Recent Post

3, అక్టోబర్ 2013, గురువారం

ఓపెన్ కాస్ట్ గనులు-అభివృద్ధి పేరిట ప్రజల్ని అంచులకు నెట్టివేస్తున్న ప్రభుత్వాలు

సెప్టెంబర్ 26 వ తేదీన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక(ప్రరవే) నుంచి 12 మందిమి కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల పట్టణం చుట్టూ ఉన్న గ్రామాల్లోని ఓపెన్ కాస్ట్ గనులను చూడడానికి బయలు దేరాం.మా బృందంలో మా ప్రధాన కార్యదర్శి కాత్యాయనీ విద్మహే,ఉపాధ్యక్షురాలు అనిశెట్టి రజిత,కార్యనిర్వాహక కార్యదర్శి కొండేపూడి నిర్మల,కార్యవర్గ సభ్యులు డాక్టర్ నళిని,డాక్టర్ కె.సుభాషిణి,,మందరపు హైమవతి, శివలక్ష్మి,సభ్యులు రత్నమాల, కొలిపాక శోభారాణి తాయమ్మ కరుణ,బండారు విజయ,డి.ఆర్.మంజుల ఉన్నారు.
వీలైనన్ని ఎక్కువ గ్రామాలను చూడాలనే తాపత్రయంతో తెల్లవారి నాలుగున్నరకే బయలుదేరినప్పటికీ హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి,గాంధీనగర్,నల్లకుంట,బంజారాహిల్స్,దిల్ షుక్ నగర్ మొదలైన చోట్ల ఇద్దరు ముగ్గురుగా జతకూడిన మేమందరం సిటీ దాటేసరికే ఆరుగంటలైంది.దిగితే ఎక్కడ లేటవుతుందోననే భయంతో అల్పాహారం వెహికల్ లోనే ముగించుకుని, మంచిర్యాలకి మిట్ట మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకున్నాం.మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సంఘం నుంచి నీలిమ తన స్థానిక ప్రజాసంఘాల బృందంతో సిద్ధంగా ఉంది.
ముందుగా మేము సింగాపూర్ లో తవ్వుతున్న గనుల్ని చూశాం.రాక్షసి లాంటి పొక్లైన్ ట్రక్కులు పదిదాకా ఉన్నాయి.వాటిని నిరంతరం ఒక్క నిమిషం తీరిక లేకుండా డ్రైవర్లు బొగ్గు తవ్వడానికి వినియోగిస్తున్నారు.పొరలు పొరలు గా బొగ్గుతో ఉన్న భూమిని చూశాం.పెద్ద పర్వతంలా పేరుకుపోయిన తవ్విపోస్తున్న ఇసుక గుట్ట దూరంగా కనిపించింది.అది ఒక చిన్న ఊరంత జాగా ఆక్రమించింది.బొగ్గు తవ్వుతున్న కొద్దీ అది పాపంలా పెరిగిపోతూనే ఉంటుంది.300 అడుగుల వరకూ ఉన్న బొగ్గును తవ్వితీస్తూనే ఉంటారట. తవ్వేకొద్దీ పేరుకుపోతున్న ఇసుకతో, దుమ్ముతో చుట్టుపక్కల ఊళ్ళన్నీ కాలుష్యమయమైపోతున్నాయి. మొత్తం 880 ఎకరాల్లో 19 గ్రామాలను సర్వ నాశనం చేస్తూ,ఆ గనులు తవ్వి పొయ్యగా వచ్చిన మట్టితో ఊళ్ళను బొందలగడ్డలుగా మారుస్తున్నారని ప్రజలు చెప్పారు. 25 ఏళ్ళకు కాంట్రాక్టులు కుదుర్చుకున్నారనీ, ఇప్పుడు ఏడేళ్ళే అయిందనీ స్థానిక ప్రజాసంఘాల మిత్రులు శ్రీమన్నారాయణ,సమ్మయ్యలు చెప్పారు.ఎవరివన్నీ చేయిస్తున్నారని అడిగితే సింగరేణి యాజమాన్యంతో కూడి కొన్ని ప్రైవేట్ సంస్థలు SVS,VPR,BGR అనే కంపెనీలు అని చెప్పారు గానీ వాటిపూర్తి పేర్లు గానీ వెనక ఉన్న రాజకీయ నేతల పేర్లు గానీ చెప్పలేకపోయారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పేరు చెప్పారు. ఉద్యమపార్టీ టి.ఆర్.ఏస్.తో సహా ఈ పాపంలో అన్ని రాజకీయ పార్టీలూ ఉన్నాయని చెప్పారు.ప్రజలను మోసం చేసే విషయంలో పార్టీలన్నీ ఒక చెట్టు కొమ్మలే కదా!


