Recent Post

12, జనవరి 2017, గురువారం

అందమైన కల లాంటి ఆ నేలా గాలీ

 

మా కోడలి  అక్కలిద్దరు సంధ్య,రూపల్ ఇండొనేషియాలో టీచర్స్ గా పని చేస్తున్నారు. పదే పదే రమ్మంటున్న వాళ్ళ  ఆహ్వానం మీద  ఇండొనేషియా వెళ్ళాలని అనుకున్నాం. అది ఒక ద్వీప దేశం. చిన్నప్పుడు రామాయణ పాఠాల్లో చదువుకున్న జావా,సుమత్రా దీవులు ఇండోనేషియా లోనివే కనుక చూస్తే బాగుంటుందనుకున్నాం. ఇటీవల మాకుటుంబం లోని - మేమిద్దరం హైదరాబాద్ నుంచి, హిమాన్షి (కోడలు) , శయన్ (మనవడు) డిల్లీ నుంచి , మా బాబు స్వరూప్  లే(లఢక్) నుంచి, రాజ్(రూపల్ భర్త) గౌహతి నుంచి బయల్దేరి, అందరం హైదరాబాద్ లో కలిసి డిసెంబర్ 23 న ఇండొనేషియా రాజధాని జకర్తా చేరుకున్నాం. అక్కడికెళ్ళాక న్యూజీలాండ్ లో చదివే సంధ్య కొడుకు సహర్ష్ జాయినయ్యాడు.అక్కడే ఉంటున్న సంధ్య,రూపల్ ఆమె  కూతురు రసజ్ఞ -ఇదీ మొత్తం 10మంది మాగ్రూప్.

అప్పటికే జకర్తాకి చేరిన సహర్ష్, రూపల్  తో కలిసి మమ్మల్ని జకర్తా ఎయిర్ పోర్ట్ కొచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఇతర దేశాలనుంచి అక్కడి పని చెయ్యడానికొచ్చే ఉపాధ్యాయులకి ఇండొనేషియా ప్రభుత్వం ఉచితంగా ఇల్లు,అవసరమైన గృహోపకరణాలన్నీ ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకి ప్రభుత్వం సమకూర్చిన ఇళ్ళు కూడా స్కూళ్ళకి నడిచి వెళ్ళేంత దూరంలో, మంచి పరిసరాల్లో, అందమైన ఫర్నిచర్ తో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. ఉపాధ్యాయుల  పిల్లలకి ప్రభుత్వమే ఉచిత విద్య నందిస్తుంది. అలా సంధ్య పిల్లలిద్దరూ జునియాలీ, సహర్ష్ 12th క్లాస్ వరకూ ఉచిత విద్య నభ్యసించి ఇప్పుడు పైచదువుల కెళ్ళారు.ఇప్పుడు రూపల్ కూతురు రసజ్ఞ 12th క్లాస్ ఇండొనేషియాలోనే చదువుతుంది. తన క్లాస్ టీచర్సందరూ భారతీయులేనని చెప్పింది. ఈ టీచర్ల పిల్లలందరూ 12th క్లాస్ వరకూ ఇక్కడ చదివి,తర్వాత వాళ్ళ వాళ్ళ అభిరుచుల కనుగుణంగా పై చదువులకు విదేశాలకెళ్తున్నారు.
జకర్తాలో ఉన్న నాలుగు రోజులూ సంధ్య, రూపల్ అత్యంత ఆత్మీయమైన ఆతిధ్యమిచ్చారు. అలాగని వాళ్ళేమీ పదిమంది మున్నామని  హైరానా పడలేదు. వాళ్ళు వంట చెయ్యనే లేదు. అసలా సమాజంలో వంట చేసుకునే కాన్సెప్టే లేదు. ఈ విషయం నాకు భలే నచ్చింది!అమెరికాలో ఇండియాని నెత్తిన మోసుకెళ్ళి ఇక్కడి వంటలతో ఆడపిల్లలందరూ తెగ యాతన పడుతున్నారు! కానీ “రోమ్ లో రోమన్ లా జీవించు” అన్నట్లు మా సంధ్య,రూపల్ ఎంచక్కా వంటలకు గుడ్ బై కొట్టేశారు!!
“The first condition of understanding a foreign country is to smell it”- అని Rudyard Kipling  అన్నట్లు Food is the best way to represent a country because of its distinctive aromas and flavours. రోడ్ల మీద ఎంతో రుచికరమైన,అత్యంత శుభ్రమైన ఆహారం దొరుకుతుంది.ఏదో అయిందనిపించే టట్లుండదు.నోరూరించే జిహ్వ రుచులతో, స్పైసీగా తిన్నాం.కొంచెం అన్నం, ఒక కప్పు ఆకు కూరా, చికెన్ మూడూ కలిపిన "పడాంగ్" అనబడే భోజనం వేడి వేడిగా దొరుకుతుంది ఆహా!ఎంతో రుచిగా ఉంది! ఎంతో రుచి, ఎంతో రుచి అని పాడుకున్నాం!ఖచ్చితంగా సగం సగం చేసి ఎనిమిది ముక్కలుగా చేసిన, మషాలా దట్టించిన, అద్భుతంగా ఘుమ ఘుమలు వెదజల్లే   నాలుగు పెద్ద పెద్ద చేపల్ని కొనుక్కుని అన్నంతో తిన్నాం.మా షయన్ కి హిమాన్షికి చేపలంటే చాలా చాలా ఇష్టం.అవి తిన్న తర్వాత తీసిన ఫొటోలో వాళ్ళ మొఖాల్లో ఆనందం చూడండి!!


పిల్లల చదువుల కోసం మా సంధ్య,రూపల్  డెహ్రాడూన్ నుంచి వెళ్ళి కుటుంబాలకు దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. అక్కడ ఈవ్ టీజింలుండవు.అత్యాచారాల చాయలేలేవు.ఆ రకంగా ఇండొనేషియా చాలా సురక్షితమైన దేశమని వాళ్ళిద్దరూ చెప్పారు. అత్యాచారాలతో అట్టుడిగిపోతున్న భారత్ గుర్తొచ్చి వేదన కలిగింది. వాయు కాలుష్యముండదు.పెట్రోల్ చాలా చౌకగా దొరుకుతుంది.అదెలా సాధ్యమని అడిగితే మన దేశంలో సెంట్రల్ ఎక్సైజ్,సర్వీస్ టాక్సులు చాలా ఎక్కువుంటాయని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ లో పనిచేసిన మా ఆయన చెప్పారు. ఇండొనేషియాలో లీటర్ పెట్రోల్ మన 30రూపాయల కంటే తక్కువే.మనకి 70 రూపాయలు.రిఫైనరీ లీటర్ ధర రూ 16.50, టాక్స్ 11.80%, ఎక్సైజ్ డ్యూటీ 9.75%, వ్యాట్ సెస్ 4%, స్టేట్ టాక్స్ 8%-ఈ మొత్తం కలిసి 50.05. కానీ భారత ప్రభుత్వం ఇంకో 20రూ అదనంగా మన చెవులు పిండి వసూలు చేస్తుంద ! 20రూ దేనికోసం వసూలు చేస్తుందో మాత్రం ప్రజలకు చెప్పదు !!
మన లాగే ఇక్కడి వారివి మామూలు మధ్య తరగతి జీవితాలే! సాదా సీదా జీతాలే!! కానీ మన ఉపాధ్యాయులే కాదు,ఉన్నతోధ్యోగుల జీవితాలతో పోల్చి చూసినా ఈ దేశంలో చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నారనిపించింది.ఏ రకమైన ఒత్తిడీలేదు.ఇందు గల డందు లేదన్నట్లు మనకి యెల్లడలా ప్రత్యక్షమై, పీల్చి పిప్పి చేసి, అనారోగ్యాల పాల బడేస్తున్న దుమ్ము  అస్సల్లేదు.అమెరికాలో దుమ్ముండదనుకుంటారు గానీ అక్కడి  మూల మూలల్లో కనిపించే దుమ్ము లాంటిది కూడా యిక్కడ కనిపించదు.ఎటు చూస్తే అటు పచ్చని చెట్లతో పరిశుభ్రంగా ఉంటుంది. బట్టలు మాయవు. అంత పచ్చదనం నేనెక్కడా చూడలేదు.తాజాగా,నేవళంగా,కళ కళ లాడుతూ చెట్లూ,ఆకులూ,పువ్వులూ ఆహ్లాదం కలిగిస్తాయి. జకర్తా నగర శివార్లలోనూ,బాలీ లోనూ తిరుగుతుంటే రోడ్డు కిరువైపులా వరి పంట పొలాలు కనిపిస్తూ కన్నుల పండుగ చేస్తాయి.కొన్నిచోట్ల లోయల్లాగా ఉండి, లోయ నిండా పరుచుకున్న పచ్చదనంతో కళ కళలాడుతుంటాయి. ఆ వరి పంట నీళ్ళ మధ్య మధ్య లో చిన్న చిన్న చేపల్ని వదుల్తారనీ, ఆ చేపలు తిరుగుతూ,పెరుగుతున్న క్రమంలో వాటి మల మూత్రాలతో పంట బాగా పండుతుందని,ఆ ప్రజల ప్రధాన మైన పంట వరేనని తన పాఠాల్లో ఉందని రసజ్ఞ  మాకు చెప్పింది!
వాళ్ళ ప్రధానమైన ఆహారం మనలాగే అన్నం.రోజులో నాలుగైదుసార్లు అన్నం తింటారు.కానీ మనుషులు ముఖ్యంగా స్త్రీలు సన్నగా, నాజూగ్గా, చలాకీగా, బలంగా ఉంటారు. మీరు చెప్తే నమ్ముతారో లేదో గానీ నిజంగా నా సైజ్ ప్యాంట్ అక్కడి షాపుల్లో దొరకలేదు.మనదేశంలో నైతే నేనసలు లావే కాదు. నాక్కోపమొచ్చి ఇక్కడ కూడా అక్కడక్కదా లావాటి వాళ్ళున్నారు కదా వాళ్ళకెలా?అని అడిగాను.వాళ్ళకి బిగ్ సైజ్ షాపులుంటాయని చెప్పారు.సిగ్గేసింది కానీ ఒక విషయం తెలిసొచ్చింది. అదేమిటంటే  వాళ్ళు నాలాగా ఆవకాయ-ముద్దపప్పు లేకపోతే రోటి పచ్చడితో ఒక వాయి,కూరతో ఒక వాయి, సాంబారు,రసాలు వగైరాలతో ఒక వాయి,పెరుగుతో చివరి వాయి లాగించరు.ప్రతి సారీ రెండే రెండు స్పూన్ల (మళ్ళీ స్పూన్ అంటే  మన హస్తం కాదు,నిజంగా టేబిల్ స్పూన్ కన్న కొంచెం పెద్ద స్పూన్) అన్నం తింటారు అని. ఈ రహస్యాన్ని మా సంధ్య,రూపల్ దగ్గర ఉన్న మెయిడ్స్ నుంచి రాబట్టాను. మెయిడ్స్ అంటే గుర్తొచ్చింది (పని మనిషి పదం కంటే మెయిడ్ పదం కొంచెం బాగుంది) సంధ్య ఇంట్లో అమ్మాయి పేరుపార్వతి,రూపల్ ఇంట్లో అమ్మాయి పేరు మీనా.ఇంతకీ వాళ్ళు ముస్లిం స్త్రీలు.అచ్చం మన తెలుగు పేర్లు! వాళ్ళు చాలా హుందాగా,సమర్ధంగా ఉన్నారు. చక్కగా టూ వీలర్ల మీద వస్తారు. ఒకరి మీద ఒకరికి ఎంతో నమ్మకం, గౌరవం. వీళ్ళు తాళాలిచ్చి ఉదయాన్నే స్కూళ్ళకెళ్ళిపోతారు! వాళ్ళు ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతికి మడతలు పెట్టడం మొదలైన పన్లు చక్క బెట్టి వెళతారు!
ముస్లిం అమ్మాయిలకు తెలుగు పేర్లు ఎందుకున్నాయో తెలుసుకోవాలనే  ప్రయత్నంలో   జకార్తా చరిత్ర గురించి చదివితే 14 వ శతాబ్దంలో “జకార్తా” జావా అనే హిందూ రాజ్యంలో ఒక చిన్న నౌకాశ్రయం పట్టణంగా ఉండేది. 1527లో “ఫతాహిల్లా” అనే ముస్లిం మత పాలకుడు స్వాధీనం  చేసుకుని “జయకార్తా” (Victory City) అని పేరు మార్చాడు.1619 లో డచ్ వాళ్ళు స్వాధీనం చేసుకుని, ఒక కొత్తనగరంగా నిర్మించి, ‘బటావియా’ అని పేరు మార్చి, ఆగ్నేయాసియాకి అధికార కేంద్రంగా  చేసి 300 ఏళ్ళు పరిపాలించారు. 1941 లో జపాన్ సామ్రాజ్య వాదులు ముట్టడించి పాత పేరు జయకార్తాని జకార్తాగా మార్చేశారు. డచ్ పాలకులు మళ్ళీ ఇంకోసారి జకార్తాని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఇద్దరి మధ్య పోరాటాలు మొదలయ్యాయి. ఈ లోపల ఇండోనేషియన్ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష ఉధృత మైంది . ప్రజల విముక్తి పోరాటాల ఫలితంగా 1945, ఆగష్టు 17 న ఇండోనేషియన్ నాయకులు జకార్తాలో విదేశీ పాలన నుంచి స్వాతంత్ర్యం ప్రకటించారు.
ఇక్కడ శతాబ్దాలుగా హిందూ,ముస్లిం,యూరోపియన్,డచ్,జపనీస్ ప్రజలు సహజీవనం చెయ్యడం వల్ల అన్ని జాతుల మిశ్రమ సంస్కృతి కలగాపులగమైందని అర్ధమైంది. హిందూ, బౌద్ధం,  కన్ఫ్యూషియనిజం, ఇస్లాం, క్రైస్తవ  మతాల సమూహాలతో కలిసిన ఒక సంక్లిష్టమైన సాంస్కృతిక జీవనం ఆశ్చర్యం కలిగిస్తుంది. మన “భాష” లాగే వాళ్ళు మాట్లాడే భాష పేరు "భాస". స్త్రీలను వనిత (wanita) లంటారు. సరస్వతి, రాముడు,సీత,శివ-పార్వతులు,అర్జునుడు లాంటి అనేకమైన మన పదాలుండడం వల్ల వాళ్ళ భాష (భాస) కొంచెం అర్ధమవుతుంది.అర్ధం కాకపోయినా సైగలతో,హావభావాలతో వాళ్ళతో చక్కగా మాట్లాడొచ్చు. పోయిన సంవత్సరం హాంకాంగ్, మకావ్ లకు వెళ్ళాం. అక్కడి వాళ్ళకు ఇంగ్లీష్ రాదు. ఏ షాపుకెళ్ళినా,బజార్ల లో ఏమైనా తినాలని అడగబోయినా, సైగలు చేద్దామన్నా మొఖాలు చిట్లించుకుని విదిలించి పారేసేవారు.చాలా ఇబ్బంది పడ్డాం! ఇండోనేషియా మనుషులు ఎక్కడున్నా మనందరం మనుషులమే అన్నట్లు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. ప్రేమాభిమానాలు చూపించారు. ఆ నేలలో మనుషులందర్నీ కలగలిపే గొప్పతనమేదో ఉందనిపించింది!
ఇక కరెన్సీ విషయానికొస్తే మన రూపాయికి 210 ఇండొనేషియన్ రూపయ్యాలు. ఒక డాలర్ కైతే 13,600 రూపయ్యాలు. అందుకే డాలర్లున్న విదేశీయుల ఎద్దడి సర్వకాలాల్లోనూ ఉంటుందట! పది వేల రూపాయిల్ని మార్చుకుంటే నాకు 20 లక్షల రూపయ్యాలొచ్చాయి. ఆర్టిస్ట్ మోహన్ అప్పుడప్పుడూ  ఆయన జేబులో కాసిని డబ్బులుంటే చాలు “I am Stinkingly Rich” అని అంటుంటారు, అలా ఫీలైపోయాను. తీరా ఒక కాఫీ మేకర్ కొనుక్కుంటే 2 లక్షలైపోయాయి. పిల్లలకిష్టమైన  బ్రాండ్స్ అన్నీ చీప్ గా దొరుకుతాయి.కానీ అవి ఇండొనేషియన్ బ్రాండ్స్.ఏమైనా రెండు మూడు వస్తువులు కొందామనుకున్నప్పుడు మిలియన్లలో లెక్క తేలేది.ఇక నా లెక్కలు రాని బుర్రకి తాళం పడిపోయేది.కౌంటర్ లో అమ్మాయి ఎంత చెప్తే అంతా ఇవ్వడం, అదీ రాకపోతే రూపల్ హెల్ప్ చేసేది.
జాతీయవాదం తీవ్రంగా ప్రబలిన  సుకర్ణో కాలంలో నిర్మించిన స్మారక చిహ్నం "మోనాస్". ఇది 35 కిలోల బంగారపు పూతతో,137 మీటర్ల పొడవైన పాలరాయి కీర్తి స్తంభం. ఆగ్నేయాసియాలో అతి పెద్దదైన ఈ మసీదుని నిర్మించడానికి 17 సంవత్సరాలు పట్టింది.ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదైన ఒక చారిత్రాత్మక మ్యూజియం.”ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం”,అన్న మాహాకవి మాటలు గుర్తొచ్చాయి. కానీ పరపీడన పరాయణత్వం నుంచి ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులకూ, స్వేచ్ఛకూ, వారి స్వావలంబనకూ ప్రతీకగా నిలుస్తున్న మ్యూజియం గోడలు, గోపురం మసీదు వైభవాన్ని, ఐశ్వర్యాన్నే గాక ప్రజల గొప్పతనాన్నీ,హుందాతనాన్నీ,స్వావలంబననీ చాటి చెప్తున్నాయి. పాలకుల దగ్గర యుద్ధ టాంకులుంటే ప్రజల దగ్గర చిట్టి చిట్టి  ఆయుధాలుంటాయి.  ఒకసారి ప్రజలకు రాజకీయ స్పష్టత వచ్చిందంటే ఎంత కౄరమైన సామ్రాజ్య వాదాలైనా కాగితప్పూలలాగా ఎగిరిపోయి, ప్రజలే అంతిమ విజయం సాధిస్తారని చరిత్రలో రుజువైన సత్యాన్ని ఇండోనేషియన్ ప్రజలు  మరోసారి నిరూపించారు.
భాలికల విద్య,ఆధునికత  విషయంలో " ఐ బి యూ కార్టిని (IBU Kartini)" అనే ఒక పేరు ప్రముఖంగా వినబడింది. కార్టిని పేరుతో ఇండోనేషియాలో చాలా స్కూళ్ళు, స్థలాలు ఉన్నాయి.ఏమిటని సంధ్య నడిగితే ఆడపిల్లల చదువుల కోసం కృషి చేసిన కార్టిని అనే ఒక అద్భుతమైన మహిళ గురించి చెప్పింది. కార్టిని 1789 లో ప్రస్తుత ఇండోనేషియాలో ఒక కులీన జావనీస్ కుటుంబంలో జన్మించింది. 1904 వరకూ జీవించింది. ఆమెకు చదువు పట్ల విపరీతమైన  ఆసక్తి ఉండేది. 12 సం.ల లోపే ఆమె డచ్ భాష నేర్చేసుకుంది. జావనీస్ సమాజంలో అమ్మాయిలను ప్రాధమిక పాఠశాల, అంటే 12 సం.ల వరకే పాఠశాలకు వెళ్ళనిచ్చేవారు. ఆ కాలంలో బహుభార్యాత్వ ముండేది. బాలికల వేషధారణ మీద అనేకరకాలైన కౄరమైన ఆంక్షలుండేవి.ముక్కుపచ్చలారని పసిపిల్లలను గృహనిర్భంధంలో ఉంచి, మొఖం తెలియని ముసలివాళ్లతో రెండో,మూడో పెళ్ళికి సిద్ధం చేసేవారు.ఈ బాలికల దుర్భర పరిస్థితులకు కలత చెందిన కార్టిని వారి ఏకాంత బాధలను అధ్యయనం చేసి “Out of Darkness to Light” అనే పుస్తకం డచ్ భాషలో రాసింది. “Letters of a Javanese Princess” అని ఆమె భావాలను వ్యక్తపరిచే కొన్ని ఉత్తరాలు కూడా డచ్ భాషలోనే  రాసింది. అందులో ఆమె బహు భార్యాత్వాన్ని వ్యతిరేకించింది. ఇండోనేషియా యువత యూరోపియన్ యువతలా ఉండాలనే ఆశాభావం వ్యక్తం చేసింది. స్త్రీల చదువుల కోసం, హక్కుల కోసం ,రకరకాల పీడనలనుండి విముక్తి కోసం న్యాయపోరాటాలను సూచించింది. డచ్, నెదర్లాండ్స్, యూరోపియన్  దేశాల పౌరులను ఆకర్షించి, గొప్ప ఆసక్తిని  రేకిత్తించడం ద్వారా  విదేశీ  ప్రముఖుల  మద్దతును కూడగట్టగలిగింది. విద్యా రంగంలో మార్గదర్శకురాలైంది. ఇండొనేషియా స్వాతంత్ర పోరాటంలో కూడా దేశ నాయకులకు ఆమె ఆలోచనలు   ప్రేరణ నిచ్చాయి. కార్టిని జన్మదినం ఏప్రిల్ 21 ని జాతీయ సెలవు దినంగా, ఆమెను జాతీయ నాయకురాలిగా ప్రకటించింది ప్రభుత్వం. ఇండొనేషియా స్మారక చిహ్నం "మోనాస్". తో పాటు, కార్టిని విగ్రహాన్ని కూడా చూశాం.



