా అరిచి, హంగామా చేస్తామంటారు. ముందు ఒప్పుకోడు. తర్వాత వాళ్ళ సమయస్ఫూర్తి వస్కోవ్ కి నచ్చుతుంది. గొంతు పోయేలా అరుస్తుంది రీతా ఒస్యానినా. స్కర్ట్ ను కాల్చుకుంటుంది సోన్యా గూర్విచ్. ముఖమంతా మసి చేసుకుంటుంది గాల్యా చెత్ వెర్తాక్. ఎవరి మేరకు వాళ్ళు నటించినా జర్మన్లను పూర్తిగా మస్కా కొట్టించిన ఘనత మాత్రం జేన్యా కొమెల్కోవాదే! అప్పటికా గండం గడిచిపోతుంది. పడీ పడీ నవ్వుకుంటారు.    
“మన మాతృదేశ పరిరక్షణలో పాల్గొన్న  ఒక మంచి వీరునికి” - అని అందమైన అక్షరాలు కుట్టి ఉన్న పొగాకు సంచిని ఒకచోట మర్చిపోతాడు వస్కోవ్. దాని కోసం వద్దని వారిస్తున్నా వినకుండా పరిగెత్తుతుంది సోన్యా. అంతే! తర్వాత ఒక అరుపు వినిపించిన దిశగా పరిగెడతారు జేన్యా కొమెల్కోవా, వస్కోవ్ లు. అక్కడ గుండె నుంచి రక్తం స్రవిస్తూ వికృతమైన రూపంలో నిర్జీవమై ఉంటుంది సోన్యా గూర్విచ్. సోన్యా తన పొగాకు సంచికోసం పరిగెత్తి తూటాకి బలైందని హతాశుడవుతాడు వస్కోవ్. మానవజాతి అనే అనంతమైన వస్త్రంలో ఓ చిన్న దారం ఒక బాకు పోటుతో పుటుక్కున తెంపెయ్యబడింది.
సోన్యా గూర్విచ్ ని రాళ్ళ మధ్య ఉంచి మొక్కల కొమ్మలు కప్పి, ఆ సమాధిపై జేన్యా కొమెల్కోవా ఒక పచ్చటి మొక్కనుంచింది. గాల్యా చెత్ వెర్తాక్ కంపించి పోతూ అరవబోతే "ఆ పూనకపు వేషాలు ఇంక కట్టిపెట్టు” అని గద్దిస్తుంది జూనియర్ సార్జెంట్ రీతా ఒస్యానినా. ఆస్థలాన్ని మాప్ లో గుర్తు పెట్టి,"యుద్ధం ముగిశాక ఆమె కొక స్మారక స్తూపం నిర్మించబడుతుంది”- అంటాడు సార్జెంట్ మేజర్ ఫెదోత్ వస్కోవ్
జీవితంలో మంచి రోజులు వస్తాయని ఆశిస్తుంది లీజా. అవెప్పటికీ రావు! వస్కోవ్ అప్పజెప్పిన పని మీద వెళుతూ, బురద నిండిన చిత్తడి ఊబిలో కూరుకుపోతూ "కాపాడండి"అని అడవంతా ప్రతిధ్వనించేలా కేకలు పెడుతూ అందమైన నీలాకాశం వైపు చూస్తూ, రేపు మీద ఆశ వదులుకోకుండా ప్రభాత సమయం వరకూ గింజుకుంటూనే ఉంటుంది. నులివెచ్చని తేజోవంతమైన ప్రభాత సూర్య కిరణాల్ని అనుభూతిస్తూ, ఉజ్వలమైన "రేపు" తనకీ, దేశానికీ రాబోతుందని నమ్ముతూ వస్కోవ్ ని తల్చుకుంటూ, అతను చెప్పిన మాటల్ని నెమరు వేసుకుంటూ తుది శ్వాస విడి చేస్తుంది.