ఆ పక్కనున్న గ్రామ మహిళలు "దుర్గం పోశవ్వ", “రాజమ్మ”, “లక్ష్మి” లతో మాట్లాడాం.శ్రీరాంపూర్,గంగాపూర్ గ్రామ పంచాయితీ లోని 4000 మంది జనాభా అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పారు.వాళ్ళ పంట భూముల్ని,ఖాళీ జాగాల్ని ఆక్రమించుకుని,వాటికి చిల్లి గవ్వకూడ డబ్బు చెల్లించలేదని చెప్పారు. తవ్వే గనుల్లో కూలి పనుల ఆశ లేకుండా చేశారని చెప్పారు. "డప్పు డప్పు శబ్దాలతో కునుకుండదు.మగవాళ్ళెవరూ లేనప్పుడు పగలు మూడింటికి గనులు పేలుస్తారు.ఆ పేలుళ్ళకు గుండెలు దడ దడ లాడతాండయి.మస్తు భయమైతాంది. పేలుడు జరిగినప్పుడల్లా ఇంటిగోడలు పగుళ్ళు బారబట్టినయి.,ఉండలేక ఊరిని వదిలి వెళ్ళలేక,చావలేక బతకలేక బతుకులీడుస్తుంటిమని చెప్పింది రాజమ్మ”. "ఎప్పుడెవరిని అడిగినా మీ ఊరికేం గాదు అనబట్టిరి.మాకెవరికీ చెప్పకుండానే భూమిపూజలు చేస్తుంటిరి"అని లక్ష్మి చెప్పింది. మా బతుకులు సర్వ నాశనం బట్టిస్తుండ్రని పోశవ్వ చెప్పింది.

ఆ తర్వాత మేము ఎర్రగుంటపల్లె వెళ్ళాము. ఇక్కడ మొత్తం 300 ఇళ్ళు-900 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామస్థులందరూ యాదవ కులస్థులే! ప్రతి ఇంటికీ నాలుగు పాడి పశువులు,ఒక్కో కుటుంబానికి రెండు నుంచి నాలుగు ఎకరాల భూమీ ఉన్నాయి. పక్కనున్న ఊళ్ళల్లో పాలమ్ముకుంటారు. పొలాల్లో వ్యవసాయం చేసుకుంటారు.ప్రకృతి పచ్చదనాలమధ్య స్వయం సమృద్ధితో కళ కళ లాడే మనుషులతో,యూనిఫారాలతో వెలుగులు చిమ్ముతున్న ముఖాలతో స్కూళ్ళకు పోతున్న చిన్నారులతో ఊరంతా ఒకప్పటి భారత గ్రామీణ దృశ్యంలా ఉంది. ఈ ఊళ్ళో ఒక వాగును చూశాం.దాన్ని గ్రామస్థులందరూ "పాలవాగు" అని పిలుచుకుంటారు.మేము ఎర్రటి మండుతున్న ఎండలో వెళ్ళాం.ఆ వాగులోని చల్లని,స్వచ్చమైన నీటితో సేద దీరాం.చుట్టూ పచ్చని పొలాలు.కమ్మని హాయి గొలిపే గాలులు నగర కాలుష్యానికి బలవుతున్న మా కళ్ళకీ శరీరానికీ విందు చేశాయి.కానీ విధ్వంసం కానున్న మ్యాప్ లో ఎర్రగుంటపల్లె గ్రామం ఉందని ఈ గ్రామస్థులు కనిపెట్టారు. అశోక్,అహ్మద్ లాంటి యువకులు " ఓపెన్ కాస్ట్ వ్యతిరేక కమిటీ" లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వృద్ధులతో సహా స్త్రీ-పురుషులందరూ చాలా చైతన్యవంతంగా కనిపించారు . 2013-ఏప్రిల్ 15 న సింగరేణి జనరల్ మేనేజర్ ఆఫీస్ ఎదుట జరిగిన ధర్నా లో పాల్గొన్నారు. మహిళలు పద్మావతి,లక్ష్మి,జి.పద్మ ఇంకా చాలా మంది గొప్ప పోరాట పటిమతో ఉన్నారు.అందులో జి.పద్మ అసలు మీరెవరు?అందరూ వస్తారు. రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తారు.ఎవరు మాకు మేలు చేస్తారో,ఎవరు కీడు చేస్తారో ఎలా తెలిసేది?అని ప్రశ్నించింది.మాతో ఉన్న స్థానిక సభ్యులు నచ్చచెప్పాకే మాతో అందరూ మాట్లాడ్డం మొదలెట్టారు.