ఇండోనేషియా ఒక ముస్లిం మతం దేశం అయినప్పటికీ బయట పరిశీలకులు సమాజం లో ముస్లిం మహిళల హోదా, హక్కులు, వారి స్థా నాన్ని చాలా ఉన్నతంగా భావిస్తారు. సమాజంలో మహిళలు పాటిస్తున్న మంచి విలువలే సమాజానికి వెన్నెముకలా పనిచేస్తున్నాయని పరిగణిస్తారు. సుకర్ణో కూతురు మేగావతి అధ్యక్ష అభ్యర్థిగా  నిలబడితే ముస్లిం మత నాయకులు ఒక మహిళ అధ్యక్ష పదవిలో ఉండడమేమిటని వ్యతిరేకించారు. కాని ఆమె 1999 జాతీయ ఎన్నికల్లో అతిపెద్ద మెజారిటీతో గెలుపొంది, ప్రముఖంగా నిలిచింది. అక్కడి ముస్లిం మహిళలు బురఖాలు వదిలేశారు. చిన్న చిన్న అతి సుందరమైన స్కార్ఫ్ లను తల చుట్టూ మాత్రం ధరిస్తున్నారు.అవి కూడా మహిళల అందాన్ని పెంచుతున్నాయి. కొందరు అవి కూడా వదిలేశారు.అమ్మాయిలు రాత్రుళ్ళు స్వేచ్చగా తమ తమ పనుల మీదే కాకుండా రాత్రంతా తెరిచి ఉండే నైట్ మార్కెట్లలో నిర్భయంగా తిరుగుతున్నారు.వారికి సౌకర్యవంతంగా ఉండే అన్ని రకాల ఆధునికమైన దుస్తులను ధరిస్తూ అత్యాధునికంగా కనిపించారు. ఇండియాలో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో మేము "బిలియన్ రైజింగ్" ల పేరుతో ‘పగలే కాదు,రాత్రుళ్ళు కూడా మావి కా వాలనే డిమాండ్ తో ఇంకా ఉద్యమాలు చేసే స్థితిలోనే ఉన్నాం! ఈ ఆధునికత వెనక కార్టినికి స్త్రీజాతి పట్ల ఉన్న ఆర్ధ్రత ఎంతైనా అభినందనీయం!!

ఇండోనేషియా నిత్య జీవితంలో ఆహారంలో, సంస్కృతిలో కూడా  దేశీయ ఆచారాలూ, విదేశీ ప్రభావాల కలయికలూ కనిపిస్తాయి. బాలినీస్ నృత్యాల్లో  పురాతన బౌద్ధ, హిందూ మత రాజ్యాల గురించి కథలున్నాయి. బాలిలో అచ్చు తెలంగాణ బోనాల పండుగలో మహిళలు తీసికెళ్ళే బోనాల్లాంటివే బాలి మహిళలు పెద్ద పెద్ద బుట్టలలో రకరకాల పళ్ళు అందంగా పేర్చుకుని తీసికెళ్ళడం చూశాం.

బాలి లో హోటెల్ Kuta Central Park లో దిగాం .అక్కడినుంచి ఒక టాక్సీ తీసుకుని ఊరంతా తిరిగాం. ఒక టాక్సీ డ్రైవర్ ని నీ పేరేమిటని అడిగితే "ఒయాన్" అని చెప్పాడు.మీరు ముస్లింలా?అనడిగితే "No,I am a real Hindu" అని చెప్పాడు.నిజమైన హిందువంటే ఏమిటంటే రోజుకి ఐదు సార్లు పూజ చేస్తారట!ఆ పూజలు ఇంటి బయటి ప్రవేశ ద్వారం దగ్గరే చేస్తారు. ఇంటి ఆవరణమంతా చాలా శుభ్రంగా ఉంచుకుంటారు.మనవాళ్ళలాగా పక్కింటివాళ్ళ గుమ్మాల్లో చెత్త పారబొయ్యరు! ప్రవేశ ద్వారం దగ్గరే  ఎందుకు పూజలు చేస్తారంటే సకల దేవుళ్ళూ,పంచ భూతాలూ ఇంటికి కాపలా ఉండి ఎటువంటి చెడునీ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డు పడతాయని, తమను కాపాడతాయని వాళ్ళ నమ్మకం! నాకిది కూడా భలే నచ్చింది.పూజల పేరిట ఇక్కడి ఆడవాళ్ళకు ఇరుకు ఇళ్ళలో చచ్చేంత చాకిరీ ఉంటుంది.ప్రతిసారీ దేవుడి విగ్రహాలు తోమి,వాడిపోయిన పువ్వులూ,పాచిపోయిన నైవేద్యాలూ అన్నీ శుభ్రం చెయ్యాలి.బయటంటే స్త్రీలూ-పురుషులూ కలిసి చెయ్యడం చూశాం ! నడి రోడ్ల కూడళ్ళలో పెద్ద పెద్ద కృష్ణార్జునులూ,శివ-పార్వతులూ మొదలైన హిందూ దేవుళ్ళ విగ్రహాలు చూశాం!



ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం  వరకూ రంజాన్ సందర్భంగా నిష్టగా నెలంతా ఉపవాసం చేస్తారు. ప్రతి రాత్రి కుటుంబ సభ్యులంతా ప్రత్యేక వంటకాలతో వేడుకగా భోజనం చేస్తారు. స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, సహచరులకు  ఆహార పదార్థాలను పంచిపెడతారు. వారికి ఆతిథ్య సామర్ధ్యం చాలా ఎక్కువని, రంజాన్ సమయంలో మాకు విందులే విందులని మా సంధ్య,రూపల్ చెప్పారు.
రాజకీయ వ్యవస్థ, శాస్త్ర,సాంకేతిక సమస్యలు, వినోదం, సినిమా, టెలివిజన్ కార్యక్రమాలు మొదలైన విషయాల్లో పాశ్చాత్య సంస్కృతి ఇండోనేషియాను గొప్పగా ప్రభావితం చేసింది. అరబ్, మలయ్, భారత్ ల జానపద సంగీతాల మేళవింపుతో తయారైన సంగీతం ఇండోనేషియాలో బహుళ ప్రజాదరణ పొందింది.
డచ్, చైనా, యూరోపియన్లు ఆధిపత్యం చెలాయించడం వల్ల ఇండోనేషియాలో ఇప్పటికీ "ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ."  ఉంది. దేశీయ వినియోగం కోసం జనాభాలో 60 శాతం వ్యవసాయం చేసి, వరి పండిస్తారు. మధ్య భూభాగంలో ఉండడం వల్ల ఇండోనేషియా వేడి ప్రదేశమే. వాతావరణ పరిస్థితుల్ని బట్టి జీవనోపాధికి కూరగాయలు, పండ్లు, టీ, కాఫీ, పంచదార,  సుగంధ ద్రవ్యాలు మొదలైన మార్కెట్ ఆధారిత పంటలు పండించే రైతులున్నారు. అందమైన చెక్క బొమ్మలు చేసే కళలో ఇక్కడి ప్రజలు మంచి నైపుణ్యం సంపాదించారు. బంగారం, చమురు, సహజ వాయువు, తగరం, రాగి, అల్యూమినియం, ఆయిల్ పామ్, రబ్బరు, చక్కెర, ఇండోనేషియా ఎగుమతుల్లో ముఖ్యమైనవి. ఇండోనేషియాలో దొరికే కలప నుపయోగించి ప్రాసెస్ చేసిన చెక్క కూడా ఎగుమతుల్లో ప్రధానమైనది.
గ్రామాల్లో వ్యవసాయపు పనుల్లో స్త్రీ-పురుషుల భాగస్వామ్యం ఉంటుంది. సాధారణంగా పురుషులు పొలం దున్నితే, మహిళలు సేద్యం చెయ్యడం, కోతలు కొయ్యడం,పంటల్ని భద్రపరచడం వంటి అనేక పన్లు చేస్తారు. ఆ స్త్రీలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలుగా దర్శనమిస్తారు. విదేశీ సంస్కృతి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ, కొన్ని మారుమూల ఇండోనేషియన్ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రత్యేక మూలవాసీ సంస్కృతి భద్రపరచబడింది. ఆ  మహిళల సాంప్రదాయ దుస్తుల్ని మేము చాలా ఇష్టంగా  కొనుక్కున్నాం !


నిర్ణయాత్మక స్థానాల్లో,అధికారా హోదాల్లో ఎక్కువగా పురుషులే ఉంటారు. మహిళలు పురుషుల కంటే తక్కువ సంఖ్యలో చిన్న చిన్న ఉద్యోగాల్లో దుకాణాలు, పరిశ్రమలు, మార్కెట్లలో  సేల్స్ గళ్స్ గా కనిపిస్తారు. మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, కాలేజ్ లెక్చరర్లుగా,విశ్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా పురుషులే ఉంటారు గానీ మహిళలు మాత్రం ప్రాధమిక స్కూలు ఉపాధ్యాయుల వరకే పరిమితమవుతారని సంధ్య,రూపల్ చెప్పారు.కానీ ప్రాధమిక పాఠశాలల్లో బాల-బాలికల సంఖ్య సమానంగా ఉంటుందని చెప్పారు! రాచరిక పాలనే అయినప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ఒకటి,రెండు దశాబ్దాలకే చదువు మీద అమితాసక్తి కలిగి,ఉచిత విద్యను అమలు చేసింది ఇండోనేషియన్ ప్రభుత్వం. అదీ గాక, ఈ దేశంలో కార్టిని పాఠశాలల ప్రభావం ఎక్కువగానే ఉంది కాబట్టి కొద్ది కాలంలో చదువుల్లో ఉద్యోగాల్లో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఎదుతారని ఆశించవచ్చు!!

ఎటు చూస్తే అటు కనుచూపు మేరా కనిపించే ఇండియన్ ఓషన్ పులకింపజేసేది! మన దేశం పేరుతో ఒక మహా సముద్రముండడ మనే భావన మరీ మరీ పరవశింపజేసింది !! దానికి తోడు ఉడుకు రక్తంతో అత్యుత్సాహంగా ఉరకలు వేసే పిల్లలు.ఒకటే కేరింతలు!వాళ్ళ సాంగత్యంతో మాకూ యవ్వనం వచ్చేసింది!

ఆధునిక జీవితం అర్ధం కావాలన్నారు శ్రీ శ్రీ. వేష భాషల్లోనే కాదు,ఆలోచనల్లోనూ శ్రీ శ్రీ చెప్పిన ఆధునికతను వంట బట్టించుకున్న మా అమ్మాయిలు, ఒకరు కాదు,ఇద్దరు కాదు, ముగ్గురు సమర్ధులైన, అతి చలాకైన,ఆధునిక యువతులు నిర్వహించిన ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప సంబరంగా సాగింది!
                                                                                                            -    శివలక్ష్మి

11, జనవరి 2017, బుధవారం

“నిశ్శబ్ద, ప్రశాంత ఉషోదయాలు”