వస్కోవ్, జేన్యా కొమెల్కోవా లిద్దరూ ఇద్దరు జర్మన్ల మీద దాడికి పూనుకుంటారు. జేన్యా ఇచ్చిన సంకేతంతో యుక్తిగా ఒక జర్మన్ సైనికుణ్ణి వధిస్తాడు వస్కోవ్. రెండోవాడు వస్కోవ్ మీద దాడి చేస్తాడు."ఇక నా చావు తప్పదు” అని వస్కోవ్ అనుకుంటుండగానే మెరుపులా అతన్ని పేల్చేస్తుంది జేన్యా. వెంటనే అప్రమత్తమైన వస్కోవ్ నిర్జీవంగా పడి ఉన్నప్పటికీ మళ్ళీ లేవకుండా కత్తితో పొడిచి అతన్ని అంతంచేస్తాడు.
"శభాష్ జేన్యా, నీకు ప్రశంసా పత్రం వస్తుందం”టాడు వస్కోవ్. జేన్యా పక్కకెళ్ళి భళుక్కున కక్కుకుని ఏడుపు లంకించుకుంటుంది. మొదటిసారి ఒక మనిషిని చేతులారా చంపడానికి దోహద పడినందుకు తన అంత రాత్మతో రాజీ పడలేక పొందుతున్న ఆవేదన అది. జీవితమంత సహజ మైనదైన నిండు ప్రాణాన్ని తియ్య రాదన్న నియమం మొదటిసారిగా అతిక్రమించినప్పుడు ఆ అనుభవం కలచివేస్తుంది. స్త్రీలు ప్రాణం పోసేవారే గాని తీసేవారు కాదు. అన్నీ సవ్యంగా ఉంటే భవిష్యత్తులో ఒక మాత కావలసిన జేన్యా కుమిలి కుమిలి ఏడుస్తుంది.
 “వాళ్ళు మనుషులు కాదు, పశువుల కంటే హీనమైనవాళ్ళు.బాధ పడవద్దం”టాడు వస్కోవ్.
వస్కోవ్, గాల్యా చెత్ వెర్తాక్, జేన్యా కొమెల్కోవా, రీతా ఒస్యానినా వరుసగా నడుస్తుండగా జర్మన్లు ఎదురుగా వస్తూ కనిపిస్తారు. ఇక " ప్రత్యక్ష పోరాటం” మొదలవువుతుంది.  వస్కోవ్ కి ఆలోచించుకునే సమయం లేకుండా సబ్ మెషీన్ గన్నులతో అతని పైకి కాల్పులు సాగిస్తారు. తన సైనికులకు చెదిరిపొమ్మని సంజ్ఞ చేస్తాడు వస్కోవ్. రీతా ఒస్యానినా జర్మన్ల దగ్గరనుంచి సంపాదించిన సబ్ మెషీన్ గన్ తో అంతకు ముందు వస్కోవ్ చెప్పినట్లే ఆపి ఆపి కాలుస్తూ అత్యవసరమైన విలువైన క్షణాలను ఫెదోత్ వస్కోవ్ కి సమకూర్చి పెడుతుంది. రీతాకి వస్కోవ్ జీవితమంతా రుణపడి ఉండాల్సిన గొప్ప క్షణాలవి. గాల్యా చెత్ వెర్తాక్ కాల్పులకు బెదిరిపోయి బోర్లా పడుకుండిపోతుంది. జేన్యా కొమెల్కోవా శత్రుదాడి ఆగేవరకూ కాల్పులు కొనసాగిస్తూనే ఉంటుంది. గాల్యా ఏడుస్తుంటే రీతా ‘పిరికిది’ అని అంటుంది. “మొదటి పోరాటంలో పిరికితనం కాక గాభరాగా ఉంటుం”దని సర్ది చెప్తాడు వస్కోవ్.  నిజానికి గాల్యాని భయపెట్టింది సోన్యా గూర్విచ్ హఠాత్మరణం. “పదహారులో ఇద్దరు పోయారు, ఇంక మనం తలపడాల్సింది పద్నానుగు మందితోటే” అని గాల్యాని ఉల్లాస పరుస్తాడు వస్కోవ్. ‘దుఃఖోద్వేగాల్లో ఉన్న ఆడపిల్లలతో ఎలా మెలగాలో సైనిక నిబంధనల్లో లేద’నుకుంటాడు వస్కోవ్.