మ్యాప్ లో మా గ్రామం ఎందుకుందని అక్కడ సర్వేచేస్తున్నవారిని జి. పద్మ నిలదీస్తే "పెద్ద మనుషులున్నప్పుడు అంటే అధికారులు,కలెక్టర్లు లాంటి వాళ్ళున్నప్పుడు అలాంటి ప్రశ్నలడగొద్దు.ప్రజాసంఘాలతో రావద్దు.విడిగా అడగండి" అన్నారట.

ఈ గ్రామం గాంధీజీ చెప్పిన స్వయం సమృద్ధి సంపూర్ణ గ్రామీణ వ్యవస్థకి ప్రతీకగా ఉన్నప్పటికీ,ఈ ప్రజలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమైనప్పటికీ రాక్షస రాజ్యం బంగారు "పాలవాగు"ను ఏమి చేయనున్నదో అనే సందేహంతో గోరటి వెంకన్న "వాగు ఎండి పాయెరా" పాట గుర్తొచ్చి వ్యధతో మనసంతా వికలమైపోయింది

మధ్యాన్న భోజనం తర్వాత "దుబ్బగుడా"గ్రామానికెళ్ళాం.ఏ ఇంట్లో చూసినా పచ్చని చెట్లు మిల మిలా మెరుస్తున్న రకరకాల రంగుల పూలతో రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు పరవశం కలిగించాయి.బీర,సొర,కాకర,గోంగూర మొదలైన కూరగాయలు ఇంటికీ,ఇరుగు పొరుగువారికీ సరిపోయేటట్లు తాజాగా,నేవళంగా నిగనిగలాడుతూ కనిపించి నోరూరించాయి. ఇక్కడ చుట్టు పక్కలనున్న కొన్ని గ్రామాల ప్రజలు,ప్రజా సంఘాలు,మీడియాతో జమయ్యారు. "తెలంగాణా పర్యావరణ పరిరక్షణ కమిటీ"నుంచి వచ్చిన ఉపాధ్యక్షులు మాతో మాట్లాడారు.”మేము సమావేశమయిన ఇంటిముందున్న రోడ్డు ఓరియంటల్ సిమెంట్ ఫ్యాక్టరీ కి దారి.అదే ఆ మండల్ కి ముఖద్వారం.అక్కడ 349 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే 700 ఎకరాల ప్రజల పట్టా భూములున్నాయి.అక్కడ నివసించే ప్రజలందరూ రోజు కూలీలే!గ్రీన్ హంట్ అభివృద్ధి అని చెప్పి 94 ఎకరాలు కబ్జా చేసి 1962 నుంచి ఒక్క పైసా ఇవ్వలేదు. నివసిస్తున్న ఇళ్ళు తప్ప మిగిలిన ప్రజల భూములూ,ఖాళీ జాగాలన్నీ స్వాహా కానున్నాయనీ,ఆ ప్రజలందరూ నిర్వాసితులు కానున్నారనీ గ్రీన్ హంట్ పేరిట మాన్ హంట్ చేస్తున్నారని చెప్పారు."అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసాన్ని ఖండిద్దాం " "స్వావలంబన,స్వయం పాలన కై పోరాడుదాం" అని అక్కడ గుమిగూడిన ప్రజలందరూ నినదిస్తూ "తెలంగాణా నిర్వాసిత వ్యతిరేక పోరాటాన్ని బలంగా నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