బోరిస్ ‘వాసిల్యేవ్’ నవల ఆధారంగా అదే పేరుతో ‘స్టానిస్లవ్ రొస్టోట్స్కీ’(Stanislav Rostotsky)  దర్శకత్వం వహించి, 1972 లో దృశ్యీకరించిన యుద్ధ వ్యతిరేక ప్రపంచ ప్రసిద్ధ సోవియట్ చిత్రం “The Dawns here are Quiet”. అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన పదహారుమంది నాజీ సైనికులతో ఆరంటే ఆరుగురు రష్యన్ లు జరిపిన వీరోచిత పోరాటాన్ని ఆద్యంతం దిగ్భ్రాంతి కలిగించేలా తెరకెక్కించారు డైరెక్టర్ స్టానిస్లవ్.
యుద్ధం ప్రజల జీవితాల లోని మరీ ముఖ్యంగా స్త్రీల జివితాల్లోని అన్ని పార్శ్వాలనూ, కలల్ని, సర్వస్వాన్ని ఏవిధంగా నాశనం చేసి వదులుతుందో అనే విషయాన్ని ఐదుగురు రెడ్ ఆర్మీ యువతుల జీవితాలు, వారి పోరాటాల ద్వారా బొమ్మ కట్టి చూపించడమే ఈ సినిమా ఇతివృత్తం.
రెండవ ప్రపంచ యుద్ధం సమయం. 1942 మే. జర్మన్ పైశాచికత్వాన్ని అనుభవిస్తున్న రష్యా జాతీయాభిమానంతో మహోద్రిక్తంగా ఉంది. సీనియర్ సార్జెంట్ ‘ఫెదోత్ వస్కోవ్’ యూనిట్ లో విధి నిర్వహణ కోసం మొత్తం మహిళలతో కూడిన ఒక దళం "కామ్రేడ్, విమాన విధ్వంసక బెటాలియన్ కి చెందిన మేము మీ నాయకత్వాన ఈ స్థావరాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాము"అని సీనియర్ సార్జెంట్ సైనిక యువతి అసిస్టెంట్ ప్లటూన్ కమాండర్ ‘కిర్యానోవా’ వస్కోవ్ కి రిపోర్ట్ చేస్తుంది. ఆమె రిపోర్ట్ చెయ్యగానే అంతకు ముందున్న తన దళంలోని తాగుడుకి అలవాటు పడిన పురుష సైనికులందర్నీ రిలీవ్ చేసేస్తాడు వస్కోవ్.
‘రీతా ఒస్యానినా’ బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు తమ పరిసరాల్లో ఇద్దరు జర్మన్లు సంచరిస్తున్నట్లు పసిగడుతుంది. రీతా పరుగున వచ్చి వస్కోవ్ కి రిపోర్ట్ చేస్తుంది. అందరూ ఆలోచించి, రష్యాని విధ్వంసం చేసే ప్రణాళికలో భాగంగా, జర్మన్ నాజీ విద్రోహ దళాల నుంచి వచ్చి ఉంటారని తేల్చు కుంటారు. అడవిని గాలించడానికి పైనుంచి ఆదేశమవుతుంది. వస్కోవ్ విమాన విధ్వంసక శతఘ్ని దళానికి చెందిన ఐదుగురు రెడ్ ఆర్మీ యువతులు ‘రీతా ఒస్యానినా’, ‘బ్రిచ్కీనా లీజా’, ‘జేన్యా కొమెల్కోవా’,’గాల్యా చెత్ వెర్తాక్’లతో పాటు జర్మన్ భాష తెలిసిన ‘సోన్యా గూర్విచ్’ ను తన దళ సభ్యులుగా ఎంచుకుంటాడు సీనియర్ సార్జెంట్ మేజర్ వస్కోవ్. ఈ ఆరుగురికీ వివిధ కారణాల వల్ల నాజీల మీద కక్ష ఉంది. జర్మన్లను రష్యా దేశం లోకి ప్రవేశించకుండా మధ్యలోనే అడ్డగించిఅంతం చెయ్యాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ జాడలు వెతుక్కుంటూ ఆరుగురూ అన్ని జాగ్రత్తలతో బయల్దేరతారు!
మొదటగా వస్కోవ్, సోన్యా గూర్విచ్, బ్రిచ్కీనా లీజా, జేన్యా కొమెల్కోవా, గాల్యా చెత్ వెర్తాక్, చివరగా జూనియర్ సార్జెంట్ రీతా ఒస్యానినా -ఈ వరసలో నడుస్తారు. దారిలో భయంకరమైన బురదతో నిండిన ఒక ఊబిని దాటవలసి వస్తుంది. గొంతు వరకూ ఉన్న ఊబిలో మొదటి అడుగుతోనే కూరుకుపోతాడు వస్కోవ్. గాల్యా ఒక కాలి బూటు బురదలో ఇరుక్కుపోతుంది. పెర్చి అనే కర్ర సాయంతో లాగేస్తున్న ఊబిలోంచి నానా తంటాలూ పడుతూ బయటికొస్తారు. గాల్యా కి వెంటనే ఒక బూటును తయారుచేస్తాడు వస్కోవ్.
రెండు భాగాలుగా ఉన్న సినిమా మొదటిభాగం ఇక్కడ ముగుస్తుంది.
ఇద్దరు జర్మన్లు కిరోవ్ రైలు మార్గానికీ, కామ్రేడ్ స్టాలిన్ పేరు కలిగిన తెల్ల సముద్రం-బాల్టిక్ కాల్వకీ చేరుకునే లక్ష్యంతో రహస్యంగా చొచ్చుకు వస్తున్నారని తెలుసుకుంటారు. వాళ్ళని చాలా ముందే కనుక్కుని అడ్డగించ డానికి వీలుగా ఒక అనువైన స్థావరాన్ని ఎంచుకుంటారు. వస్కోవ్ తనకూ మహిళా సైనికులకు కూడా ఒక్కొక్కచోట వారి స్థావరాలను నిర్ణయించి కొంచెం సేపు సేద దీరమంటాడు. తన సైనికులొక్కొక్కరి దగ్గరికీ స్వయంగా వెళ్ళి, వారి క్షేమ సమాచారాలు ఆరా తీస్తాడు. ఒక్కొక్కరికి ఏ యే విద్యల్లో ప్రావీణ్యముందో తెలుసుకుంటాడు. అప్పుడు వారి గురించిన జీవిత విశేషాలు ప్రేక్షకులకు తెలుస్తాయి.
రీతాకి ఒక రెడ్ ఆర్మీకమాండర్ లెఫ్టినెంట్ ‘ఒస్యానినా’ తో వివాహమవుతుంది. సరిహద్దు స్థావరంలో ఆమెను మహిళా సమితికి ఎన్నుకుని అన్ని రకాల శిక్షణలూ ఇస్తుంది రెడ్ ఆర్మీ. గాయపడిన వాళ్ళకు వైద్యం చెయ్యడం, తుపాకులు కాల్చడం, గుర్రపు స్వారీ, గ్రెనేడ్లు విసరడం, విషవాయుదాడులనుండి తప్పించుకోవడం మొదలైనవన్నీ నేర్చుకుంటుంది. తర్వాత సంవత్సరం ఒక బాబు పుడతాడు. ఆ తర్వాత సంవత్సరం యుద్ధం మొదలవుతుంది. అందరిలాగా ఆమె భీతిల్లలేదు. బాబుని తలి-దండ్రుల దగ్గరకు పంపేస్తుంది. పదిహేడు రోజులు కాల్పుల శబ్దం వింటూ, నిబ్బరంగా తన భర్త తిరిగి వస్తాడని ఎదురు చూస్తుంది. చివరికి అంతా నిశ్శబ్దమైపోయి నిరాశే మిగిలింది. ఆమెను నాయకత్వం యుద్ధ రంగం నుంచి ఇంటికెళ్ళమని ఆదేశిస్తే, ఆమె మాత్రం తనని పోరాట శ్రేణుల్లోకి తీసుకోవాలని అర్ధించింది. తనకి తానుగా కొన్ని బాధ్యతలనూ, లక్ష్యాలనూ నిర్దేశించుకుంది.
జేన్యా కొమెల్కోవాని తోటి మహిళా సహచరులే "సముద్ర కన్యలా ఉన్నావనీ, చెక్కిన దివ్య సుందర శిల్పంలా అతిలోక సౌందర్యంతో వెలిగిపోతున్నావనీ తెగ పొగిడేస్తారు. అమ్మనీ, తమ్ముణ్ణీ, చెల్లెల్నీ కాల్చి చంపుతుంటే పక్కింట్లో నుంచి ప్రత్యక్షంగా చూస్తుంది జేన్యా. . “రెడ్ ఆర్మీ కమాండర్ కూతురంటే ప్రపంచంలో దేనికీ భయపడకూడదు”- అని వాళ్ళ నాన్న బోధించినట్లే జేన్యా కొమెల్కోవా దేనికీ భయపడదు. గుర్రపు స్వారీ, రైఫిల్ కాల్చడం, పందుల్ని వేటాడటం, జిప్సీ, స్పానిష్ డ్యాన్స్ చెయ్యడం, గిటారు వాయించడం-ఇలా ఎన్నో రకాల విద్యల్లో ఆమె ప్రావీణ్యురాలు. జేన్యా కుటుంబం చంపబడ్డాక ఆమె సోవియట్ యుద్ధ ట్రూపుల్లోకి వస్తుంది.  తన జీవితం ఎంత విషాద భరితమైనదైనా చిలిపిగా, కొంటె పనులు చేస్తూ, అందరితో కలుపుగోలుగా అందర్నీ నవ్విస్తూ, నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ, సాహిత్యాన్ని అలవోకగా ఆశువుగా చెప్తూ సెక్షన్ నంతటినీ ఆహ్లాదపరిచేది.
ఉమ్మడి కుటుంబంలో పెరిగిన సోన్యా గూర్విచ్ బాల్యమంతా గందరగోళంగా రకరకాల ఒత్తిళ్ళ మధ్య కరిగిపోయింది. చొరవ లేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోయేది. భయస్తురాలు. స్కూల్లోనూ, విశ్వ విద్యాలయంలోనూ అత్యధిక మార్కు లొచ్చాయి. కవిత్వమంటే ప్రాణం. కవిత్వాన్ని పైకి చదువుకుంటూ ఉంటుంది. నిశ్శబ్ద వాతావరణంలో గాలి నీ స్వరాన్ని మోసుకుపోయి శత్రువుకి పట్టిస్తుంది.పైకి చదవొద్దంటాడు వస్కోవ్.
యూనిట్ మొత్తంలో నీరసంగా, బలహీనంగా, మురికిగా కనిపించేది ‘గాల్యా చెత్ వెర్తాక్’. గాల్యా చెత్ వెర్తాక్ ఒక అనాధ బాలిక. అనాధ శరణాలయంలో పెరిగిన గాల్యా చెత్ వెర్తాక్ వాస్తవ ప్రపంచంలో కన్నా కల్పిత ప్రపంచం లోనే ఎక్కువగా బతుకుతూ ఉంటుంది. గాల్యాకి అన్ని రకాలుగా శిక్షణ నిస్తుంది జేన్యా. ఇప్పుడామె అన్ని విద్యల్లో ఆరితేరిన ఒక అందమైన అమ్మాయిగా తయారవుతుంది. ఇక రీతా, జేన్యా, గాల్యా మంచి స్నేహితులవుతారు.
అడవిలోని ఏ జంతువు కూతనైనా అనుకరించగలరు- జేన్యా, రీతా.
బ్రిచ్కీనా లీజా బాల్యంలోనే చదువు మానేసి మరణ శయ్య మీదున్న తల్లికి సహాయపడుతూ, తండ్రికి సేవ చేస్తూ కష్టాల్లోనే కాలం గడుపుతుంది. యుక్త వయసులో ఒకతన్ని ఇష్టపడుతుంది. అతను లీజాని ఖాతరు చెయ్యడు. బ్రిచ్కీనా లీజా అడవి ప్రాంతం. అడవి ఆనుపానులన్నీ తెలిసిన యువతి. అడవిలో ఒక అందమైన చోట తనకి తానే బహు చక్కని గూడుని ఏర్పరచుకుంటుంది. ఆమె సామర్ధ్యాన్ని చూచి చకితుడవుతాడు వస్కోవ్. లీజాని పరామర్శించడానికి వచ్చినప్పుడు వస్కోవ్
 “లీజా, లీజా, లీజా వేతా,
కాల్చిన బంగాళాదుంప కంటే తియ్యనైన దానా
ముందుగా ప్రియుణ్ణి నువ్వే ఎంచుకుంటావా?
లేదా నేను వెళ్లి నీకోసం నేను ఎంచి పెట్టనా?”
అని పాట పాడతాడు. ఇది మాప్రాంతంలో పాడే జానపద పాట అని చెప్తాడు. లీజా సిగ్గు పడుతూ నాకూ తెలుసు, మాప్రాంతంలోనూ పాడతారని చెప్తుంది. యుద్ధం ముగిసి,  శాంతి స్థాపన జరిగాక మనం కలుద్దామని చెప్తాడు. మొదటి చూపులోనే వస్కోవ్ పట్ల లీజాకి ఇష్టం ఏర్పడుతుంది.
బాగా గమనించిన తర్వాత జర్మన్లు ఇద్దరు కాదనీ, పదహారు మంది అనీ, మెషిన్ గన్నులు, అత్యాధునిక ఆయుధాలతో ఉన్నారనీ మొదటగా గమనిస్తుంది సోన్యా గూర్విచ్. వస్కోవ్ కి కంగారుతో బుర్ర పని చెయ్యనని మొరాయిస్తుంది. పైకి గంభీరంగానే ఉంటాడు.
ఈ వార్త పై అధికారులకి చేరవెయ్యడం కోసం, సహాయం అర్ధించడం కోసం బ్రిచ్కీనా లీజాని తిరిగి ప్రధాన స్థావరానికి పంపిస్తాడు వస్కోవ్. "వెళ్ళగలవు కదా, ఊబిని దాటేటప్పుడు జాగ్రత్త సుమా” అంటూ ఎన్నో హెచ్చరికలు చేసి లీజాని పంపిస్తాడు. ఒక పక్షి దూసుకు పోతున్నట్లే దూసుకెళ్తుంది లీజా!
లీజా వెళ్ళాక మిగిలింది నలుగురే, శత్రు సైనికులు బాగా దగ్గర కొచ్చేస్తారు. వాళ్ళ దృష్టి మళ్ళించడానికి ఏదైనా ఉపాయం చెప్పమంటాడు వస్కోవ్. అమ్మాయిలే కట్టెలు కొట్టేవాళ్ళలాగా అరిచి, హంగామా చేస్తామంటారు. ముందు ఒప్పుకోడు. తర్వాత వాళ్ళ సమయస్ఫూర్తి వస్కోవ్ కి నచ్చుతుంది. గొంతు పోయేలా అరుస్తుంది రీతా ఒస్యానినా. స్కర్ట్ ను కాల్చుకుంటుంది సోన్యా గూర్విచ్. ముఖమంతా మసి చేసుకుంటుంది గాల్యా చెత్ వెర్తాక్. ఎవరి మేరకు వాళ్ళు నటించినా జర్మన్లను పూర్తిగా మస్కా కొట్టించిన ఘనత మాత్రం జేన్యా కొమెల్కోవాదే! అప్పటికా గండం గడిచిపోతుంది. పడీ పడీ నవ్వుకుంటారు.    
“మన మాతృదేశ పరిరక్షణలో పాల్గొన్న  ఒక మంచి వీరునికి” - అని అందమైన అక్షరాలు కుట్టి ఉన్న పొగాకు సంచిని ఒకచోట మర్చిపోతాడు వస్కోవ్. దాని కోసం వద్దని వారిస్తున్నా వినకుండా పరిగెత్తుతుంది సోన్యా. అంతే! తర్వాత ఒక అరుపు వినిపించిన దిశగా పరిగెడతారు జేన్యా కొమెల్కోవా, వస్కోవ్ లు. అక్కడ గుండె నుంచి రక్తం స్రవిస్తూ వికృతమైన రూపంలో నిర్జీవమై ఉంటుంది సోన్యా గూర్విచ్. సోన్యా తన పొగాకు సంచికోసం పరిగెత్తి తూటాకి బలైందని హతాశుడవుతాడు వస్కోవ్. మానవజాతి అనే అనంతమైన వస్త్రంలో ఓ చిన్న దారం ఒక బాకు పోటుతో పుటుక్కున తెంపెయ్యబడింది.
సోన్యా గూర్విచ్ ని రాళ్ళ మధ్య ఉంచి మొక్కల కొమ్మలు కప్పి, ఆ సమాధిపై జేన్యా కొమెల్కోవా ఒక పచ్చటి మొక్కనుంచింది. గాల్యా చెత్ వెర్తాక్ కంపించి పోతూ అరవబోతే "ఆ పూనకపు వేషాలు ఇంక కట్టిపెట్టు” అని గద్దిస్తుంది జూనియర్ సార్జెంట్ రీతా ఒస్యానినా. ఆస్థలాన్ని మాప్ లో గుర్తు పెట్టి,"యుద్ధం ముగిశాక ఆమె కొక స్మారక స్తూపం నిర్మించబడుతుంది”- అంటాడు సార్జెంట్ మేజర్ ఫెదోత్ వస్కోవ్
జీవితంలో మంచి రోజులు వస్తాయని ఆశిస్తుంది లీజా. అవెప్పటికీ రావు! వస్కోవ్ అప్పజెప్పిన పని మీద వెళుతూ, బురద నిండిన చిత్తడి ఊబిలో కూరుకుపోతూ "కాపాడండి"అని అడవంతా ప్రతిధ్వనించేలా కేకలు పెడుతూ అందమైన నీలాకాశం వైపు చూస్తూ, రేపు మీద ఆశ వదులుకోకుండా ప్రభాత సమయం వరకూ గింజుకుంటూనే ఉంటుంది. నులివెచ్చని తేజోవంతమైన ప్రభాత సూర్య కిరణాల్ని అనుభూతిస్తూ, ఉజ్వలమైన "రేపు" తనకీ, దేశానికీ రాబోతుందని నమ్ముతూ వస్కోవ్ ని తల్చుకుంటూ, అతను చెప్పిన మాటల్ని నెమరు వేసుకుంటూ తుది శ్వాస విడి చేస్తుంది.
వస్కోవ్, జేన్యా కొమెల్కోవా లిద్దరూ ఇద్దరు జర్మన్ల మీద దాడికి పూనుకుంటారు. జేన్యా ఇచ్చిన సంకేతంతో యుక్తిగా ఒక జర్మన్ సైనికుణ్ణి వధిస్తాడు వస్కోవ్. రెండోవాడు వస్కోవ్ మీద దాడి చేస్తాడు."ఇక నా చావు తప్పదు” అని వస్కోవ్ అనుకుంటుండగానే మెరుపులా అతన్ని పేల్చేస్తుంది జేన్యా. వెంటనే అప్రమత్తమైన వస్కోవ్ నిర్జీవంగా పడి ఉన్నప్పటికీ మళ్ళీ లేవకుండా కత్తితో పొడిచి అతన్ని అంతంచేస్తాడు.
"శభాష్ జేన్యా, నీకు ప్రశంసా పత్రం వస్తుందం”టాడు వస్కోవ్. జేన్యా పక్కకెళ్ళి భళుక్కున కక్కుకుని ఏడుపు లంకించుకుంటుంది. మొదటిసారి ఒక మనిషిని చేతులారా చంపడానికి దోహద పడినందుకు తన అంత రాత్మతో రాజీ పడలేక పొందుతున్న ఆవేదన అది. జీవితమంత సహజ మైనదైన నిండు ప్రాణాన్ని తియ్య రాదన్న నియమం మొదటిసారిగా అతిక్రమించినప్పుడు ఆ అనుభవం కలచివేస్తుంది. స్త్రీలు ప్రాణం పోసేవారే గాని తీసేవారు కాదు. అన్నీ సవ్యంగా ఉంటే భవిష్యత్తులో ఒక మాత కావలసిన జేన్యా కుమిలి కుమిలి ఏడుస్తుంది.
 “వాళ్ళు మనుషులు కాదు, పశువుల కంటే హీనమైనవాళ్ళు.బాధ పడవద్దం”టాడు వస్కోవ్.