వస్కోవ్, గాల్యా చెత్ వెర్తాక్ ఒకవైపుకీ, రీతా ఒస్యానినా, జేన్యా కొమెల్కోవాలు మరోవైపుకీ మళ్ళుతారు.
జర్మన్లు సబ్ మెషీన్ గన్ లతో ముందుకి వస్తుంటారు. పది అడుగుల దూరం లోనే ఉన్న వాళ్ళు తన కాల్పుల పరిధి లోకి రాగానే గ్రెనేడ్ విసరడానికి సంసిద్ధంగా ఉంటాడు.ఇంతలో గాల్యా చెత్ వెర్తాక్ ఆకస్మికంగా పొదలోంచి బయటికి వచ్చి “మామా” అని అరుస్తూ హాహాకారాలు చేస్తుంది. అంతే! ఆమెపై సబ్ మెషీన్ గన్ నిప్పులు కురిపిస్తుంది. వస్కోవ్ కి గాయమవుతుంది. గాల్యా నేలకూలుతుంది. గాల్యా చావు వల్ల మానసికంగా చెదిరి, గాయం సలుపుతుంటే శత్రువుకి చిక్కకుండా పొగమంచు ఉన్నందువల్ల కనిపించకుండా ఉరుకుల పరుగులు పెడతాడు వస్కోవ్. ప్రమాదంలో ఉన్న మనిషి అసలు బొత్తిగా ఆలోచించకుండానైనా అవుతాడు. లేక ఏకకాలంలో ఇద్దరు మనుషులు ఆలోచించి నట్లయినా ఆలోచిస్తాడు. పరిగెత్తి, పరిగెత్తి ఇంతకుముందు దాటిన ఊబి దగ్గరకు చేరుకుంటాడు. అక్కడొక నల్లని వస్తువుని చూచి, దాన్ని బ్రిచ్కీనా లీజా స్కర్టు అని గుర్తు పడతాడు. తన విజయం ఎవరితో సాధ్యమవుతుందని, ఆమె ద్వారా ప్రధాన స్థావరాన్నించి సహాయం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాడో అందరికంటే ముందే ఆ లీజా చనిపోయిందని తెలిసి అవాక్కవుతాడు వస్కోవ్.
రెండో వైపుకి వెళ్ళిన జేన్యా కొమెల్కోవా, రీతా ఒస్యానినాలు బతికి ఉండాలని మనసారా కోరుకుంటూ, యుద్ధంలో పైచెయ్యి పోగొట్టుకున్నందుకు బాధతో వుంటాడు. అతని మనసులో సబ్ మెషీన్ గన్నులతో జర్మన్లు ఒకవైపు, పాత రైఫిళ్ళు పట్టుకున్న రష్యన్ రెడ్ ఆర్మీ సైనిక యువతులు ఇంకోవైపూ మెదిలారు. నడుస్తూ నడుస్తూ జర్మన్లు ఆయుధాలు దాచిన ఒక స్థావరాన్ని కనుగొంటాడు. ఒకడు మంచినీళ్ళకు బయటికి రావడం చూచి పేల్చేస్తాడు వస్కోవ్. అక్కడున్న సబ్ మెషీన్ గన్నులను రెండింటిని తీసుకుని అడవిలోకి దూసుకుపోతాడు. రీతా, జేన్యాల జాడ తెలియక మిగిలింది తనొక్కడేనా అని మధన పడుతూ గందరగోళపడు తుంటాడు వస్కోవ్.