మా వేదిక సభ్యులందరం బాధిత ప్రజల్నీ ముఖ్యంగా ఆ యా గ్రామాల మహిళల్నీ కలిసి మాట్లాడాము.అందరిదీ ఒకటే ఘోష."మా భూములు,మా ఇళ్ళు,మా బర్రెలు,మా ఊళ్ళు ధ్వంసమైపోతే మా బతుకులేం కావాలి? పోరాడకపోతే బతుకు లేదు.బతుక్కోసం చావుకు తెగించి అందరం పోరాడతామని చెప్పారు.మొత్తం విధ్వంసంలో ఇదీ ఒక భాగమనీ,ప్రజలకు వ్యతిరేకమైన అన్ని విధ్వంసాలనూ వ్యతిరేకిస్తామనీ మీ పోరాటాలకు మద్దతు నిస్తామనీ మా వేదిక చెప్పింది.వేదికలోని ప్రతి ఒక్కరూ ఆ ప్రజలకు స్వాంతన కలిగించే మాటలు చెప్పాం. నందిగ్రాం,సింగూర్,సోంపేట,కాకరాపల్లి పోలవరం,వాకపల్లి,భల్లుగుడా,దుబాయి,జిందాల్ కంపెనీల విధ్వంసాలు, కాశీపూర్ ప్రాంతంలో గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా,నియంగిరి కొండల్లో వేదాంత కంపెనీ అక్రమ తవ్వకాలపై పోరాటాలేకాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి పోరాటాలే జరుగుతున్నాయి. ప్రజలు సాహసంగా ఎదురొడ్డి నిలిచి తమ వనరులను రక్షించుకుని , పోరాడే ప్రజలకు స్ఫూర్తి నిస్తున్నారని ధైర్యం చెప్పాం .

ఓట్లేసి గెలిపించిన పాలకుల్నిఈ ప్రజలు ఏమీ అడగలేదు."మాకు ఇళ్ళు కట్టించి ఇవ్వమనిగాని,మా పొలాలకు విద్యుత్తునివ్వమనిగాని,మా పిల్లలకు చదువు చెప్పించమని గాని,మాకు వైద్యం చేయించమని గానీ-ఇలాంటి సహకారాలకోసం అర్ధించలేదు. స్వేచ్చగా,ఆత్మాభిమానంతో వాళ్ళ మనాన వాళ్ళు బతుకుతుంటే, అలా కూడా బతకనివ్వడం లేదు. ఈ ప్రాంతం శ్రీకాకుళ మహత్తర పోరాటంతో సాధించుకున్న 1/70 చట్టం పరిధిలో ఉండగా రాజ్యాంగ ఉల్లంఘన చేసి వాళ్ళ గ్రామాల్లోకి చొరబడి మనుషుల్ని నాశనం చేసే ఈ అభివృద్ధి ఏ ప్రజలకోసం? "మీ పొలాలకు అధికమొత్తాల్లో డబ్బు చెల్లిస్తామనీ,ఇంకో చోట ఇళ్ళు కట్టించి ఇస్తామనీ,ఇంటికో ఉద్యోగం వచ్చేలా చూస్తామనీ -ఇలా సింగరేణి,ప్రైవేట్ సంస్థల బ్రోకర్లు బోలెడన్ని కల్ల బొల్లి కబుర్లు చెబుతారు.ఇంతవరకూ ఆక్రమించిన భూములకు ఏమీ చెల్లించిన పాపాన పోలేదు.ఒకవేళ ఇస్తామంటే కూడా అసలు వాళ్ళెందుకు ఖాళీ చెయ్యాలి? ప్రకృతితో,తమదైన ఇంటితో, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ప్రేమలతొ ఉన్న ఇరుగుపొరుగుతో ,గొడ్డూ-గోదాతో,పాలిచ్చే పశువులతో,మేకలతో ,కోళ్ళతో రకరకాల అనుబంధాలుంటాయి.30 అంతస్థులు కట్టుకున్నవాడూ,ఇళ్ళను ప్రజల సొమ్ముతో రాజసౌధాలను తలదన్నేలా నిర్మించిన వాళ్ళూ, ఇళ్ళ ప్రాంగణాల్లోనే విమానాశ్రయాలనేర్పరచుకున్న వాళ్ళూ - ఇలాంటి వాళ్ళనందర్నీ వాళ్ళున్న ఇళ్ళనీ,ఊళ్ళనీ వదిలేసి వేరే చోటికి పొమ్మంటే పోతారా? అసలు వీళ్ళని ప్రభుత్వం పొమ్మనదు.ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వం దృష్టిలో మార్కెట్ కి పనికొచ్చే ప్రజలు మరి! అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమనీ - ప్రజల యొక్క, ప్రజలకొరకు, ప్రజల చేత పాలించబడుతుందని పాలకులు చెప్పేమాటలు ఎంత బూటకం?