వస్కోవ్, గాల్యా చెత్ వెర్తాక్, జేన్యా కొమెల్కోవా, రీతా ఒస్యానినా వరుసగా నడుస్తుండగా జర్మన్లు ఎదురుగా వస్తూ కనిపిస్తారు. ఇక " ప్రత్యక్ష పోరాటం” మొదలవువుతుంది.  వస్కోవ్ కి ఆలోచించుకునే సమయం లేకుండా సబ్ మెషీన్ గన్నులతో అతని పైకి కాల్పులు సాగిస్తారు. తన సైనికులకు చెదిరిపొమ్మని సంజ్ఞ చేస్తాడు వస్కోవ్. రీతా ఒస్యానినా జర్మన్ల దగ్గరనుంచి సంపాదించిన సబ్ మెషీన్ గన్ తో అంతకు ముందు వస్కోవ్ చెప్పినట్లే ఆపి ఆపి కాలుస్తూ అత్యవసరమైన విలువైన క్షణాలను ఫెదోత్ వస్కోవ్ కి సమకూర్చి పెడుతుంది. రీతాకి వస్కోవ్ జీవితమంతా రుణపడి ఉండాల్సిన గొప్ప క్షణాలవి. గాల్యా చెత్ వెర్తాక్ కాల్పులకు బెదిరిపోయి బోర్లా పడుకుండిపోతుంది. జేన్యా కొమెల్కోవా శత్రుదాడి ఆగేవరకూ కాల్పులు కొనసాగిస్తూనే ఉంటుంది. గాల్యా ఏడుస్తుంటే రీతా ‘పిరికిది’ అని అంటుంది. “మొదటి పోరాటంలో పిరికితనం కాక గాభరాగా ఉంటుం”దని సర్ది చెప్తాడు వస్కోవ్.  నిజానికి గాల్యాని భయపెట్టింది సోన్యా గూర్విచ్ హఠాత్మరణం. “పదహారులో ఇద్దరు పోయారు, ఇంక మనం తలపడాల్సింది పద్నానుగు మందితోటే” అని గాల్యాని ఉల్లాస పరుస్తాడు వస్కోవ్. ‘దుఃఖోద్వేగాల్లో ఉన్న ఆడపిల్లలతో ఎలా మెలగాలో సైనిక నిబంధనల్లో లేద’నుకుంటాడు వస్కోవ్.
వస్కోవ్, గాల్యా చెత్ వెర్తాక్ ఒకవైపుకీ, రీతా ఒస్యానినా, జేన్యా కొమెల్కోవాలు మరోవైపుకీ మళ్ళుతారు.
జర్మన్లు సబ్ మెషీన్ గన్ లతో ముందుకి వస్తుంటారు. పది అడుగుల దూరం లోనే ఉన్న వాళ్ళు తన కాల్పుల పరిధి లోకి రాగానే గ్రెనేడ్ విసరడానికి సంసిద్ధంగా ఉంటాడు.ఇంతలో గాల్యా చెత్ వెర్తాక్ ఆకస్మికంగా పొదలోంచి బయటికి వచ్చి “మామా” అని అరుస్తూ హాహాకారాలు చేస్తుంది. అంతే! ఆమెపై సబ్ మెషీన్ గన్ నిప్పులు కురిపిస్తుంది. వస్కోవ్ కి గాయమవుతుంది. గాల్యా నేలకూలుతుంది. గాల్యా చావు వల్ల మానసికంగా చెదిరి, గాయం సలుపుతుంటే శత్రువుకి చిక్కకుండా పొగమంచు ఉన్నందువల్ల కనిపించకుండా ఉరుకుల పరుగులు పెడతాడు వస్కోవ్. ప్రమాదంలో ఉన్న మనిషి అసలు బొత్తిగా ఆలోచించకుండానైనా అవుతాడు. లేక ఏకకాలంలో ఇద్దరు మనుషులు ఆలోచించి నట్లయినా ఆలోచిస్తాడు. పరిగెత్తి, పరిగెత్తి ఇంతకుముందు దాటిన ఊబి దగ్గరకు చేరుకుంటాడు. అక్కడొక నల్లని వస్తువుని చూచి, దాన్ని బ్రిచ్కీనా లీజా స్కర్టు అని గుర్తు పడతాడు. తన విజయం ఎవరితో సాధ్యమవుతుందని, ఆమె ద్వారా ప్రధాన స్థావరాన్నించి సహాయం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాడో అందరికంటే ముందే ఆ లీజా చనిపోయిందని తెలిసి అవాక్కవుతాడు వస్కోవ్.
రెండో వైపుకి వెళ్ళిన జేన్యా కొమెల్కోవా, రీతా ఒస్యానినాలు బతికి ఉండాలని మనసారా కోరుకుంటూ, యుద్ధంలో పైచెయ్యి పోగొట్టుకున్నందుకు బాధతో వుంటాడు. అతని మనసులో సబ్ మెషీన్ గన్నులతో జర్మన్లు ఒకవైపు, పాత రైఫిళ్ళు పట్టుకున్న రష్యన్ రెడ్ ఆర్మీ సైనిక యువతులు ఇంకోవైపూ మెదిలారు. నడుస్తూ నడుస్తూ జర్మన్లు ఆయుధాలు దాచిన ఒక స్థావరాన్ని కనుగొంటాడు. ఒకడు మంచినీళ్ళకు బయటికి రావడం చూచి పేల్చేస్తాడు వస్కోవ్. అక్కడున్న సబ్ మెషీన్ గన్నులను రెండింటిని తీసుకుని అడవిలోకి దూసుకుపోతాడు. రీతా, జేన్యాల జాడ తెలియక మిగిలింది తనొక్కడేనా అని మధన పడుతూ గందరగోళపడు తుంటాడు వస్కోవ్.
ఇంతలో "కామ్రేడ్ సార్జెంట్ మేజర్"అనే పిలుపు లోగొంతుకలోనూ, తర్వాత కాస్త పెద్దగానూ వినబడు తుంది.అతను తన కళ్ళను తానే నమ్మలేక పోతాడు. దుఃఖాన్ని ఆపుకుంటూ ఎదురెళ్తాడు. రీతా ఒస్యానినా, జేన్యా కొమెల్కోవా లిద్దరూ ఊబి బురదలో తమ స్కర్టులను ఎత్తిపట్టడం కూడా మర్చిపోయి వేగంగా వచ్చి వస్కోవ్  ని చుట్టేస్తారు. ముగ్గురికీ అదిమిపట్టిన శోకపుటేరులు ఒక్కసారిగా సంతోషసముద్రాలవుతాయి."నా బంగారు పాపలు"అని వస్కోవ్ మురిసిపోతుంటే, అతన్ని ముద్దులతో నింపేస్తారు రీతా, జేన్యాలు. ఇంకెంత మాత్రమూ నేను మీకు "సార్జెంట్ మేజర్" ను కాను. నేను మీ అన్నయ్యను. మీరు నా చిన్నారి చెల్లాయిలు అంటాడు వస్కోవ్ ప్రేమగా. ఒకేరకం కష్టాల్లో, ఆపదల్లో ఉన్నవాళ్ళు ఒకరితో ఒకరు ఎలా మమేకమవుతారో తెలిపే ఈ సీన్ చాలా గొప్పగా కన్నుల పండుగ్గా ఉంటుంది.
జేన్యా తన ప్రియ స్నేహితురాలు గాల్యా చెత్ వెర్తాక్ గురించి అడుగుతుంది. వస్కోవ్ నెమ్మదిగా నిజం చెప్తాడు.” సోన్యా గూర్విచ్ గురించి మీకు తెలుసు. మన కామ్రేడ్స్ వీరమరణం పొందారు. గాల్యా కాల్పుల్లోనూ, బ్రిచ్కీనా లీజా ఊబిలోనూ మరణించారు.అంటే మనం మొత్తం ముగ్గుర్ని కోల్పోయాం. మనం ఇరవై నాలుగు  గంటలుగా పోరాడుతున్నాం. సహాయం అందే దారి లేదు. ఇంకో ఇరవై నాలుగు గంటలు శత్రువుని నిలువరించాలి”- అని పరిస్థితిని వివరిస్తాడు. ఇక చివరి పోరాటానికి సిద్ధం కావాలంటాడు. కొంచెం పానీయాలు సేవించి, కాస్తంత తిండి తింటారు.
ఒక వాగు దగ్గర నిర్ధిష్టమైన స్థలాన్ని రీతా, జేన్యాలకు కేటాయించి, తనొకచోట నిలబడి యుద్ధానికి సిద్ధమవుతాడు. వస్తున్న జర్మన్ సైనికుల మీద కాల్పులు జరపడానికి ట్రిగ్గర్ నొక్కేలోగా నాలుగు మెషీన్ గ న్ల నుంచి వస్కోవ్ మీదకి నిప్పులు కురుస్తాయి. తలపై నుంచి దూసుకెళ్ళడం వల్ల తృటిలో తప్పించు కుంటాడు. వాళ్ళు ముగ్గురూ విజయమో వీరస్వర్గమో తేల్చుకోదల్చుకున్నారు. తమ వెనక యావత్ రష్యా ఉన్నదన్న భావం, మరెవ్వరూ కాదు, తను, తన మహిళా సైనికులు మాత్రమే దేశమాతకు మిగిలిన చిట్ట చివరి పరిరక్షకులన్నట్లుగా, తమ ముగ్గురూ - శత్రువు - రష్యా వినా యావత్ప్రపంచంలో మరెవ్వరూ లేరన్న భావం కలిగింది వారికి.
ఇంతలో జేన్యా పరిగెత్తుకొచ్చి"అక్కడ ఛూడు, వస్కోవ్, రీతా!? అని చెప్పి జేన్యా తన సబ్ మెషీన్ గన్ తో దౌడు తీస్తుంది. వస్కోవ్ కి విషయం అర్ధమై అటు పరిగెత్తుతాడు. రీతా గాయం నుండి విపరీతంగా రక్తస్రావం జరుగుతూ ఉంటే, వస్కోవ్, ఆమెకు సేవ చేస్తూనే, శత్రువు పట్ల అప్రమత్తంగా ఉంటూ, జేన్యా మెషీన్ గన్ గర్జించడాన్ని గమనిస్తాడు. జేన్యా జర్మన్ల దృష్టిని మళ్ళిస్తూ, వాళ్ళను తన వెంట తిప్పుకుంటూ, వాళ్ళ దృష్టి మళ్ళిస్తూ వస్కోవ్, రీతా లను రక్షించడానికి శయశక్తులా ప్రయత్నిస్తుంది.
తన దగ్గరున్న మందుగుండు పూర్తిగా ఐపోయేవరకూ తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా కాలుస్తూనే ఉంది. చివరికి జర్మన్లు చాలా దగ్గరనుండి సూటిగా కాల్చి ఆమెను తుదముట్టిస్తారు. తనమీద తనకు పూర్తి విశ్వాసమున్నట్లు ధీమాగా కనిపించే జేన్యా పంధొమ్మిదేళ్ళ వయసులో రాలి పోవడ మన్నది పూర్తి అన్యాయం, మహా దుర్మార్గం.
ఇక చావు బతుకుల్లో ఉన్న రీతా ఒస్యానినాకి తాను ప్రమాదంలో ఉన్నానని తెలుసు. తన ముసలి తల్లి సంరక్షణలో ఉన్న తన చిన్నారి కొడుకుని తల్చుకుని బాధపడుతుంది. జేన్యా చచ్చిపోయిందని తెలుసుకుంటుంది."నేనింకా బతికే ఉన్నాను కాబట్టి మనం ఓడిపోయే సమస్యే లేద” ని హామీ ఇస్తాడు వస్కోవ్.
పీడికెడు జర్మిగాళ్ళకోసం నేను మీ ఐదుగుర్ని బలి ఇచ్చాను. రేపు శాంతి స్థాపన జరిగి, ప్రజలు నన్ను “మా తల్లుల్ని గుళ్ళకి గురి చేసి నువ్వు మాత్రం ఎలా బతికి బయట పడ్డావ్”? అని అడిగితే నేనేం చెప్పాలి? అని విలపిస్తాడు వస్కోవ్. “ఇది యుద్ధకాలం, మేము మా దేశ రక్షణ కోసం మా ప్రాణాల్ని ఇచ్చాం. నిన్ను నువ్వు నిందించుకోకు.ఇందులో నీ తప్పేమీ లేదు” అని ఊరడిస్తుంది రీతా. ఒకసారి పరిస్థితి చూచి వస్తానని వెళ్ళబోతున్న వస్కోవ్ ని ఆపి,"ఆగు, నేనప్పుడు బయటికి వెళ్ళి జర్మన్లను గమనించినప్పుడు వెళ్ళింది నా మూడేళ్ళ కొడుకు కోసం. వాడిపేరు “ఇగోర్”. మా అమ్మ జబ్బుగా ఉంది. ఎక్కువకాలం బతకదు. మానాన్న యుద్ధంలో జాడ తెలియకుండా పోయాడు-అని చెప్పి తన కొడుకు బాద్యతని వస్కోవ్ కి అప్ప జెప్తుంది. “నాకర్ధమైంది, దిగులు పడొద్దం”టాడు వస్కోవ్. ఒక ముద్దిచ్చి వెళ్ళమంటుంది రీతా. కన్నీటి చారికల ముఖం కళావిహీనమవుతుంది. ఆమె మీద చెట్ల కొమ్మలుంచి, మళ్ళీ శత్రుదాడికి ఉరుకుతాడు. రీతా తన కణతికి గురి పెట్టి కాల్చుకుంటుంది. కాస్త మట్టి తవ్వి రీతా నక్కడ ఉంచి, జేన్యా దగ్గరికొస్తాడు. భరింపలేని బాధతో సమాధిని తవ్వలేకపోతాడు. “నన్ను క్షమించు జేన్యా, క్షమించు” అని గొణుక్కుంటూ జర్మన్ల వైపుగా సాగిపోతాడు. ఇది చాలా శక్తివంతమైన సీన్. ఇదే రీతా తన ప్రియుడు ఒస్యానినాని మొదటిసారి కలుసుకోవడం, వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా గడిపే సీన్ ప్రేక్షకులకు గుర్తొస్తుందిక్కడ!
యుద్ధమన్నది ఆయుధ సంపత్తి కలిగి ఉండడం, ఎవరికెక్కువ పోరాట శక్తి ఉంది, ఎవరు ఎవరికన్నా ఎక్కువ పేలుస్తారన్న దాని మీద కన్నా వివేచనా శక్తిలో ఎవరు ఎవరిని అధిగమిస్తారన్న దానిమీద ఎక్కువగా ఆధార పడుతుంది. సైనిక నిబంధనలు నిన్ను స్వేచ్చగా, ఎంతో ముందుకి, శత్రువు ఆలోచనలను కూడా పసిగట్టి, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేలా తయారు చేస్తారు. నిజంగానే ఒకసారి వాళ్ళు  దూరంగా కాఫీ తాగడాన్ని కూడా కనిపెట్టగలుగుతాడు వస్కోవ్. ఒక గుడిసె దగ్గర జర్మన్ల స్థావరాన్ని కనిపెడతాడు వస్కోవ్. అజాగ్రత్తగా ఉన్న ఆ సైనికులను చాలా యుక్తిగా బంధించి తన చివరి రక్తపు బొట్టులోని శక్తిని కూడా ఉపయోగించి మాతృ భూమి  రష్యాకి విజయాన్ని సాధించి పెడతాడు.
తన వెనక చాలా సైన్య ముందేమో అని భ్రమపడే జర్మన్ల నుద్దేశించి"ఒరేయ్, నా వెనక ఉన్నది సమర్ధులైన అయిదే ఐదుగురు సైనికుల్రా, అది కూడా ఆడపిల్లల్రా"- అని అంటాడు వస్కోవ్.
యుద్ధం ముగిసిన తర్వాత ఇరవై సంవత్సరాలకు కొడుకు, తన దత్తపుత్రుడు అయిన ఇగోర్,అతని భార్యతో ఆ ప్రాంతాన్ని చూడడానికి వస్తాడు వస్కోవ్. సినిమా ఈ సీన్ తో ముగుస్తుంది.
మహిళా కామ్రేడ్లు కుంగిపోలేదు. చాలా గట్టిగా, నిబద్ధతతో ఉన్నారు. శత్రు కాల్పుల అగ్ని పరిక్షలకు తబ్బిబ్బు పడకుండా ఉన్నారు. వాళ్ళు తన సొంత మృత్యువుతో తాను దాగుడు మూత లాడుతున్నట్లు న్నారు. తన పక్క పిడికెడు మట్టిని సైతం శత్రువు చేతికి చిక్క నివ్వలేదు. మహిళా కామ్రేడ్లు తమ శ్రేణిని, యుద్ధ రంగాన్ని, రష్యా ని నిలబెట్టారు- అని తలపోస్తాడు వస్కోవ్.
వాస్తవ గాధల ఆధారంగా రష్యా లోని అందమైన ప్రదేశం కొరేలాలో ఈ చిత్రం దృశ్యీకరించబడింది
యుద్ధాల వల్ల కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుని కష్టాల్లో ఉన్న అతి సాధారణమైన అమ్మాయిలు వారి అసాధారణమైన శౌర్యం, ధైర్య సాహసాలతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటారు. 18, 19 సంవత్సరాల అమ్మాయిలు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు లక్షలాది ప్రజలతో పాటు భీభత్సమైన యుద్ధంలో పాల్గొనడం, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చెయ్యడం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం!
ఈ నాటి మన ప్రపంచం విప్లవాత్మకంగా చైతన్యీకరింపబడటానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి అక్టోబర్ సోషలిస్టు విప్లవ విజయం (1917). ప్రపంచం లోనే ప్రప్రధమ సోషలిస్టు దేశం రష్యా అయితే, ఆ దేశంలో మానవత్వపు హద్దులకు వెలియైన మహిళలు రెడ్ ఆర్మీలో చేరి, విప్లవాత్మకమైన పోరాటాల్లో పాల్గొనడం అనేది ఆనాటి నుంచీ, ఈనాటివరకూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో న్యాయ పోరాటాలకు స్ఫూర్తి నిస్తుంది. ఈ సినిమా చూసిన వారెవరికైనా సోషలిస్టు భావాల తాకిడితో ప్రేరణ కలుగుతుంది.
జర్మన్ విమానాలను రాత్రివేళ చూశానని రీతా చెప్పినప్పుడు "ఆ సమయంలో నువ్వు అక్కడ ఎందుకు న్నావని వస్కోవ్ అడుగుతాడు. ‘కొన్నిప్రశ్నలకు స్త్రీలు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు’- అంటుంది కిర్యానోవా. అప్పుడు వస్కోవ్ “ఇక్కడ సైనికులూ, ఆఫీసర్లూ మాత్రమే ఉన్నారు.ఆడవాళ్ళెవరూ లేరు” – అని అంటాడు వస్కోవ్. ఆడవాళ్ళనే జెండర్ తేడా తెలియకుండా సైన్యంలో ఎంతో మమేకమయ్యారని ప్రేక్షకులకు తెలుస్తుంది. వస్కోవ్ సరదా వ్యక్తిత్వాలతో, ఉద్వేగాల్లో ఉన్న టీనేజ్ అమ్మాయిలను చూచి చిరాకు పడతాడు. కానీ  వారి క్రియాశీలత్వాన్ని తెలుసుకుని అబ్బురపడతాడు.  
రీతా ఒస్యానినా లా నటించిన ‘ఇరినా షౌచుక్’, జేన్యా కొమెల్కోవా లా నటించిన ‘ఓల్గా ఒస్ట్రుమోవా’, బ్రిచ్కీనా లీజా లా నటించిన ‘యేలినా డ్రపెకో ‘తమ అనితర సాధ్యమైన నటనా ప్రాభవంతో దిగ్భ్రాంతి కలిగిస్తారు.
ఇది అద్భుతమైన దృశ్య కావ్యం.ఈ సినిమా గురించి ఎంత చెప్ఫినా ఏదో వెలితి గానే ఉంటుంది. దృశ్య కావ్యాల్ని మాటల్లో వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ తప్పక చూసి, కలిసి చర్చించాలి !
ఇది బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీ ఫిల్మ్ అని ప్రపంచ సినీ మేధావులు కీర్తించారు.
ఈ సినిమా దారుణమైన మల్కన్ గిరి ఎన్ కౌంటర్ల గురించి దుఃఖ పడుతూ రాశాను. మనపాలకు ల కౄరత్వం కంటే జర్మన్ నాజీల ఫాసిజమే నయమనిపించింది.
ఈ సినిమాని అర్ధం చేయించిన ప్రగతి ప్రచురణాలయం వారి"ప్రశాంత ప్రత్యూషాలు" నవలకి కృతజ్ఞతలతో