ఇంతలో "కామ్రేడ్ సార్జెంట్ మేజర్"అనే పిలుపు లోగొంతుకలోనూ, తర్వాత కాస్త పెద్దగానూ వినబడు తుంది.అతను తన కళ్ళను తానే నమ్మలేక పోతాడు. దుఃఖాన్ని ఆపుకుంటూ ఎదురెళ్తాడు. రీతా ఒస్యానినా, జేన్యా కొమెల్కోవా లిద్దరూ ఊబి బురదలో తమ స్కర్టులను ఎత్తిపట్టడం కూడా మర్చిపోయి వేగంగా వచ్చి వస్కోవ్  ని చుట్టేస్తారు. ముగ్గురికీ అదిమిపట్టిన శోకపుటేరులు ఒక్కసారిగా సంతోషసముద్రాలవుతాయి."నా బంగారు పాపలు"అని వస్కోవ్ మురిసిపోతుంటే, అతన్ని ముద్దులతో నింపేస్తారు రీతా, జేన్యాలు. ఇంకెంత మాత్రమూ నేను మీకు "సార్జెంట్ మేజర్" ను కాను. నేను మీ అన్నయ్యను. మీరు నా చిన్నారి చెల్లాయిలు అంటాడు వస్కోవ్ ప్రేమగా. ఒకేరకం కష్టాల్లో, ఆపదల్లో ఉన్నవాళ్ళు ఒకరితో ఒకరు ఎలా మమేకమవుతారో తెలిపే ఈ సీన్ చాలా గొప్పగా కన్నుల పండుగ్గా ఉంటుంది.
జేన్యా తన ప్రియ స్నేహితురాలు గాల్యా చెత్ వెర్తాక్ గురించి అడుగుతుంది. వస్కోవ్ నెమ్మదిగా నిజం చెప్తాడు.” సోన్యా గూర్విచ్ గురించి మీకు తెలుసు. మన కామ్రేడ్స్ వీరమరణం పొందారు. గాల్యా కాల్పుల్లోనూ, బ్రిచ్కీనా లీజా ఊబిలోనూ మరణించారు.అంటే మనం మొత్తం ముగ్గుర్ని కోల్పోయాం. మనం ఇరవై నాలుగు  గంటలుగా పోరాడుతున్నాం. సహాయం అందే దారి లేదు. ఇంకో ఇరవై నాలుగు గంటలు శత్రువుని నిలువరించాలి”- అని పరిస్థితిని వివరిస్తాడు. ఇక చివరి పోరాటానికి సిద్ధం కావాలంటాడు. కొంచెం పానీయాలు సేవించి, కాస్తంత తిండి తింటారు.
ఒక వాగు దగ్గర నిర్ధిష్టమైన స్థలాన్ని రీతా, జేన్యాలకు కేటాయించి, తనొకచోట నిలబడి యుద్ధానికి సిద్ధమవుతాడు. వస్తున్న జర్మన్ సైనికుల మీద కాల్పులు జరపడానికి ట్రిగ్గర్ నొక్కేలోగా నాలుగు మెషీన్ గ న్ల నుంచి వస్కోవ్ మీదకి నిప్పులు కురుస్తాయి. తలపై నుంచి దూసుకెళ్ళడం వల్ల తృటిలో తప్పించు కుంటాడు. వాళ్ళు ముగ్గురూ విజయమో వీరస్వర్గమో తేల్చుకోదల్చుకున్నారు. తమ వెనక యావత్ రష్యా ఉన్నదన్న భావం, మరెవ్వరూ కాదు, తను, తన మహిళా సైనికులు మాత్రమే దేశమాతకు మిగిలిన చిట్ట చివరి పరిరక్షకులన్నట్లుగా, తమ ముగ్గురూ - శత్రువు - రష్యా వినా యావత్ప్రపంచంలో మరెవ్వరూ లేరన్న భావం కలిగింది వారికి.