దుబ్బగుడా గ్రామం తర్వాత కల్యాణిఖని (KK2 మెగా) చూడడానికి వెళ్ళాం. ఈ కెకె2 మెగా ఓపెన్ కాస్ట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గని వద్ద ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు.బాధిత గ్రామాల ప్రజలు,చుట్టుపక్కల కాలుష్యానికి గురవుతున్న గ్రామాల వాళ్ళు, ఓపెన్ కాస్ట్ కి గురి కాబోతున్నవాళ్ళు-ఈ ప్రజలందరూ ప్రజాసంఘాలతో కలిసి కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ముక్తకంఠంతో ఓపెన్ కాస్ట్ ససేమిరా వీల్లేదని చెప్పారు. వీళ్ళెంత మొత్తుకుంటున్నా వినకుండా సింగరేణి యాజమాన్యం వేరే గ్రామాలనుంచి ప్రజలను తరలించుకు వచ్చి కలెక్టర్ ఎదుటికి తీసుకువచ్చారట. నిజానికి బాధిత గ్రామాల ప్రజల సమక్షంలో అభిప్రాయసేకరణ జరగాలి.పబ్లిక్ హియరింగ్ పేరిట దాదాపు 3000 మంది పోలీసు పహారా మధ్య ఒక చర్చను తూతూమంత్రంలా జరిపి,ఈ ప్రాంతం కొండంత అభివృద్ధి చెందబోతుందని వేరే వూళ్ళ అమాయక ప్రజల్ని మభ్యపెట్టి,నమ్మించి వాళ్ళకనుకూలంగా మాట్లాడించడానికి ప్రయత్నిస్తే, నోరెత్తనివ్వని పోలీసుల మధ్యనుంచి కూడా బాధిత ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారని చెప్పారు. "ఓపెన్ కాస్ట్ లతో అంచెలంచెలుగా నరక యాతనలు పెట్టే కంటే ఒకేసారి బాంబింగ్ చేసి మా ప్రాణాలు తీసి మీ ఇష్టం వచ్చింది చేసుకోమని ప్రజలు చెప్పారని" ప్రజా సంఘాల మిత్రులు చెప్పారు.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ప్రజల సంక్షేమం,సామాజిక బాధ్యతలను మరిచి ఉత్తర తెలంగాణాలో మొత్తం 72 బొగ్గుబావులను ఓపెన్ కాస్ట్ లుగా మార్చడానికి నిర్ణయించి ప్రైవేట్ సంస్థలతో జత కట్టి,19 గ్రామాల్లో ఉన్న 30000 మంది ప్రజలను నిర్వాసితులుగా మార్చబోతుంది. అసలు బొగ్గు బావుల ద్వారా కూలీలకు లభిస్తున్న జీవనోపాధిని కొల్ల గొట్టి, ప్రణాళికా బద్ధంగా ఒక్కొక్క బావినీ మూసేస్తున్నారు. గనుల్లోపలికి దిగి పనిచేసే యువకులు ఎంత దృఢకాయులైనా,ఎంత బలవంతులైనా 5 నుంచి 10 ఏళ్ళ లోపు పీనుగుల్లా మారిపోతారట. గనుల్లో పని చేసిన బలహీనంగా ఉన్న వృద్ధులతో మాట్లాడినప్పుడు మాకు తెలిసిందీవిషయం.ఆ 5,10 ఏళ్ళ జీవనాధారాన్ని కూడా లేకుండా చేసి అతి తక్కువ కూలీలతో ఓపెన్ కాస్టులద్వారా ఊళ్ళకి ఊళ్ళు స్మశానాలుగా మారుస్తున్నారు. కాలుష్యం బారిన పడేసి ప్రజల్ని నడిచే శవాల్ని చేస్తున్నారు. గేట్ దాటి లోపలికి ప్రవేశించగానే

““పచ్చదనం ప్రకృతికి ఆనవాలు” “వన సంరక్షణ మన సంరక్షణ”

“ఇంటింటి చెట్టు ఊరూరా వనం “ “ఆకుపచ్చ వనాలు మానవాళికి వరాలు”