                                                                                                                                -శివలక్ష్మి



“స్ట్రైక్” సినిమా ప్రపంచ శ్రమజీవుల కందించిన సందేశం.

Director : Sergei Eisenstein
Country : Soviet Union
Duration : 1 hr. 22 min. 

1925 లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణ“స్ట్రైక్”.ఈ సినిమా డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చిత్ర నిర్మాత “సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్”. ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన  రాజకీయ చిత్రం.

కథలోకి వెళ్ళి క్లుప్తంగా చెప్పుకోవాలంటే - ఒక మెటల్ ఫ్యాక్టరీలో 25 రూబిళ్లు ఖరీదు చేసే ఒక మైక్రోమీటర్  మాయమవుతుంది. ఆ నేరాన్ని యాజమాన్యం 'యాకోవ్' అనే కార్మికుడి మీదకు నెడుతుంది. అవమానభారంతో అతను ఉరి వేసుకుని మరణిస్తాడు. యాకోవ్ ఉరి తీసుకునే ముందు తనకు జరిగిన అన్యాయం గురించి తన సహ కార్మిక సోదరులకు వాస్తవాలను వివరిస్తూ రాసిన ఒక లేఖను వదిలి వెళ్తాడు. ఆ లేఖతో పాటు, యాకోవ్ వేళ్ళాడుతున్న శవాన్ని చూసిన కార్మికులు పట్టరాని ఆగ్రహంతో పని అక్కడికక్కడే ఆపేసి, మిల్లింగ్ గది వదిలేసి మెరుపు సమ్మెకు దిగుతారు. స్ట్రైకర్స్ కొలిమి కిటికీల ద్వారా  వదులుగా ఉన్న మెటల్ ని, రాళ్ళని విసురుతూ కొలిమి పనికి ఆటంకం కలిగిస్తారు. అప్పుడు యాజమాన్యం మండిపడుతూ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ గేట్ల లోపల కార్మికులందర్నీ నిర్భందిస్తుంది. కోపించిన శ్రామికులు కార్యాలయాన్ని ఆక్రమించి ఒక అధికారిని బలవంతంగా ఒక బండి చక్రానికి గట్టి కొండ పక్కనున్న వాగు నీటిలో ముంచుతారు. ఆ రోజు నుంచి కార్మికులు పనిని స్తంభింపచేయడం వల్ల ఫ్యాక్టరీ ఖాళీగా ఉండి, కళావిహీనమై పోతుంది. రాబడి ఆగిపోయినందువల్ల యాజమాన్యం ఆగ్రహం రోజు రోజుకీ   పెరిగిపోతూ ఉంటుంది. శ్రామికులు ఐక్యంగా ఉండి, సమిష్టి ఆలోచనలతో తమ డిమాండ్లు రూపొందిస్తారు.

1) కార్మికులందరికీ 8 గంటల పని దినం కావాలి
2) యాజమన్యం శ్రామికులను మర్యాదగా,సాటి మనుషులుగా చూడాలి.
3) 30% వేతనం పెంచాలి.
4) బాల కార్మికులకు (మైనర్లకు) 6 గంటలకు మించి పని ఉండరాదు.

ఈ నాలుగు ముఖ్యమైన డిమాండ్లతో తయారైన ఒక రాత ప్రతిని  కార్మికులు యాజమాన్యం ముందుంచుతారు. ఈ దరఖాస్తును యాజమాన్యం-వాటాదారులు కలిసి కూర్చుని సిగార్ల ధూమపానం పీలుస్తూ, రకరకాల  పానీయాలు సేవిస్తూ మహా విలాసంగా తమ సమావేశంలో చర్చిస్తారు.ఇంతకీ చర్చల అనంతరం ఏం సెలవిస్తారనుకున్నారు? వాటాదారుల ఆదేశాలతో 8 గంటల పని దినం చట్ట విరుద్ధమైనదనీ, 30% వేతన పెంపకంతో సహా మిగిలిన రెండు డిమాండ్లూ కూడా న్యాయ సమ్మతమైనవి కావనీ నిర్ద్వద్వంగా తిరస్కరిస్తారు. 

రోజుల తరబడి సమ్మె కొనసాగుతుంది.రెక్కాడితేగాని డొక్కాడని శ్రామికుల కుటుంబాలు  పసిబిడ్డలతో సహా ఆకలి బాధలకు అల్లాడిపోతుంటారు. యాజమాన్యం కార్మికుల పట్ల ఏమాత్రం సానుభూతి లేకుండా తాను పట్టిన పట్టు వీడదు. శ్రామికుల నిరసన తీవ్రరూపం దాలుస్తుంది. పోలీసులు పురికొల్పడంతో శ్రామిక వర్గంలోనే ఉన్న దుష్ట కార్మికులు పోలీసులతో కుమ్మక్కై సోదర కార్మికులకు అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచే భ్రష్టాత్వనికి పాల్పడతారు. యాజమాన్యపు గూఢచారులు జరుగుతున్న పరిణామాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తూ అప్రమత్తంగా కాపలా కాస్తుంటారు. వీళ్ళందరూ కలిసి - ఆకలి మంటలను సహిస్తూ ,సర్వ శక్తులూ కేంద్రీకరించి సమ్మె చేస్తున్న కార్మికులపై అగ్నిమాపక విభాగంతో, పోలీసులతో దాడి చేయిస్తారు. ఇంతలో సైనిక సిబ్బంది నలువైపులా చుట్టు ముట్టడంతో కార్మిక శక్తి చెల్లాచెదురవుతుంది.

“మాలో పిరికి వాళ్ళు లేరు. దేశద్రోహులు లేరు. మా చివరి రక్తపు బొట్టు వరకూ మేము మా డిమాండ్లను సాధించు కోవడానికి శాయశక్తులా పాటు పడతాం” అని నినదించిన శ్రమ జీవులందరూ అమరులవుతారు.  ఆ ఆవరణమంతా శ్రమ జీవుల శవాల గుట్టలతో నిండిపోతుంది. సినిమా ఒక విషాద నెత్తుటి టోన్ లో ముగుస్తుంది.
సైన్యం సమ్మెను విధ్వంసకరంగా అణిచివేస్తుంది. అసలు సైన్యం ప్రజలకు సేవ చెయ్యాలి.కానీ ధనస్వామ్యానికీ బూర్జువా, కులీన వర్గాలకు సేవ చేస్తుందని చెప్పకనే చెప్తారు ఐసెన్ స్టీన్.     
స్థూలంగా ఇదీ కథ. కానీ ఈ సినిమాని ఐసెన్ స్టీన్ దృశ్యకావ్యంగా మలిచిన విధానం చెప్పాలంటే అదొక గొప్ప వచన కావ్యమవుతుంది. ప్రస్తుతం మే డే సందర్భానికి వర్తించే విషయాలు ప్రస్తావించుకుందాం!

అదొక నిశ్శబ్ద యుగం.ఇంకా టాకీలు రాలేదు. ఈ నిశ్శబ్ద సినిమా ‘స్ట్రైక్’ కి ప్రధానంగా మూడు గొప్ప  లక్షణాలున్నాయి . మొదటిది ముందు తరాల విప్లవ చరిత్ర, రెండోది సమూహాల కథ, మూడోది మాంటేజ్ తాకిడి.(రెండు విరుద్ధ సంఘటనల ఘర్షణ సృష్టించి తాను చెప్పదలచుకున్న కొత్త విషయాన్ని చెప్పడం)చరిత్రను తవ్వితే అంతులేని పనినుంచి 8 గంటల పనిదినం కోసం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కార్మిక పోరాటాలు స్ఫూర్తి నిస్తాయి. వాటిని అర్ధం చేసుకోవాలంటే ఒకసారి మనకు పూర్వం జరిగిన ఘర్షణలు, కొట్లాటల గురించి తెలుసుకోవాలి!

ఫ్యూడల్, భూస్వామ్య విధానాల తర్వాత వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధునిక పరిశ్రమలను సృష్టించింది. ఆ పరిశ్రమలలో పనిచేయడానికి అహర్నిశలూ  రెక్కలు ముక్కలు చేసుకుని సర్వ సంపదల్ని సృష్టించే శ్రమజీవుల్ని తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1840 దశకంలో కార్మికులు రోజుకి 10 గంటల కంటే ఎక్కువే పని చేసేవారు. 1850 దశకంలో సగటున వారానికి 70 గంటలు వెట్టి చాకిరి చేసేవారు. 1900 లో వారానికి సగటున  60  గంటలు  చాకిరి చేసేవారు.1920 లో వారానికి సగటున 50  గంటలు  పని చేసేవారు. పని,పని,పని- అది తప్ప ఇంకో వ్యాపకం లేకుండా గంటల తరబడి చేసే యాంత్రికమైన పనితో విసిగిపోయిన  కార్మికులలో  8  గంటల పని దినం కోసం ఆందోళన మొదలైంది. 1868 జూన్ 25 న కాంగ్రెస్ సభ్యుల కమిటీ 8 గంటల పనిదినాన్ని ప్రతిపాదించింది. కాని అందరూ  పెడచెవిన పెట్టి అసలు అదొక సమస్యే కాదన్నట్లు పట్టించుకోలేదు.1880 లలో మళ్ళీ అదే సమస్య పరిష్కారం కోసం అలజడి-ఆందోళనలు మొదలయ్యాయి.

పని వేళలకోసం,పని స్థలంలో కనీస సౌకర్యాలకోసం,చేసిన చాకిరికి సరైన కూలికోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడే ఉద్యమాలు మొదలయ్యాయి. ముఖ్యంగా 1868 లో సంవత్సరమంతా ఎక్కడివారక్కడ ఉద్యమాలు,సమ్మెలు చేశారు.ఫలితంగా  చిలికి చిలికి ఉధృతమైన వడగళ్ళవానగా రూపుదిద్దుకుని 1886 మే 1 న చికాగోలో  బద్దలైంది.ఆరోజు 25000 మందితో కార్మికులు గొప్ప ఊరేగింపులో పరిసరాలు హోరెత్తేలా కదం తొక్కారు. తర్వాత  హే మార్కెట్లో జరుగుతున్న కార్మిక సభపై పోలీసులు అతికౄరమైన వికృత వీరంగం చేశారు.నలుగురు కార్మికుల్ని పోలీసులు కాల్చి చంపారు. అమెరికా ప్రభుత్వం ఒక బూటకపు ఎన్ కౌంటర్ జరిపి ఆనాటి కార్మిక నాయకులు పార్సన్స్,స్పైజ్,ఎంగెల్స్ లను ఉరి తీసింది.దీని ఫలితంగా 1890  లో పారిస్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టుల సమావేశం  మే 1వ తేదీని "అంతర్జాతీయ కార్మిక పోరాటదినం"గా పాటించాలని తీర్మానించింది.అప్పటినుంచి ప్రపంచవ్యప్తంగా ఉన్న కార్మికులు చికాగో వీరుల బలిదానాన్ని స్మరించుకుంటూ మేడేని తమ విముక్తి పోరాటాలదినంగా జరుపుకుంటున్నారు.

1917 అక్టోబర్ లో రష్యన్ కార్మిక వర్గంలో దేశంలోని జాతులన్నీ ఏకమై పోరాడి సాధించిన విజయాలు అప్పుడున్న సమాజాన్ని విప్లవాత్మకంగా సోషలిస్టు సమాజం దిశగా మారడానికి దోహదం చేసింది.అంతర్జాతీయంగా వ్యాపించి ఉన్న కార్మిక ప్రపంచానికి అక్టోబర్ విప్లవం ఒక గొప్ప వెలుగును ప్రసరించే దీపస్తంభమైంది. పీడనకు వ్యతిరేకంగా అనివార్యంగా రూపుదిద్దుకున్న వర్గపోరాటంగా చరిత్రలో చిరకాలం నిల్చి భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తినిస్తుంది!

విప్లవ కాలంలో ఇంజనీరింగ్ చదువు మాని రెడ్ ఆర్మిలో పని చేసిన చైతన్యశీలి  ఐసెన్ స్టీన్. 27 ఏళ్ల వయసులో (స్ట్రైక్ కి ముందు) 1925 లోనే దృశ్యీకరించిన బాటిల్ షిప్ పొటోంకిన్ ఒక సృజనాత్మక విస్ఫోటనం. ప్రపంచ సినిమా ప్రేక్షకుణ్ణి దిగ్భ్రాంతికి గురి చేసింది. సోవియట్ యూనియన్ లో సోషలిస్టు రాజ్య స్థాపన గురించి తీసిన ఈ సినిమా సృష్టించిన విప్లవ ప్రకంపనాలకు కంపించిన బెర్లిన్,బ్రిటన్ దేశాలు చిత్రాన్ని నిషేధించాయి.అమెరికా కూడా భయంతో చిత్రాన్ని కొన్ని భాగాలు కత్తిరించింది. స్ట్రైక్ సినిమా తర్వాత వచ్చిన అక్టోబర్ చిత్రంలో కూడా జార్ చక్రవర్తి "వింటర్ ప్యాలెస్" పై విప్లవ వీరుల దాడిని అమోఘంగా దృశ్యీకరించారు.ప్రపంచాన్ని గజ గజలాడించిన పది రోజులు అనే జాన్ రీడ్ రచన ఆధారంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఇదంతా గమనించినప్పుడు ఐసెన్ స్టీన్ వ్యక్తిత్వం లోనే కార్మిక రాజ్యం రావాలనే ఆకాంక్ష ఉందనీ, శ్రమజీవుల పట్ల అపూర్వమైన ప్రేమాభిమానాలున్నాయనీ అర్ధమవుతుంది.తన ముందు తరాల విప్లవ పోరాట ప్రభావాలన్నీ ఈ సినిమాలో అపురూపంగా ఆవిష్కరించారు.

ఇక ఈ సినిమా రెండో లక్షణం-సమూహాల కథ. కార్మిక సమూహాల కథ. ఇది ఏ ఒక్కరి కథా కాదు. ప్రాంతం రష్యా కావచ్చు గానీ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న కోట్లాది శ్రమజీవుల కథ. వస్తువు విశ్వజనీన మైనది . సినిమా ప్రారంభమే వ్లాదిమిర్ లెనిన్  కొటేషన్
“The strength of the working class is organization. Without organization of the masses, the proletarian is nothing. Organized it is everything. Being organized means unity of action, unity of practical activity”.