ఇంతలో జేన్యా పరిగెత్తుకొచ్చి"అక్కడ ఛూడు, వస్కోవ్, రీతా!? అని చెప్పి జేన్యా తన సబ్ మెషీన్ గన్ తో దౌడు తీస్తుంది. వస్కోవ్ కి విషయం అర్ధమై అటు పరిగెత్తుతాడు. రీతా గాయం నుండి విపరీతంగా రక్తస్రావం జరుగుతూ ఉంటే, వస్కోవ్, ఆమెకు సేవ చేస్తూనే, శత్రువు పట్ల అప్రమత్తంగా ఉంటూ, జేన్యా మెషీన్ గన్ గర్జించడాన్ని గమనిస్తాడు. జేన్యా జర్మన్ల దృష్టిని మళ్ళిస్తూ, వాళ్ళను తన వెంట తిప్పుకుంటూ, వాళ్ళ దృష్టి మళ్ళిస్తూ వస్కోవ్, రీతా లను రక్షించడానికి శయశక్తులా ప్రయత్నిస్తుంది.
తన దగ్గరున్న మందుగుండు పూర్తిగా ఐపోయేవరకూ తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా కాలుస్తూనే ఉంది. చివరికి జర్మన్లు చాలా దగ్గరనుండి సూటిగా కాల్చి ఆమెను తుదముట్టిస్తారు. తనమీద తనకు పూర్తి విశ్వాసమున్నట్లు ధీమాగా కనిపించే జేన్యా పంధొమ్మిదేళ్ళ వయసులో రాలి పోవడ మన్నది పూర్తి అన్యాయం, మహా దుర్మార్గం.
ఇక చావు బతుకుల్లో ఉన్న రీతా ఒస్యానినాకి తాను ప్రమాదంలో ఉన్నానని తెలుసు. తన ముసలి తల్లి సంరక్షణలో ఉన్న తన చిన్నారి కొడుకుని తల్చుకుని బాధపడుతుంది. జేన్యా చచ్చిపోయిందని తెలుసుకుంటుంది."నేనింకా బతికే ఉన్నాను కాబట్టి మనం ఓడిపోయే సమస్యే లేద” ని హామీ ఇస్తాడు వస్కోవ్.
పీడికెడు జర్మిగాళ్ళకోసం నేను మీ ఐదుగుర్ని బలి ఇచ్చాను. రేపు శాంతి స్థాపన జరిగి, ప్రజలు నన్ను “మా తల్లుల్ని గుళ్ళకి గురి చేసి నువ్వు మాత్రం ఎలా బతికి బయట పడ్డావ్”? అని అడిగితే నేనేం చెప్పాలి? అని విలపిస్తాడు వస్కోవ్. “ఇది యుద్ధకాలం, మేము మా దేశ రక్షణ కోసం మా ప్రాణాల్ని ఇచ్చాం. నిన్ను నువ్వు నిందించుకోకు.ఇందులో నీ తప్పేమీ లేదు” అని ఊరడిస్తుంది రీతా. ఒకసారి పరిస్థితి చూచి వస్తానని వెళ్ళబోతున్న వస్కోవ్ ని ఆపి,"ఆగు, నేనప్పుడు బయటికి వెళ్ళి జర్మన్లను గమనించినప్పుడు వెళ్ళింది నా మూడేళ్ళ కొడుకు కోసం. వాడిపేరు “ఇగోర్”. మా అమ్మ జబ్బుగా ఉంది. ఎక్కువకాలం బతకదు. మానాన్న యుద్ధంలో జాడ తెలియకుండా పోయాడు-అని చెప్పి తన కొడుకు బాద్యతని వస్కోవ్ కి అప్ప జెప్తుంది. “నాకర్ధమైంది, దిగులు పడొద్దం”టాడు వస్కోవ్. ఒక ముద్దిచ్చి వెళ్ళమంటుంది రీతా. కన్నీటి చారికల ముఖం కళావిహీనమవుతుంది. ఆమె మీద చెట్ల కొమ్మలుంచి, మళ్ళీ శత్రుదాడికి ఉరుకుతాడు. రీతా తన కణతికి గురి పెట్టి కాల్చుకుంటుంది. కాస్త మట్టి తవ్వి రీతా నక్కడ ఉంచి, జేన్యా దగ్గరికొస్తాడు. భరింపలేని బాధతో సమాధిని తవ్వలేకపోతాడు. “నన్ను క్షమించు జేన్యా, క్షమించు” అని గొణుక్కుంటూ జర్మన్ల వైపుగా సాగిపోతాడు. ఇది చాలా శక్తివంతమైన సీన్. ఇదే రీతా తన ప్రియుడు ఒస్యానినాని మొదటిసారి కలుసుకోవడం, వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా గడిపే సీన్ ప్రేక్షకులకు గుర్తొస్తుందిక్కడ!