అని రాసి ఉన్న బోర్డులు అడుగడుగునా కనిపించాయి. చెప్పేదొకటి-చేసేదొకటి గా ఉన్న ప్రభుత్వ కపట నాటకాలర్ధమై దిగులు కమ్ముకుంది. మేము వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ “ మీ గ్రామంలో ఎవరైనా సింగరేణి యాజమాన్యం,ప్రైవేట్ సంస్థలు చెప్పే మాయమాటలు నమ్ముతారేమో,వాళ్ళ పక్షం వహించి గ్రామాన్ని మోసం చేస్తారేమో “ అని మేమడిగితే "మేమందరం ఒకటే-మాలో అలాంటివారెవరూ లేరు" అని నాలుగు గ్రామాల ప్రజలూ నమ్మకంగా చెప్పారు. పోరాడకపోతే బతుకుండదనే ఎరుకతో ఉన్నారు . ఈ ఆశ ఒక్కటే కాస్తంత ఊరటనిచ్చింది. అర్భకజీవులం.ఒక్కరోజు ఎండకే అలిసి ఆపసోపాలు పడ్డాం.ఆ రోళ్ళు పగిలే ఎండ వేడిలో గని పేలుళ్ళను భరిస్తూ పోరాడుతున్న ఆ ప్రజల పోరాట పటిమ మీద నమ్మకంతో భవిష్యత్తు భరోసా కలిగింది.

చివరిగా అల్లం రాజయ్య సార్ ఇంటికి 7.30 కి వెళ్ళాం.వారూ-వారి సహచరి శోభ,మంచిర్యాల లోని వారి సన్నిహిత మిత్రులు మాకోసం వేచిఉన్నారు.నీలిమతో ఉన్న మిత్రులందరూ మాతోనే ఉన్నారు. ఆయన్ని చూసి మాకూ-మమ్మల్ని చూసి సార్ కూ ఒకటే ఆనందం-ఎడ తెగని మాటలు.అందరికీ లోపల హైదరాబాద్ చాలా దూరం .వెంటనే బయలుదేరకపోతే చేరుకోలేం అని ఆందోళన. అటూ -ఇటూ గాకుండా వెళ్తే ఇబ్బంది పడతారు.భోజనం చేసి తీరాల్సిందే తొందరగా తిని బయలుదేరమని పట్టుబట్టారక్కడున్నవారందరూ. వారి స్నేహితులు కిషన్ గారు మాఇంట్లోనే డిన్నర్ చెయ్యాలి.మిమ్మల్ని తీసుకొస్తానని మా శ్రీమతికి చెప్పి వచ్చానన్నారు.పొలో మని అందరం వారింటికి వెళ్ళాం. ఏంచేస్తున్నా అనేక విషయాల మీద సార్ కీ మాకూ నిరంతర సంభాషణ సాగిపోతూనే ఉంది. మధ్యలో వారి స్నేహితురాలు అద్భుతంగా పాట పాడి చెవులకు విందు చేశారు.పసందైన భోజనం తర్వాత రాత్రి 9.30-10.00 గంటల మధ్య వదల్లేక వదల్లేక ఆత్మీయ వీడ్కోలు తీసుకుని మా బండి భారంగా బయలుదేరింది.తెల్లవారుజామున హైదరాబాద్ కి చేరుకున్నాం.రాజయ్య గారి మాటలు మరీ మరీ తలచుకుని "అవునూ, మన నగరంలో ఇంత ఆత్మీయంగా ప్రేమగా మాట్లాడే మనిషి ఒక్కరూ కనిపించరేమిటి? అని కొండేపూడి నిర్మలా-నేనూ అనుకుని "ఎందుకంటే అది నగరం కాబట్టి" అని మాకు మేమే సమాధానం చెప్పుకున్నాం.