నుండి మొదలవుతుంది. తర్వాత బాతులు, బాతు పిల్లలు, పిల్లి పిల్లలు, పందిపిల్లలు, మొదలైన జంతువుల యొక్క ఫుటేజ్  కనిపిస్తుంది. యాజమాన్యం – పెట్టుబడి పెట్టిన వాటాదారుల సమావేశంలో ఒక నిమ్మకాయను రసం తీసే మెషీన్ లో పెట్టి పీల్చి పిప్పి చేస్తుంటా డొక వాటాదారుడు.అంటే శ్రమిస్తున్న మనుషులమీద అపరిమితమైన ఒత్తిడి ఉందని, వాళ్ళను సాటి మనుషులుగా కాక జంతువుల కంటే హీనాతిహీనంగా చూస్తున్నారని దీనర్ధం. కార్మికులు ఐక్యంగా ఉండి వళ్ళంతా కళ్ళు చేసుకుని, ఎంతో శ్రద్ధాసక్తులతో తమ డిమాండ్లను ఒక రాతప్రతిలో రూపొందిస్తారు.యాజమాన్యం-వాటాదారులు అసలు వర్కర్స్ ని ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా ఆ దరఖాస్తు ఫారం గురించి అసలు సీరియస్ గా తీసుకోకుండా దానితోనే టేబిల్ మీద చిందిన మత్తుపానీయాలను తుడుస్తారు. కార్మికులు ప్రాణాలుగ్గబట్టి రాసిన దరఖాస్తులోని విషయాలు శ్రమ జీవులకు జీవన్మరణ సమస్యలు అవే సమస్యలు యాజమాన్యాలకు పనికిమాలినవి గా, అసంబద్ధంగా కనిపిస్తాయి. వేళ్ళతో లెక్కించదగినంత మంది, వేలాది జీవితాలను నిరంకుశంగా శాసిస్తున్న విధానాన్ని (అచ్చం ఇప్పటి కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నట్లే) ప్రేక్షకులకందించి ఆలోచించమంటారు ఐసెన్ స్టీన్. ఉద్రిక్తతలు, కష్టాలు, శ్రామికవర్గ త్యాగం మొదలైన ఉద్విగ్న సందర్భాలను తన కథనం ద్వారా ఏకైక దృశ్య భాష మూకీలో ప్రదర్శించడంలో ఒక అద్భుతమైన అవగాహన, మేధావితనం స్పష్టమవుతుంది. వందల మంది తారాగణంతో సినిమా ఆద్యంతం అద్భుతమైన వివరాలు అందిస్తూ,శ్రామికవర్గ విలువల్ని పటిష్టం చేస్తూ  శ్రామికవర్గ ప్రచారాన్ని  చిత్రీకరించడంలో వల్లమాలిన నేర్పరితనం చూపిస్తారు ఐసెన్ స్టీన్.ఇది చాలా ప్రతిభావంతమైన సమూహాల కథా కథనం.

ఇక మూడోది మాంటేజ్ ఆవిష్కరణ. మాంటేజ్ అంటే ఫ్రెంచ్ లో ఆకర్షణ అని అర్ధం . "ప్రతి చిత్రం ఓ పుట్టుక.ఓ కొత్త జన్మ ఎత్తడం” అన్న ఐసెన్ స్టీన్ రెండు పరస్పర విరుద్ధ శక్తుల సంఘర్షణలో ఓ నూతన శక్తి ఆవిర్భవిస్తుందనే మార్క్స్ గతి తార్కిక భౌతికవాదాన్ని ఆధారంగా చేసుకుని "మాంటేజ్" కి అన్వయించారు. దీనికి ఆయనే ఆద్యుడు. ఇంతకుముందు మాంటేజ్  దర్శకులు వెర్టోవ్, పుడోవ్ కిన్ లాంటి వారున్నప్పటికీ ఐసెన్ స్టీన్ వాళ్ళకి భిన్నమైనవారు. ఐసెన్ స్టీన్ ఈ సినిమా తీస్తున్న సమయానికి రష్యా ప్రజలు 80% నిరక్షరాస్యులు. రోజు రోజుకీ, క్షణ క్షణానికీ ఉధృతమవుతున్న విప్లవోద్యమంతో ప్రేక్షకుణ్ణి మమేకం చెయ్యడానికి, రాజకీయ ఆలోచనలు చెప్పడానికి మాంటేజ్ ని ఎన్నుకున్నారు ఐసెన్ స్టీన్. దృశ్య భాష ద్వారా రాజకీయ సందేశాలను తెలియజేసేందుకు మాంటేజ్ లోని విస్తారమైన అవకాశాలను వాడుకుని ప్రజలకు అవగాహన కలిగించి, చైతన్య పరచడానికి ప్రయత్నించారు. విభిన్న భాషల, జాతుల ప్రజలను చైతన్య పరచడానికి సినిమాకు మించిన కళారూపం మరొకటి లేదని లెనిన్ అన్నారు.

మాంటేజ్ ని అర్ధం చేసుకోవడానికి ప్రేక్షకుల్ని సంసిద్ధం చేసుకుంటారు ఐసెన్ స్టీన్.ఉదాహరణకి సైన్యం చేతిలో కార్మికులు చనిపోతున్న కౄరదృశ్యాన్ని  పశువుల వధ జరుగుతున్నట్లు  గ్రాఫిక్ చిత్రాలతో చూపించి ప్రేక్షకుల దిమ్మ తిరిగేట్లు చేస్తారు. యాకోవ్ మీద దొంగతనం ఆపాదిస్తున్న సీన్ లో యాకోవ్ క్లోజ్ అప్, మేనేజర్ క్లోజ్ అప్ రెండూ కనిపిస్తాయి. రెండు షాట్స్ ఒకదానితో ఒకటి ఘర్షణ పడతాయి. యాకోవ్ ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు అతని పట్ల సహానుభూతితో ఐడింటిఫై అవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఐసెన్ స్టీన్ . మేనేజర్ క్లోజ్ అప్ షాట్ చూస్తున్నప్పుడు మేనేజర్ నేరుగా తనమీదే దొంగతనం నేరారోపణ చేస్తున్నట్లు ప్రేక్షకుడు ఫీలవుతాడు. ఈ రెండు షాట్లనుంచి ఐసెన్ స్టీన్ సాధించ దలచుకున్న మూడో ప్రయోజనం-దొంగైనందుకు మేనేజర్ యాకోవ్ ని తిట్టడమే కాదు,తాను దొంగగా భావిస్తున్న యాకోవ్ పక్షం వహిస్తున్న ప్రేక్షకుణ్ణి కూడా తిడుతున్నట్లు ప్రేక్షకుడు ఫీలయ్యేలా చెయ్యడం. ఇది ఒక అత్యద్భుతమైన ప్రయోగం.తెలుగులో మన మహాకవి శ్రీ శ్రీ కూడా తన రచనల్లోని చరమరాత్రి కథల్లోనూ,"గుమస్తా కల"మొదలైన రేడియో నాటికల్లోనూ మాంటేజ్ ని ప్రయోగాత్మకంగా శక్తివంతంగా వాడి విజయం సాధించారు. చూడగానే మనసు చలించే   గొప్ప దృశ్యాలు చాలా ఉన్నాయీ సినిమాలో! ఒక నెత్తుటి ముఖం, ఒక మండే ఆయుధం ఉపయోగించి, సాధించదలచుకున్న మూడో ప్రయోజనాన్ని స్ఫురింపజేస్తారు!!

కార్మికులందరికీ, శ్రామిక సమూహాలన్నీటికీ, ఆ మాటకొస్తే సామాన్య ప్రజలందరికీ విశ్వ వ్యాప్తంగా వర్తించే సామాజిక ఇతివృత్తంతో, మాంటేజ్ టెక్నిక్ ని సమర్థవంతంగా ఉపయోగించి, ఈనాటికీ వర్తించేలా స్ట్రైక్ సినిమాని రూపొందించి చలన చిత్ర చరిత్రలో  తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఐసెన్ స్టీన్. ఆయన ఎవరి మెప్పు కోసం ఈ సినిమా తియ్యలేదు.సమాజంలోని అట్టడుగు మనుషులు,జంతువులకంటే హీనంగా చూడబడుతున్న మనుషుల పక్షం వహించి,వారి పట్ల ఆయనకున్న నిజాయితీ,నిబద్ధత లను చాటి చెప్పారు.  ఇంకో వెయ్యి సంవత్సరాలకైనా మనదేశంలో ఇటువంటి సినిమాని ఆశించలేము! ప్రేక్షకుల హృదయాలలో లేని జుగుప్సాకరమైన అభిరుచులను వెలికితీసి రెచ్చగొట్టే మన దర్శక నిర్మాతలు  కళ ప్రజలకోసం అని గుర్తించి ఎప్పటికైనా ఇంతటి ఉత్తమ విలువలను పోషించే చిత్ర నిర్మాణం చెయ్యగలరా?


మన ముందు తరాలవారి ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనిదినం ఇవాళ కార్పొరేట్ శక్తుల చేతుల్లో హరించుకుపోయి మళ్ళీ, మన తరాలు, మన భావి తరాలు గంటలతరబడి పని చేసే స్థితిలోకి నెట్టబడ్డారు.ఇంకా విచిత్రమేమిటంటే ఇంటి నుంచి పని చెయ్యడం ఒక సౌకర్యంగా చిత్రిస్తున్నారు.దానివల్ల యాజమాన్యం కార్మికులకు సమకూర్చవలసిన సౌకర్యాల నుంచి, కార్మికులు హక్కులుగా పొందవలసినవాటి నుంచి  యాజమాన్యం ఏ మాత్రం బాద్యత వహించకుండా  హాయిగా తప్పించుకుంటుందని కార్మికులు కూడా గమనించడం లేదు. కార్మిక పరిణామ చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ సినిమాని తప్పనిసరిగా చూడాలి! కూలిపోతున్న జీవితాలను నిలబెట్టడానికే కాదు, మనల్ని మనం నిలబేట్టుకోవడానికి కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి తీరాలి!!

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

పెట్టుబడి ఊసెత్తని ఉద్యమ సినిమా!


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  గోతె జెంత్రం (Goethe Zentrum-German film Club) లో నాలుగు సినిమాలు ప్రదర్శించారు. అందులో మార్చ్ 9 న ప్రదర్శించిన రెండు సినిమాలు మాత్రమే నేను చూశాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లోని మహిళల, బాలికల దారుణమైన పరిస్థితుల్ని ఈ రెండు సినిమాలు కళ్ళముందుంచాయి. అందులో మొదటి సినిమా: From Fear to Freedom ending violence against women 35 నిమిషాల నిడివి కల ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. దీనిని ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్ (Women’s Learning Partnership) వారు నిర్మించారు.
ప్రపంచవ్యాప్తంగా, ప్రతి ముగ్గురు మహిళల్లో కనీసం ఒకరు అతికౄరమైన హింస బారిన పడుతున్నారు. ప్రతి దేశంలో, ప్రతి సంస్కృతిలో, ప్రతి మతంలో, వర్గాల కతీతంగా ఉన్నత, మధ్య, అట్టడుగు తరగతుల్లోని మహిళలందరూ మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. మహిళలపైజరుగుతున్నఅన్ని రకాల హింసలు అంతం కావాలంటూ, భయాలనుండి స్వేచ్చ కోసం చేసేప్రయాణమే ఈ సినిమా ఇతివృత్తం
 ఐక్య రాజ్య సమితి గణాంకాల ప్రకారం 87% ఆఫ్ఘన్ మహిళలు  గృహ హింస బాధితులు.   కాంగోడెమొక్రాటిక్ రిపబ్లిక్ లో రోజువారీ 1100 కంటే ఎక్కువమంది  మహిళలు,  బాలికలు అత్యాచారానికి  గురవుతున్నారు. ప్రపంచం లోని 137 దేశాల్లో మానవ రవాణా  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని బారిన పడే 80% మంది స్త్రీలే!
ఈ చిత్రంలో పురుషుల్ని ఒక్కొక్కరినీ “నువ్వెంతమందిని అత్యాచారం చేశావు? అనడగడం కనిపిస్తుంది.ఆ పురుషులు ధీమాగా సిగ్గూ శరం లేకుండా 5, 10, 20 మంది అని చెప్తారు.గ్రామాలు తిరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువమందిని అత్యాచారం చేస్తామని కూడా నిర్భయంగా చెప్తారు. పరువు కోసం చెల్లెల్ని చంపేశానని చెప్తాడొకడు. ప్రతి ఏటా దాదాపు 5000 మందిని పరువు, మర్యాదల పేరిట సొంత కుటుంబ సభ్యులే హత్యలు చేస్తున్నారు.
ఏడేళ్ళ పాపకి పెళ్ళి చేస్తే, ఆమె 15 ఏళ్ళకి ఇద్దరు బిడ్డల తల్లవుతుంది.బాల్య వివాహాలు, గర్భ ధారణలతో చిన్న పిల్లలైన తల్లులు, పసిబిడ్డలు కూడా  ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు దాదాపు చాలా దేశాల్లో చిత్రీకరించడం కనిపిస్తుంది.
“ప్రపంచవ్యాప్తంగా మహిళలు బృందాలుగా ఏర్పడి హింస లేని సమాజం కోసం,స్త్రీల హక్కుల్ని సమర్ధించే మెరుగైన కొత్త చట్టాల కోసం పోరాడుతున్నారు. బలమైన వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే ప్రజాస్వామ్య భావనలు నెలకొల్పడానికీ, హింసా సంస్కృతిని అంతం చేయడానికి కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు”- అని అంటారు యునైటెడ్ నేషన్స్ మాజీ సెక్రటరీ జనరల్ గా పని చేసి ప్రస్తుతం ‘ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్’ బోర్డ్ చైర్మన్ గా ఉన్న తొరయా ఒబైడ్ (Thoraya Obaid)
ఇరాన్, అమెరికాలలో ‘ఉమెన్స్  లెర్నింగ్ పార్ట్నర్ షిప్’ వ్యవస్థాపక సభ్యురాలైన మెహ్ నాజ్ అఫ్ కామీ(Mahnaz Afkhami) “మా సంస్థ లింగ వివక్ష మూల కారణాలను అన్వేషిస్తుంద”ని అంటారు. దేశ దేశాల్లో పని చేసే వీరందరూ ఉమెన్స్  లెర్నింగ్ పార్ట్నర్ షిప్ భాగస్వాములే!
సింధి మేదర్ గౌల్డ్ (Sindi Medar Gould) నాయకత్వంలో నైజీరియాలో పనిచేస్తున్న ఒక సంస్థ మహిళలపై హింసను నమోదు చేస్తుంది.
నైజీరియా నుంచి బాయోబాబ్ అనే సంస్థలో పని చేసే షిబోగూ ఓబెన్వా (Shibogu Obinwa) మహిళలకు జరిగే శరీర హింస నుండి తమను తాము రక్షించుకునే హక్కుల గురించి “నా శరీరం, నా ఇష్టం” అని చెప్పే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తారు.

హఫ్సాత్ ఆబియోలా (Hafsat Abiola) నైజీరియాలో ప్రజాస్వామ్య స్థాపనే తమ ధ్యేయమంటుంది. టర్కీలో పని చేసే యాకిన్ ఎర్టర్క్ (Yakin Erturk)  మహిళల మీద అమలవుతున్న హింస గురించి ప్రస్తావిస్తారు.

అమెరికా నుంచి ఫ్రాన్సెస్ కిస్లింగ్ (Frances Kisling) మహిళలు లైంగిక పరమైన దుర్గార్గపు ఆలోచనలను ప్రేరేపించేవారుగా, పురుషులు దానికి బలవుతున్న వారుగా సమాజపు నరనరాన ఎందుకు ఇంకిపోయిందో అనేదాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంది.

అమెరికా రట్జర్స్ విశ్వవిద్యాలయం నుంచి కరీమా బెన్నౌన్ (Karima Bennoune) అమెరికాలో చట్టాల అమలు గురించి మాట్లాడతారు.జాక్వెలిన్ పీటాంగ్వై (Jacqueline Pitanguy ) బ్రెజిల్ నుంచి తమ సంస్థ సమాజంలోని స్త్రీ-పురుష అసమానతల గురించి పనిచేస్తుందని చెప్తారు.బహ్రెయిన్ నుంచి వాజీహా అల్ బహార్న (Wajihaa Albarna) తమ సంస్థ పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తుందని చెప్తారు.

మలేషియా నుంచి బెట్టీ యో (Betty Yeoh) పని ప్రదేశంలో వేధింపుల మీద తమ సంస్థ గురి పెడుతుందంటారు.శక్తివంతమైన అంతర్జాతీయ చట్టాల నుపయోగించి సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తుందని చెప్తారు.మలేషియా లోని మ్యూస్ వా నుంచి జైనా అన్వర్ (Zainah Anwar) ముస్లిం పురుషులు స్త్రీలను కొట్టి, రకరకాల హింసలకు గురి చేస్తున్నారనే విషయాన్ని ప్రచారం చేసి ప్రజల మద్దత్తుని కూడగట్టడానికి తమ సంస్థ కృషి చేస్తుందని చెప్తారు.