యుద్ధమన్నది ఆయుధ సంపత్తి కలిగి ఉండడం, ఎవరికెక్కువ పోరాట శక్తి ఉంది, ఎవరు ఎవరికన్నా ఎక్కువ పేలుస్తారన్న దాని మీద కన్నా వివేచనా శక్తిలో ఎవరు ఎవరిని అధిగమిస్తారన్న దానిమీద ఎక్కువగా ఆధార పడుతుంది. సైనిక నిబంధనలు నిన్ను స్వేచ్చగా, ఎంతో ముందుకి, శత్రువు ఆలోచనలను కూడా పసిగట్టి, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేలా తయారు చేస్తారు. నిజంగానే ఒకసారి వాళ్ళు  దూరంగా కాఫీ తాగడాన్ని కూడా కనిపెట్టగలుగుతాడు వస్కోవ్. ఒక గుడిసె దగ్గర జర్మన్ల స్థావరాన్ని కనిపెడతాడు వస్కోవ్. అజాగ్రత్తగా ఉన్న ఆ సైనికులను చాలా యుక్తిగా బంధించి తన చివరి రక్తపు బొట్టులోని శక్తిని కూడా ఉపయోగించి మాతృ భూమి  రష్యాకి విజయాన్ని సాధించి పెడతాడు.
తన వెనక చాలా సైన్య ముందేమో అని భ్రమపడే జర్మన్ల నుద్దేశించి"ఒరేయ్, నా వెనక ఉన్నది సమర్ధులైన అయిదే ఐదుగురు సైనికుల్రా, అది కూడా ఆడపిల్లల్రా"- అని అంటాడు వస్కోవ్.
యుద్ధం ముగిసిన తర్వాత ఇరవై సంవత్సరాలకు కొడుకు, తన దత్తపుత్రుడు అయిన ఇగోర్,అతని భార్యతో ఆ ప్రాంతాన్ని చూడడానికి వస్తాడు వస్కోవ్. సినిమా ఈ సీన్ తో ముగుస్తుంది.
మహిళా కామ్రేడ్లు కుంగిపోలేదు. చాలా గట్టిగా, నిబద్ధతతో ఉన్నారు. శత్రు కాల్పుల అగ్ని పరిక్షలకు తబ్బిబ్బు పడకుండా ఉన్నారు. వాళ్ళు తన సొంత మృత్యువుతో తాను దాగుడు మూత లాడుతున్నట్లు న్నారు. తన పక్క పిడికెడు మట్టిని సైతం శత్రువు చేతికి చిక్క నివ్వలేదు. మహిళా కామ్రేడ్లు తమ శ్రేణిని, యుద్ధ రంగాన్ని, రష్యా ని నిలబెట్టారు- అని తలపోస్తాడు వస్కోవ్.