కల్యాణిఖని గనిని (KK2 మెగా) బయటినుంచి చూస్తేనే ఝఢుసుకున్నాను. తిరుగు ప్రయాణం లో కళ్ళు మూసుకున్నా నాకు ఆ మురికి గనే గుర్తొస్తుంది.ఒక కార్మికురాలిగా యజమాన్యాలు,అధికారులు పెట్టే బాధలు,హింసలు తెలుసు గనుక ఆ కార్మికుల కష్టాలు,స్పార్టకస్ సినిమా గుర్తొచ్చి మనసులో అవే అవే దృశ్యాలు రీళ్ళు తిరుగుతున్నాయి. నాకైతే బెర్లిన్ గోడ గురించి చదువుకున్న "డెత్ స్ట్రిప్" గుర్తుకొచ్చింది.ఆ గనుల్లోపలికి 300 ,400 అడుగుల లోపలికి దిగి, ప్రాణాలకు తెగించి పని చేసిన కార్మిక సోదరులకి చెయ్యెత్తి దణ్ణం పెట్టాల్సిందే! బొగ్గుగని కార్మికుల గురించి చదువుకున్నదంతా గుర్తుకొచ్చి వళ్ళు గగుర్పొడిచింది. గని సొరంగాల్లో మనిషి పీల్చే గాలిలో కార్బన్ మోనాక్సైడ్ లాంటి ప్రాణాంతక విషవాయువు లుంటాయి. లోపలికి దిగుతూ పని చేసే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది.ఒకచోటికి వచ్చి గాలి పీల్చుకోవాలి.పొరపాటున కార్బన్ మోనాక్సైడ్ పీలిస్తే మనిషి చనిపోతాడు. ఒక్కోసారి ఆకస్మిక పేలుళ్ళు సంభవిస్తాయి.ఉదాహరణకి ధన్ బాద్ లోని ఘోరీ (GHORI) బొగ్గు గనిలో వాయువు పేలి 1965 మే 28న 375 మంది కార్మికులు చనిపోయారు. కొన్నిసార్లు గనులు అకస్మాత్తుగా కుప్పకూలిపోయి నీళ్ళు మహోధృతంగా రాకెట్ స్పీడ్ తో ఉబికి వస్తాయి. ఉదాహరణకి. 1975 డిసెంబర్ 27 న జార్ఖండ్ లోని ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (INDIAN IRON AND STEEL COMPANY - IISCO కి సంబంధించిన చస్నాలా(CHASNALA) బొగ్గుగని కూలడంతో నిమిషానికి 7 మిలియన్ గాలన్ల నీరు వాయువేగంతో ఉప్పెనలా ముంచెత్తింది.ఆ నీటిలో ఇరుక్కుపోయి 372 మంది కార్మికులు మరణించారు. అలాగే అమెరికా లోని కెంటకీ,పెన్సిల్వేనియా,ఇల్లినాయ్,ఉఠా(UTHA) లలో కూడా ఇలాంటి యాక్సిడెంట్లే జరిగాయి.
ఈ థీం తో "కాలాపత్తర్" సినిమాకూడా వచ్చింది. దానికంటే ముందు సమ సమాజాన్ని కాంక్షించే మానవాళి కథానాయకుడు "స్పార్టకస్" సినిమా ఒపెనింగ్ సీన్ లో మొట్టమొదటగా కనిపించేది కాపర్ గనే!

ఆ కాలం నుంచి అంటే స్పార్టకస్ కాలం నుంచి ఈనాటి వరకూ తమ ప్రాణాలను పణంగా పెట్టి గనుల్లో వీరోచితంగా కృషి చేస్తూ ప్రపంచానికి వెలుగు దారులు వేస్తున్న కార్మికుల పట్ల-వారి కుటుంబాల పట్ల మనందరం ముఖ్యంగా ప్రభుత్వాలు ఎంత బాధ్యతగా ఉండాలి?అదేమంటే అందుకే గదా గనులు వద్దని ఓపెన్ కాస్టులు పెడుతున్నది అని కూడా అనగలవు గడుసు ప్రభుత్వాలు.అందుకే 1990ల నాటినుంచి ప్రపంచీకరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు,బహుళజాతి సంస్థలు,ఎన్.జి.వోలు TINA (There is no alternative) – ఓపెన్ కాస్టులు చెయ్యడం తప్ప ఇంకో దారి లేదని ప్రచారం చేస్తున్నాయి. విధ్వంసాలు సృష్టించి కళ కళలాడే జీవన సౌందర్యాన్ని విస్తాపన చెయ్యడం చాలా దుర్మార్గం. అసలు దేనికైనా "మనిషి" కేంద్రం కావాలి.మనిషికి నష్టం చేసే ఎంత గొప్ప చర్యలైనా అవి ఎన్ని సంపదలు తెచ్చి పెట్టేవైనా పక్కన బెట్టి,మనుషుల సంక్షేమం గురించి అన్ని ప్రభుత్వాలూ ఆలోచించి తీరాల్సిందే!

- శివలక్ష్మి

ప్ర ర వే కార్యవర్గ సభ్యురాలు  


    Choose :
  • OR
  • To comment
కామెంట్‌లు లేవు:
Write comments