జోర్డాన్ నుంచి అస్మా ఖాదర్ (Asma Khader) కొత్త సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో స్త్రీల సమస్యల మీద ప్రజల్లో అవగాహన పెంచడానికి తమ సంస్థ కృషి చేస్తుందంటారు. పరువు కోసం తన చెల్లెల్ని హత్య చేసిన కేసులో మహిళల నిరసన ఫలితంగా, ఆమె సోదరుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఇలాంటి ముఖ్యమైన సందేశం ప్రజల్లో మార్పు తెస్తుందంటారు అస్మా.లెబనాన్ నుంచి పని చేసే లిన హబీబ్ (Lina Habib) తమ సంస్థ పురుషాధిపత్యానికి వ్యతిరేకంగాఉద్యమిస్తుందని చెప్తారు.
ఐర్లండ్ నుంచి మేరీ రాబిన్సన్ (MARY ROBINSON) వారి సంస్థ మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అని నినదిస్తూ ప్రజల్లో అవగాహన పెంచడానికి దోహదం చేస్తుందంటారు.
పాకిస్తాన్ నుంచి రబియా హది (Rabia HAdi) స్త్రీల పట్ల హింస అంతం కావాలంటే విద్య ద్వారా సాధికారత సాధించాలంటారు.
1993 డిసెంబర్ 20న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా మహిళలపై హింస నిర్మూలన గురించి ఒక ప్రకటన వెలువడింది. అందులో కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిస్తూ “స్త్రీల సమానత్వం, భద్రత, స్వేచ్ఛ, గౌరవం మొ.న హక్కుల పట్ల హామీ పడుతూ స్త్రీల పట్ల వివక్ష తగదని హెచ్చరించింది. మహిళల హక్కులు కూడా మానవ సార్వత్రిక హక్కులలో భాగమేనని ప్రకటించింది.
ఈ హక్కులు అమలు కావడానికి పితృస్వామ్యం పెద్ద అడ్డంకిగా నిలుస్తుందని చెప్తారు ఈ ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్ నాయకులు.
ఒక సంస్థ నుంచి మిగిలిన అన్ని సంస్థలూ సమాచారాన్ని,కష్ట-నష్టాలను పంచుకోవడం, ఒకరినుండి మరొకరు నేర్చుకోవడం ద్వారా వారి మధ్య కొన్ని భావ సారూప్యతలూ – కొన్ని తేడాలు ఉన్నప్పటికీ వారి వారి లక్ష్యాల దిశగా పని చేస్తూ భవిష్యత్తులో ప్రజాస్వామ్య సమాజాన్ని సాధిస్తామని చెప్పుకొచ్చారు.
అన్ని సంస్కృతుల, అన్ని తరగతుల, అన్ని తరాల లింగ పరిధుల్లో సంభాషణ నడుపుతూ మేము సంఘటితమై మా భాగస్వామ్య సామర్థ్యాన్ని పటిష్టపరచుకుంటూ మరింత విస్తరణకు ప్రయత్నిస్తున్నా మంటారు దీని నాయకులు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చివరికి 1800 సంవత్సరం నుంచి మొదలై 1910 వరకూ కొనసాగి తమ రాజీ లేని పోరాటాలతో, చివరికి 140 మంది చికాగో దుస్తుల తయారీ ఫ్యాక్టరీలోని మహిళా కార్మికుల ప్రాణత్యాగాలతో అంతర్జాతీయ మహిళా ఉద్యమాలు సాధించిన ముఖ్యమైన మైలురాళ్ళ ఫలితంగా “అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం” ఏర్పడింది. ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిని సమీక్షించుకుని,సాధించుకోవలసిన సమస్యల కోసం భావి పోరాటాలకు సిద్ధం కావడం “అంతర్జాతీయశ్రామిక మహిళా పోరాట దినం” లక్ష్యం. పండగల్లాగా పట్టు చీరల బహుమతులతో,ముగ్గుల పోటీలతో జరుపుకుంటారు “ అంతర్జాతీయ మహిళా దినోత్సవం” – ఈ రెండిటికీ స్పష్టమైన తేడా ఉంది. అందరూ ఈ భేదాన్ని తెలుసుకోవాలి!
మహిళల మీద అమలవుతున్న హింసను ఎంతో హృద్యంగా  దృశ్యీకరించిన ఈ నాయకత్వం అసలు దీనికంతకూ మూలకారణమైన పెట్టుబడిని రవ్వంతైనా ఎక్కడైనా చెప్తారేమోనని వళ్ళంతా కళ్ళు చేసుకుని కళ్ళార్పకుండా శ్రద్ధగా సినిమా చూశాను.పొరపాటున కూడా పెట్టుబడి ప్రస్తావన రానివ్వలేదు. అసలు జబ్బేమిటో తెలుసుకోకుండా బస్తాలు బస్తాలు మందులు మింగించినట్లుంది. ప్రభుత్వాలను ప్రశ్నించకుండా సన్నాయి నొక్కుల ఉద్యమాల వల్ల ఉపయోగం ఉండదు.
ఎన్ని చట్టాలు వచ్చినా అవి అమలు కావు.మహిళల మీద హింస ఆగదు.దీనికి కారణం ప్రభుత్వాలను తమ పెట్టుబడితో వెనకుండి నడిపే కార్పొరేట్ శక్తులు.

” పెట్టుబడి అనే బండ రాయి కింద నలిగిపోతున్న చీమలు మన శ్రామికులు. పెట్టుబడి రాక్షసికి ఆహారం జంతువు ల్లాంటి మన శ్రామికులు “అని 16 వ శతాబ్దం లోనే తన “అన్నా కరేనినా” నవల్లో నికొలాయ్ అనే పాత్రతో చెప్పిస్తారు టాల్ స్టాయ్. శ్రామికులవే బానిస బతుకులైతే, ఇక బానిసకు బానిసలైన స్త్రీల పరిస్తితి ఎంత హీనంగా ఉంటుందో చెప్పనే అక్కరలేదు !

“బీద వారినే కాదు,ఈ భాగ్యవంతుల్నీ వాళ్ళ గొప్ప తనాల భారాల నించీ, ఊపిరాడని గర్వాల నించీ,మర్యాదల నించీ,ఈర్ష్యల నించీ, చికాకుల నించీ తప్పించి, శాంతినీ, సంతోషాన్నీ, తృప్తినీ ఇచ్చి కాపాడే కమ్యూనిజం రావాల”ని కాంక్షించాడు చలం. అంతో ఇంతో సామాజికంగా,ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉన్న స్త్రీలకైనా స్వేచ్చ రావాలంటే ఈ అణచివేతలకు మూలకారణాలను అన్వేషించాలి!

26, అక్టోబర్ 2013, శనివారం

AISFM Film Vid



ANR Award -


3, అక్టోబర్ 2013, గురువారం

ఓపెన్ కాస్ట్ గనులు-అభివృద్ధి పేరిట ప్రజల్ని అంచులకు నెట్టివేస్తున్న ప్రభుత్వాలు

సెప్టెంబర్ 26 వ తేదీన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక(ప్రరవే) నుంచి 12 మందిమి కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల పట్టణం చుట్టూ ఉన్న గ్రామాల్లోని ఓపెన్ కాస్ట్ గనులను చూడడానికి బయలు దేరాం.మా బృందంలో మా ప్రధాన కార్యదర్శి కాత్యాయనీ విద్మహే,ఉపాధ్యక్షురాలు అనిశెట్టి రజిత,కార్యనిర్వాహక కార్యదర్శి కొండేపూడి నిర్మల,కార్యవర్గ సభ్యులు డాక్టర్ నళిని,డాక్టర్ కె.సుభాషిణి,,మందరపు హైమవతి, శివలక్ష్మి,సభ్యులు రత్నమాల, కొలిపాక శోభారాణి తాయమ్మ కరుణ,బండారు విజయ,డి.ఆర్.మంజుల ఉన్నారు.
వీలైనన్ని ఎక్కువ గ్రామాలను చూడాలనే తాపత్రయంతో తెల్లవారి నాలుగున్నరకే బయలుదేరినప్పటికీ హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి,గాంధీనగర్,నల్లకుంట,బంజారాహిల్స్,దిల్ షుక్ నగర్ మొదలైన చోట్ల ఇద్దరు ముగ్గురుగా జతకూడిన మేమందరం సిటీ దాటేసరికే ఆరుగంటలైంది.దిగితే ఎక్కడ లేటవుతుందోననే భయంతో అల్పాహారం వెహికల్ లోనే ముగించుకుని, మంచిర్యాలకి మిట్ట మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకున్నాం.మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సంఘం నుంచి నీలిమ తన స్థానిక ప్రజాసంఘాల బృందంతో సిద్ధంగా ఉంది.
ముందుగా మేము సింగాపూర్ లో తవ్వుతున్న గనుల్ని చూశాం.రాక్షసి లాంటి పొక్లైన్ ట్రక్కులు పదిదాకా ఉన్నాయి.వాటిని నిరంతరం ఒక్క నిమిషం తీరిక లేకుండా డ్రైవర్లు బొగ్గు తవ్వడానికి వినియోగిస్తున్నారు.పొరలు పొరలు గా బొగ్గుతో ఉన్న భూమిని చూశాం.పెద్ద పర్వతంలా పేరుకుపోయిన తవ్విపోస్తున్న ఇసుక గుట్ట దూరంగా కనిపించింది.అది ఒక చిన్న ఊరంత జాగా ఆక్రమించింది.బొగ్గు తవ్వుతున్న కొద్దీ అది పాపంలా పెరిగిపోతూనే ఉంటుంది.300 అడుగుల వరకూ ఉన్న బొగ్గును తవ్వితీస్తూనే ఉంటారట. తవ్వేకొద్దీ పేరుకుపోతున్న ఇసుకతో, దుమ్ముతో చుట్టుపక్కల ఊళ్ళన్నీ కాలుష్యమయమైపోతున్నాయి. మొత్తం 880 ఎకరాల్లో 19 గ్రామాలను సర్వ నాశనం చేస్తూ,ఆ గనులు తవ్వి పొయ్యగా వచ్చిన మట్టితో ఊళ్ళను బొందలగడ్డలుగా మారుస్తున్నారని ప్రజలు చెప్పారు. 25 ఏళ్ళకు కాంట్రాక్టులు కుదుర్చుకున్నారనీ, ఇప్పుడు ఏడేళ్ళే అయిందనీ స్థానిక ప్రజాసంఘాల మిత్రులు శ్రీమన్నారాయణ,సమ్మయ్యలు చెప్పారు.ఎవరివన్నీ చేయిస్తున్నారని అడిగితే సింగరేణి యాజమాన్యంతో కూడి కొన్ని ప్రైవేట్ సంస్థలు SVS,VPR,BGR అనే కంపెనీలు అని చెప్పారు గానీ వాటిపూర్తి పేర్లు గానీ వెనక ఉన్న రాజకీయ నేతల పేర్లు గానీ చెప్పలేకపోయారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పేరు చెప్పారు. ఉద్యమపార్టీ టి.ఆర్.ఏస్.తో సహా ఈ పాపంలో అన్ని రాజకీయ పార్టీలూ ఉన్నాయని చెప్పారు.ప్రజలను మోసం చేసే విషయంలో పార్టీలన్నీ ఒక చెట్టు కొమ్మలే కదా!


ఆ పక్కనున్న గ్రామ మహిళలు "దుర్గం పోశవ్వ", “రాజమ్మ”, “లక్ష్మి” లతో మాట్లాడాం.శ్రీరాంపూర్,గంగాపూర్ గ్రామ పంచాయితీ లోని 4000 మంది జనాభా అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పారు.వాళ్ళ పంట భూముల్ని,ఖాళీ జాగాల్ని ఆక్రమించుకుని,వాటికి చిల్లి గవ్వకూడ డబ్బు చెల్లించలేదని చెప్పారు. తవ్వే గనుల్లో కూలి పనుల ఆశ లేకుండా చేశారని చెప్పారు. "డప్పు డప్పు శబ్దాలతో కునుకుండదు.మగవాళ్ళెవరూ లేనప్పుడు పగలు మూడింటికి గనులు పేలుస్తారు.ఆ పేలుళ్ళకు గుండెలు దడ దడ లాడతాండయి.మస్తు భయమైతాంది. పేలుడు జరిగినప్పుడల్లా ఇంటిగోడలు పగుళ్ళు బారబట్టినయి.,ఉండలేక ఊరిని వదిలి వెళ్ళలేక,చావలేక బతకలేక బతుకులీడుస్తుంటిమని చెప్పింది రాజమ్మ”. "ఎప్పుడెవరిని అడిగినా మీ ఊరికేం గాదు అనబట్టిరి.మాకెవరికీ చెప్పకుండానే భూమిపూజలు చేస్తుంటిరి"అని లక్ష్మి చెప్పింది. మా బతుకులు సర్వ నాశనం బట్టిస్తుండ్రని పోశవ్వ చెప్పింది.

ఆ తర్వాత మేము ఎర్రగుంటపల్లె వెళ్ళాము. ఇక్కడ మొత్తం 300 ఇళ్ళు-900 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామస్థులందరూ యాదవ కులస్థులే! ప్రతి ఇంటికీ నాలుగు పాడి పశువులు,ఒక్కో కుటుంబానికి రెండు నుంచి నాలుగు ఎకరాల భూమీ ఉన్నాయి. పక్కనున్న ఊళ్ళల్లో పాలమ్ముకుంటారు. పొలాల్లో వ్యవసాయం చేసుకుంటారు.ప్రకృతి పచ్చదనాలమధ్య స్వయం సమృద్ధితో కళ కళ లాడే మనుషులతో,యూనిఫారాలతో వెలుగులు చిమ్ముతున్న ముఖాలతో స్కూళ్ళకు పోతున్న చిన్నారులతో ఊరంతా ఒకప్పటి భారత గ్రామీణ దృశ్యంలా ఉంది. ఈ ఊళ్ళో ఒక వాగును చూశాం.దాన్ని గ్రామస్థులందరూ "పాలవాగు" అని పిలుచుకుంటారు.మేము ఎర్రటి మండుతున్న ఎండలో వెళ్ళాం.ఆ వాగులోని చల్లని,స్వచ్చమైన నీటితో సేద దీరాం.చుట్టూ పచ్చని పొలాలు.కమ్మని హాయి గొలిపే గాలులు నగర కాలుష్యానికి బలవుతున్న మా కళ్ళకీ శరీరానికీ విందు చేశాయి.కానీ విధ్వంసం కానున్న మ్యాప్ లో ఎర్రగుంటపల్లె గ్రామం ఉందని ఈ గ్రామస్థులు కనిపెట్టారు. అశోక్,అహ్మద్ లాంటి యువకులు " ఓపెన్ కాస్ట్ వ్యతిరేక కమిటీ" లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వృద్ధులతో సహా స్త్రీ-పురుషులందరూ చాలా చైతన్యవంతంగా కనిపించారు . 2013-ఏప్రిల్ 15 న సింగరేణి జనరల్ మేనేజర్ ఆఫీస్ ఎదుట జరిగిన ధర్నా లో పాల్గొన్నారు. మహిళలు పద్మావతి,లక్ష్మి,జి.పద్మ ఇంకా చాలా మంది గొప్ప పోరాట పటిమతో ఉన్నారు.అందులో జి.పద్మ అసలు మీరెవరు?అందరూ వస్తారు. రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తారు.ఎవరు మాకు మేలు చేస్తారో,ఎవరు కీడు చేస్తారో ఎలా తెలిసేది?అని ప్రశ్నించింది.మాతో ఉన్న స్థానిక సభ్యులు నచ్చచెప్పాకే మాతో అందరూ మాట్లాడ్డం మొదలెట్టారు.

మ్యాప్ లో మా గ్రామం ఎందుకుందని అక్కడ సర్వేచేస్తున్నవారిని జి. పద్మ నిలదీస్తే "పెద్ద మనుషులున్నప్పుడు అంటే అధికారులు,కలెక్టర్లు లాంటి వాళ్ళున్నప్పుడు అలాంటి ప్రశ్నలడగొద్దు.ప్రజాసంఘాలతో రావద్దు.విడిగా అడగండి" అన్నారట.

ఈ గ్రామం గాంధీజీ చెప్పిన స్వయం సమృద్ధి సంపూర్ణ గ్రామీణ వ్యవస్థకి ప్రతీకగా ఉన్నప్పటికీ,ఈ ప్రజలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమైనప్పటికీ రాక్షస రాజ్యం బంగారు "పాలవాగు"ను ఏమి చేయనున్నదో అనే సందేహంతో గోరటి వెంకన్న "వాగు ఎండి పాయెరా" పాట గుర్తొచ్చి వ్యధతో మనసంతా వికలమైపోయింది

మధ్యాన్న భోజనం తర్వాత "దుబ్బగుడా"గ్రామానికెళ్ళాం.ఏ ఇంట్లో చూసినా పచ్చని చెట్లు మిల మిలా మెరుస్తున్న రకరకాల రంగుల పూలతో రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు పరవశం కలిగించాయి.బీర,సొర,కాకర,గోంగూర మొదలైన కూరగాయలు ఇంటికీ,ఇరుగు పొరుగువారికీ సరిపోయేటట్లు తాజాగా,నేవళంగా నిగనిగలాడుతూ కనిపించి నోరూరించాయి. ఇక్కడ చుట్టు పక్కలనున్న కొన్ని గ్రామాల ప్రజలు,ప్రజా సంఘాలు,మీడియాతో జమయ్యారు. "తెలంగాణా పర్యావరణ పరిరక్షణ కమిటీ"నుంచి వచ్చిన ఉపాధ్యక్షులు మాతో మాట్లాడారు.”మేము సమావేశమయిన ఇంటిముందున్న రోడ్డు ఓరియంటల్ సిమెంట్ ఫ్యాక్టరీ కి దారి.అదే ఆ మండల్ కి ముఖద్వారం.అక్కడ 349 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే 700 ఎకరాల ప్రజల పట్టా భూములున్నాయి.అక్కడ నివసించే ప్రజలందరూ రోజు కూలీలే!గ్రీన్ హంట్ అభివృద్ధి అని చెప్పి 94 ఎకరాలు కబ్జా చేసి 1962 నుంచి ఒక్క పైసా ఇవ్వలేదు. నివసిస్తున్న ఇళ్ళు తప్ప మిగిలిన ప్రజల భూములూ,ఖాళీ జాగాలన్నీ స్వాహా కానున్నాయనీ,ఆ ప్రజలందరూ నిర్వాసితులు కానున్నారనీ గ్రీన్ హంట్ పేరిట మాన్ హంట్ చేస్తున్నారని చెప్పారు."అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసాన్ని ఖండిద్దాం " "స్వావలంబన,స్వయం పాలన కై పోరాడుదాం" అని అక్కడ గుమిగూడిన ప్రజలందరూ నినదిస్తూ "తెలంగాణా నిర్వాసిత వ్యతిరేక పోరాటాన్ని బలంగా నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

మా వేదిక సభ్యులందరం బాధిత ప్రజల్నీ ముఖ్యంగా ఆ యా గ్రామాల మహిళల్నీ కలిసి మాట్లాడాము.అందరిదీ ఒకటే ఘోష."మా భూములు,మా ఇళ్ళు,మా బర్రెలు,మా ఊళ్ళు ధ్వంసమైపోతే మా బతుకులేం కావాలి? పోరాడకపోతే బతుకు లేదు.బతుక్కోసం చావుకు తెగించి అందరం పోరాడతామని చెప్పారు.మొత్తం విధ్వంసంలో ఇదీ ఒక భాగమనీ,ప్రజలకు వ్యతిరేకమైన అన్ని విధ్వంసాలనూ వ్యతిరేకిస్తామనీ మీ పోరాటాలకు మద్దతు నిస్తామనీ మా వేదిక చెప్పింది.వేదికలోని ప్రతి ఒక్కరూ ఆ ప్రజలకు స్వాంతన కలిగించే మాటలు చెప్పాం. నందిగ్రాం,సింగూర్,సోంపేట,కాకరాపల్లి పోలవరం,వాకపల్లి,భల్లుగుడా,దుబాయి,జిందాల్ కంపెనీల విధ్వంసాలు, కాశీపూర్ ప్రాంతంలో గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా,నియంగిరి కొండల్లో వేదాంత కంపెనీ అక్రమ తవ్వకాలపై పోరాటాలేకాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి పోరాటాలే జరుగుతున్నాయి. ప్రజలు సాహసంగా ఎదురొడ్డి నిలిచి తమ వనరులను రక్షించుకుని , పోరాడే ప్రజలకు స్ఫూర్తి నిస్తున్నారని ధైర్యం చెప్పాం .