వాస్తవ గాధల ఆధారంగా రష్యా లోని అందమైన ప్రదేశం కొరేలాలో ఈ చిత్రం దృశ్యీకరించబడింది
యుద్ధాల వల్ల కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుని కష్టాల్లో ఉన్న అతి సాధారణమైన అమ్మాయిలు వారి అసాధారణమైన శౌర్యం, ధైర్య సాహసాలతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటారు. 18, 19 సంవత్సరాల అమ్మాయిలు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు లక్షలాది ప్రజలతో పాటు భీభత్సమైన యుద్ధంలో పాల్గొనడం, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చెయ్యడం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం!
ఈ నాటి మన ప్రపంచం విప్లవాత్మకంగా చైతన్యీకరింపబడటానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి అక్టోబర్ సోషలిస్టు విప్లవ విజయం (1917). ప్రపంచం లోనే ప్రప్రధమ సోషలిస్టు దేశం రష్యా అయితే, ఆ దేశంలో మానవత్వపు హద్దులకు వెలియైన మహిళలు రెడ్ ఆర్మీలో చేరి, విప్లవాత్మకమైన పోరాటాల్లో పాల్గొనడం అనేది ఆనాటి నుంచీ, ఈనాటివరకూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో న్యాయ పోరాటాలకు స్ఫూర్తి నిస్తుంది. ఈ సినిమా చూసిన వారెవరికైనా సోషలిస్టు భావాల తాకిడితో ప్రేరణ కలుగుతుంది.
జర్మన్ విమానాలను రాత్రివేళ చూశానని రీతా చెప్పినప్పుడు "ఆ సమయంలో నువ్వు అక్కడ ఎందుకు న్నావని వస్కోవ్ అడుగుతాడు. ‘కొన్నిప్రశ్నలకు స్త్రీలు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు’- అంటుంది కిర్యానోవా. అప్పుడు వస్కోవ్ “ఇక్కడ సైనికులూ, ఆఫీసర్లూ మాత్రమే ఉన్నారు.ఆడవాళ్ళెవరూ లేరు” – అని అంటాడు వస్కోవ్. ఆడవాళ్ళనే జెండర్ తేడా తెలియకుండా సైన్యంలో ఎంతో మమేకమయ్యారని ప్రేక్షకులకు తెలుస్తుంది. వస్కోవ్ సరదా వ్యక్తిత్వాలతో, ఉద్వేగాల్లో ఉన్న టీనేజ్ అమ్మాయిలను చూచి చిరాకు పడతాడు. కానీ  వారి క్రియాశీలత్వాన్ని తెలుసుకుని అబ్బురపడతాడు.  
రీతా ఒస్యానినా లా నటించిన ‘ఇరినా షౌచుక్’, జేన్యా కొమెల్కోవా లా నటించిన ‘ఓల్గా ఒస్ట్రుమోవా’, బ్రిచ్కీనా లీజా లా నటించిన ‘యేలినా డ్రపెకో ‘తమ అనితర సాధ్యమైన నటనా ప్రాభవంతో దిగ్భ్రాంతి కలిగిస్తారు.
ఇది అద్భుతమైన దృశ్య కావ్యం.ఈ సినిమా గురించి ఎంత చెప్ఫినా ఏదో వెలితి గానే ఉంటుంది. దృశ్య కావ్యాల్ని మాటల్లో వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ తప్పక చూసి, కలిసి చర్చించాలి !
ఇది బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీ ఫిల్మ్ అని ప్రపంచ సినీ మేధావులు కీర్తించారు.
ఈ సినిమా దారుణమైన మల్కన్ గిరి ఎన్ కౌంటర్ల గురించి దుఃఖ పడుతూ రాశాను. మనపాలకు ల కౄరత్వం కంటే జర్మన్ నాజీల ఫాసిజమే నయమనిపించింది.
ఈ సినిమాని అర్ధం చేయించిన ప్రగతి ప్రచురణాలయం వారి"ప్రశాంత ప్రత్యూషాలు" నవలకి కృతజ్ఞతలతో

                                                                                                                                -శివలక్ష్మి



    Choose :
  • OR
  • To comment
కామెంట్‌లు లేవు:
Write comments