ఓట్లేసి గెలిపించిన పాలకుల్నిఈ ప్రజలు ఏమీ అడగలేదు."మాకు ఇళ్ళు కట్టించి ఇవ్వమనిగాని,మా పొలాలకు విద్యుత్తునివ్వమనిగాని,మా పిల్లలకు చదువు చెప్పించమని గాని,మాకు వైద్యం చేయించమని గానీ-ఇలాంటి సహకారాలకోసం అర్ధించలేదు. స్వేచ్చగా,ఆత్మాభిమానంతో వాళ్ళ మనాన వాళ్ళు బతుకుతుంటే, అలా కూడా బతకనివ్వడం లేదు. ఈ ప్రాంతం శ్రీకాకుళ మహత్తర పోరాటంతో సాధించుకున్న 1/70 చట్టం పరిధిలో ఉండగా రాజ్యాంగ ఉల్లంఘన చేసి వాళ్ళ గ్రామాల్లోకి చొరబడి మనుషుల్ని నాశనం చేసే ఈ అభివృద్ధి ఏ ప్రజలకోసం? "మీ పొలాలకు అధికమొత్తాల్లో డబ్బు చెల్లిస్తామనీ,ఇంకో చోట ఇళ్ళు కట్టించి ఇస్తామనీ,ఇంటికో ఉద్యోగం వచ్చేలా చూస్తామనీ -ఇలా సింగరేణి,ప్రైవేట్ సంస్థల బ్రోకర్లు బోలెడన్ని కల్ల బొల్లి కబుర్లు చెబుతారు.ఇంతవరకూ ఆక్రమించిన భూములకు ఏమీ చెల్లించిన పాపాన పోలేదు.ఒకవేళ ఇస్తామంటే కూడా అసలు వాళ్ళెందుకు ఖాళీ చెయ్యాలి? ప్రకృతితో,తమదైన ఇంటితో, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ప్రేమలతొ ఉన్న ఇరుగుపొరుగుతో ,గొడ్డూ-గోదాతో,పాలిచ్చే పశువులతో,మేకలతో ,కోళ్ళతో రకరకాల అనుబంధాలుంటాయి.30 అంతస్థులు కట్టుకున్నవాడూ,ఇళ్ళను ప్రజల సొమ్ముతో రాజసౌధాలను తలదన్నేలా నిర్మించిన వాళ్ళూ, ఇళ్ళ ప్రాంగణాల్లోనే విమానాశ్రయాలనేర్పరచుకున్న వాళ్ళూ - ఇలాంటి వాళ్ళనందర్నీ వాళ్ళున్న ఇళ్ళనీ,ఊళ్ళనీ వదిలేసి వేరే చోటికి పొమ్మంటే పోతారా? అసలు వీళ్ళని ప్రభుత్వం పొమ్మనదు.ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వం దృష్టిలో మార్కెట్ కి పనికొచ్చే ప్రజలు మరి! అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమనీ - ప్రజల యొక్క, ప్రజలకొరకు, ప్రజల చేత పాలించబడుతుందని పాలకులు చెప్పేమాటలు ఎంత బూటకం?

దుబ్బగుడా గ్రామం తర్వాత కల్యాణిఖని (KK2 మెగా) చూడడానికి వెళ్ళాం. ఈ కెకె2 మెగా ఓపెన్ కాస్ట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గని వద్ద ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు.బాధిత గ్రామాల ప్రజలు,చుట్టుపక్కల కాలుష్యానికి గురవుతున్న గ్రామాల వాళ్ళు, ఓపెన్ కాస్ట్ కి గురి కాబోతున్నవాళ్ళు-ఈ ప్రజలందరూ ప్రజాసంఘాలతో కలిసి కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ముక్తకంఠంతో ఓపెన్ కాస్ట్ ససేమిరా వీల్లేదని చెప్పారు. వీళ్ళెంత మొత్తుకుంటున్నా వినకుండా సింగరేణి యాజమాన్యం వేరే గ్రామాలనుంచి ప్రజలను తరలించుకు వచ్చి కలెక్టర్ ఎదుటికి తీసుకువచ్చారట. నిజానికి బాధిత గ్రామాల ప్రజల సమక్షంలో అభిప్రాయసేకరణ జరగాలి.పబ్లిక్ హియరింగ్ పేరిట దాదాపు 3000 మంది పోలీసు పహారా మధ్య ఒక చర్చను తూతూమంత్రంలా జరిపి,ఈ ప్రాంతం కొండంత అభివృద్ధి చెందబోతుందని వేరే వూళ్ళ అమాయక ప్రజల్ని మభ్యపెట్టి,నమ్మించి వాళ్ళకనుకూలంగా మాట్లాడించడానికి ప్రయత్నిస్తే, నోరెత్తనివ్వని పోలీసుల మధ్యనుంచి కూడా బాధిత ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారని చెప్పారు. "ఓపెన్ కాస్ట్ లతో అంచెలంచెలుగా నరక యాతనలు పెట్టే కంటే ఒకేసారి బాంబింగ్ చేసి మా ప్రాణాలు తీసి మీ ఇష్టం వచ్చింది చేసుకోమని ప్రజలు చెప్పారని" ప్రజా సంఘాల మిత్రులు చెప్పారు.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ప్రజల సంక్షేమం,సామాజిక బాధ్యతలను మరిచి ఉత్తర తెలంగాణాలో మొత్తం 72 బొగ్గుబావులను ఓపెన్ కాస్ట్ లుగా మార్చడానికి నిర్ణయించి ప్రైవేట్ సంస్థలతో జత కట్టి,19 గ్రామాల్లో ఉన్న 30000 మంది ప్రజలను నిర్వాసితులుగా మార్చబోతుంది. అసలు బొగ్గు బావుల ద్వారా కూలీలకు లభిస్తున్న జీవనోపాధిని కొల్ల గొట్టి, ప్రణాళికా బద్ధంగా ఒక్కొక్క బావినీ మూసేస్తున్నారు. గనుల్లోపలికి దిగి పనిచేసే యువకులు ఎంత దృఢకాయులైనా,ఎంత బలవంతులైనా 5 నుంచి 10 ఏళ్ళ లోపు పీనుగుల్లా మారిపోతారట. గనుల్లో పని చేసిన బలహీనంగా ఉన్న వృద్ధులతో మాట్లాడినప్పుడు మాకు తెలిసిందీవిషయం.ఆ 5,10 ఏళ్ళ జీవనాధారాన్ని కూడా లేకుండా చేసి అతి తక్కువ కూలీలతో ఓపెన్ కాస్టులద్వారా ఊళ్ళకి ఊళ్ళు స్మశానాలుగా మారుస్తున్నారు. కాలుష్యం బారిన పడేసి ప్రజల్ని నడిచే శవాల్ని చేస్తున్నారు. గేట్ దాటి లోపలికి ప్రవేశించగానే

““పచ్చదనం ప్రకృతికి ఆనవాలు” “వన సంరక్షణ మన సంరక్షణ”

“ఇంటింటి చెట్టు ఊరూరా వనం “ “ఆకుపచ్చ వనాలు మానవాళికి వరాలు”

అని రాసి ఉన్న బోర్డులు అడుగడుగునా కనిపించాయి. చెప్పేదొకటి-చేసేదొకటి గా ఉన్న ప్రభుత్వ కపట నాటకాలర్ధమై దిగులు కమ్ముకుంది. మేము వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ “ మీ గ్రామంలో ఎవరైనా సింగరేణి యాజమాన్యం,ప్రైవేట్ సంస్థలు చెప్పే మాయమాటలు నమ్ముతారేమో,వాళ్ళ పక్షం వహించి గ్రామాన్ని మోసం చేస్తారేమో “ అని మేమడిగితే "మేమందరం ఒకటే-మాలో అలాంటివారెవరూ లేరు" అని నాలుగు గ్రామాల ప్రజలూ నమ్మకంగా చెప్పారు. పోరాడకపోతే బతుకుండదనే ఎరుకతో ఉన్నారు . ఈ ఆశ ఒక్కటే కాస్తంత ఊరటనిచ్చింది. అర్భకజీవులం.ఒక్కరోజు ఎండకే అలిసి ఆపసోపాలు పడ్డాం.ఆ రోళ్ళు పగిలే ఎండ వేడిలో గని పేలుళ్ళను భరిస్తూ పోరాడుతున్న ఆ ప్రజల పోరాట పటిమ మీద నమ్మకంతో భవిష్యత్తు భరోసా కలిగింది.

చివరిగా అల్లం రాజయ్య సార్ ఇంటికి 7.30 కి వెళ్ళాం.వారూ-వారి సహచరి శోభ,మంచిర్యాల లోని వారి సన్నిహిత మిత్రులు మాకోసం వేచిఉన్నారు.నీలిమతో ఉన్న మిత్రులందరూ మాతోనే ఉన్నారు. ఆయన్ని చూసి మాకూ-మమ్మల్ని చూసి సార్ కూ ఒకటే ఆనందం-ఎడ తెగని మాటలు.అందరికీ లోపల హైదరాబాద్ చాలా దూరం .వెంటనే బయలుదేరకపోతే చేరుకోలేం అని ఆందోళన. అటూ -ఇటూ గాకుండా వెళ్తే ఇబ్బంది పడతారు.భోజనం చేసి తీరాల్సిందే తొందరగా తిని బయలుదేరమని పట్టుబట్టారక్కడున్నవారందరూ. వారి స్నేహితులు కిషన్ గారు మాఇంట్లోనే డిన్నర్ చెయ్యాలి.మిమ్మల్ని తీసుకొస్తానని మా శ్రీమతికి చెప్పి వచ్చానన్నారు.పొలో మని అందరం వారింటికి వెళ్ళాం. ఏంచేస్తున్నా అనేక విషయాల మీద సార్ కీ మాకూ నిరంతర సంభాషణ సాగిపోతూనే ఉంది. మధ్యలో వారి స్నేహితురాలు అద్భుతంగా పాట పాడి చెవులకు విందు చేశారు.పసందైన భోజనం తర్వాత రాత్రి 9.30-10.00 గంటల మధ్య వదల్లేక వదల్లేక ఆత్మీయ వీడ్కోలు తీసుకుని మా బండి భారంగా బయలుదేరింది.తెల్లవారుజామున హైదరాబాద్ కి చేరుకున్నాం.రాజయ్య గారి మాటలు మరీ మరీ తలచుకుని "అవునూ, మన నగరంలో ఇంత ఆత్మీయంగా ప్రేమగా మాట్లాడే మనిషి ఒక్కరూ కనిపించరేమిటి? అని కొండేపూడి నిర్మలా-నేనూ అనుకుని "ఎందుకంటే అది నగరం కాబట్టి" అని మాకు మేమే సమాధానం చెప్పుకున్నాం.

కల్యాణిఖని గనిని (KK2 మెగా) బయటినుంచి చూస్తేనే ఝఢుసుకున్నాను. తిరుగు ప్రయాణం లో కళ్ళు మూసుకున్నా నాకు ఆ మురికి గనే గుర్తొస్తుంది.ఒక కార్మికురాలిగా యజమాన్యాలు,అధికారులు పెట్టే బాధలు,హింసలు తెలుసు గనుక ఆ కార్మికుల కష్టాలు,స్పార్టకస్ సినిమా గుర్తొచ్చి మనసులో అవే అవే దృశ్యాలు రీళ్ళు తిరుగుతున్నాయి. నాకైతే బెర్లిన్ గోడ గురించి చదువుకున్న "డెత్ స్ట్రిప్" గుర్తుకొచ్చింది.ఆ గనుల్లోపలికి 300 ,400 అడుగుల లోపలికి దిగి, ప్రాణాలకు తెగించి పని చేసిన కార్మిక సోదరులకి చెయ్యెత్తి దణ్ణం పెట్టాల్సిందే! బొగ్గుగని కార్మికుల గురించి చదువుకున్నదంతా గుర్తుకొచ్చి వళ్ళు గగుర్పొడిచింది. గని సొరంగాల్లో మనిషి పీల్చే గాలిలో కార్బన్ మోనాక్సైడ్ లాంటి ప్రాణాంతక విషవాయువు లుంటాయి. లోపలికి దిగుతూ పని చేసే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది.ఒకచోటికి వచ్చి గాలి పీల్చుకోవాలి.పొరపాటున కార్బన్ మోనాక్సైడ్ పీలిస్తే మనిషి చనిపోతాడు. ఒక్కోసారి ఆకస్మిక పేలుళ్ళు సంభవిస్తాయి.ఉదాహరణకి ధన్ బాద్ లోని ఘోరీ (GHORI) బొగ్గు గనిలో వాయువు పేలి 1965 మే 28న 375 మంది కార్మికులు చనిపోయారు. కొన్నిసార్లు గనులు అకస్మాత్తుగా కుప్పకూలిపోయి నీళ్ళు మహోధృతంగా రాకెట్ స్పీడ్ తో ఉబికి వస్తాయి. ఉదాహరణకి. 1975 డిసెంబర్ 27 న జార్ఖండ్ లోని ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (INDIAN IRON AND STEEL COMPANY - IISCO కి సంబంధించిన చస్నాలా(CHASNALA) బొగ్గుగని కూలడంతో నిమిషానికి 7 మిలియన్ గాలన్ల నీరు వాయువేగంతో ఉప్పెనలా ముంచెత్తింది.ఆ నీటిలో ఇరుక్కుపోయి 372 మంది కార్మికులు మరణించారు. అలాగే అమెరికా లోని కెంటకీ,పెన్సిల్వేనియా,ఇల్లినాయ్,ఉఠా(UTHA) లలో కూడా ఇలాంటి యాక్సిడెంట్లే జరిగాయి.
ఈ థీం తో "కాలాపత్తర్" సినిమాకూడా వచ్చింది. దానికంటే ముందు సమ సమాజాన్ని కాంక్షించే మానవాళి కథానాయకుడు "స్పార్టకస్" సినిమా ఒపెనింగ్ సీన్ లో మొట్టమొదటగా కనిపించేది కాపర్ గనే!

ఆ కాలం నుంచి అంటే స్పార్టకస్ కాలం నుంచి ఈనాటి వరకూ తమ ప్రాణాలను పణంగా పెట్టి గనుల్లో వీరోచితంగా కృషి చేస్తూ ప్రపంచానికి వెలుగు దారులు వేస్తున్న కార్మికుల పట్ల-వారి కుటుంబాల పట్ల మనందరం ముఖ్యంగా ప్రభుత్వాలు ఎంత బాధ్యతగా ఉండాలి?అదేమంటే అందుకే గదా గనులు వద్దని ఓపెన్ కాస్టులు పెడుతున్నది అని కూడా అనగలవు గడుసు ప్రభుత్వాలు.అందుకే 1990ల నాటినుంచి ప్రపంచీకరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు,బహుళజాతి సంస్థలు,ఎన్.జి.వోలు TINA (There is no alternative) – ఓపెన్ కాస్టులు చెయ్యడం తప్ప ఇంకో దారి లేదని ప్రచారం చేస్తున్నాయి. విధ్వంసాలు సృష్టించి కళ కళలాడే జీవన సౌందర్యాన్ని విస్తాపన చెయ్యడం చాలా దుర్మార్గం. అసలు దేనికైనా "మనిషి" కేంద్రం కావాలి.మనిషికి నష్టం చేసే ఎంత గొప్ప చర్యలైనా అవి ఎన్ని సంపదలు తెచ్చి పెట్టేవైనా పక్కన బెట్టి,మనుషుల సంక్షేమం గురించి అన్ని ప్రభుత్వాలూ ఆలోచించి తీరాల్సిందే!

- శివలక్ష్మి

ప్ర ర వే కార్యవర్గ సభ్యురాలు