
Eccentricities of a Blond Haired Girl
Country: Portugal
Language :
Portuguese
Duration : 64
minutes.
ఏక్సెంట్రిసిటీస్
ఆఫ్ ఏ బ్లాండ్ హెయిర్డ్ గర్ల్ : నేటి యువతీ-యువకుల మొదటి చూపు ప్రేమలమీద విమర్శ ఈ
చిత్రం. “ప్రేమ గుడ్డిది” అన్నట్లు మోహంలో కొట్టుకుపోయే
యువతకు వాస్తవాలను గమనించమని, ప్రేమలోని మంచి -చెడ్డల
గురించి హెచ్చరికలు చేయడమే ఈ సినిమా కథాంశం.
“మకారియో”
అనే యువకుడు తన పక్కనున్న మహిళతో గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ తనకథ
చెప్తూ ఉంటాడు.అలా సినిమా మొదలవుతుంది. అల్గార్వే వెళ్ళే ఒక రైలులో వారిద్దరూ
ప్రయాణిస్తుంటారు.సీన్ కట్ చేసిఫ్లాష్ బ్యాక్ కథలోకి వెళ్తే
మకారియో తన
మామయ్య దగ్గర అకౌంటెంట్ గా పనిచేస్తూ లిస్బన్ లో ఉంటాడు. తన కార్యాలయ కిటికీ
నుండి,
అతను అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఒక యువతిని చూస్తాడు. అమె
అందానికి అతను వివశుడైపోతాడు.అంతకంతకూ అతనికి ఆమె మీద ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది.
రహస్యంగా
అతను ఎప్పుడూ కుతూహలంగా కిటికీ వైపు చూస్తూనే ఉంటాడు. ఆమె కూడా నెమ్మదిగా ఇతనిని
గమనిస్తూ,
ఒక చైనీస్ ఫ్యాన్ ని పట్టుకుని విలాసంగా ఊపుతూ మకారియో వైపు చూస్తూ
ఉంటుంది. ఆ కుటుంబానికి తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా అతను ప్రయత్నించి ఆమెను
కలిసే ఏర్పాట్లు చేసుకుంటాడు. ఒక అందమైన మాల్ లో వారి కలయిక అద్భుతంగా
జరుగుతుంది.ఆమె పేరు “లూయిసా”. వారు ప్రేమలో
పడతారు. లూయిసా మీద
అతనేర్పరచుకున్న మోహ పరవశం వల్ల ఆమెను పొందడం కోసం అతను ఏమి చెయ్యడానికైనా సిద్ధ
పడతాడు. మకారియో తన మామతో “లూయిసాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా”నని చెప్తాడు.వాళ్ళ మామ పట్టరాని ఆగ్రహంతో వాళ్ళ పెళ్ళిని
నిరాకరించడమేకాదు,తక్షణమే అతణ్ణి ఉద్యోగం నుంచి తీసివేసి తన
ఇంటి నుంచి కూడా గెంటివేస్తాడు. అతను ఇల్లు లేకుండా, చేతిలో
నయా పైసా లేకుండా నడిరోడ్డు మీద నిస్సహాయంగా నిరుపేదగా నిలబడతాడు.మకారియో బాగా
ఆలోచించి కేప్ వర్దె లో ఒక ఉద్యోగంలో చేరి, డబ్బు సంపాదించి
లూయిసాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అనుకున్నదే
తడవు ఉద్యోగం కోసం కేప్ వర్దె అనే వేరే ఊరికి వెళతాడు. లూయిసా కోసం
ఊరుకాని ఊళ్ళో అష్టకష్టాలు పడతాడు.కొంత సంపాదనాపరుడయ్యాక పెళ్ళి కోసం ఆమె ఉన్న
చోటికొస్తాడు. ఆమెను వివాహమాడతానని లూయిసా తల్లిని అడిగి అంగీకారం పొందుతాడు.
ఇంతలో మోసకారైన ఒక స్నేహితుడి వల్ల సంపాదించిన డబ్బునంతా పోగొట్టుకుంటాడు.తర్వాత
అతని మామయ్యే కనికరించి పాత ఉద్యోగం ఇస్తాడు.ఇద్దరూ సంతోషంగా పెళ్లి షాపింగ్
చేద్దామని బ జారు కెళతారు.ఒక షాపులో రకరకాల ఉంగరాలు చూస్తారు. షాపు లోని ఒక
ఉంగరాన్ని లూయిసా అతి చాకచక్యంగా దొంగిలించడాన్ని భరించలేకపోతాడు మకారియో. ఈ
సంఘటనతో అతను పూర్తిగా సంకటంలో పడతాడు. దీనితో పెళ్ళికి బ్రేక్ పడుతుంది. ఆమెలోని
క్లిప్టోమేనియా కి సంబందించిన విడ్డూరమైన ధోరణికి మకారియో విపరీతంగా కలవర పడతాడు.
భయంకరమైన షాక్ కి గురౌతాడు. అందుకే సానుభూతి కురిపిస్తూ,కథ
మొత్తాన్నీ వినాలని కోరే తోటి ప్రయాణీకురాలికి తన మనోవ్యధనంతా వెళ్ళబోసుకుని
హృదయభారాన్ని దింపుకుంటాడు మకారియో.
బాహ్య
సౌందర్యానికి ఉబ్బి తబ్బిబ్బై పోవడం,రెస్టారెంట్ లలో కలుసుకోవడం,గంటలతరబడి మైమరచిపోవడం,ఒకర్నొకరు అన్ని కోణాల్లోనూ
తదేకంగా చూసుకోవడం - అంతే! ఇద్దరి జీవితకాల సాంగత్యానికి అవసరమైన మౌలిక
విషయాలగురించిన ఆలోచనలే లేకుండా ఏకంగా పెళ్ళికి తయారైపోతున్న నేటి యువతను అద్దంలో
పెట్టి చూపించారు చిత్రదర్శకులు మనోయల్ డి ఒలివియర.
కలకాలం
కలిసుండాలంటే అసలు ఇద్దరి మనస్త్వత్వాలేమిటి?ఒకరితో మరొకరికి పొసుగుతుందా?
సర్దుకుపోగలిగే అలవాట్లేనా? ఇద్దరి అభిరుచులు,
ఇష్టమైన జీవన విధానాలేమిటి? ఒకరి అలవాట్లను
ఇంకొకరు భరించి,సహించగలిగే శక్తి ఉందా? మొదలైన సమస్యల జోలికే పోని నేటి యువతీ-యువకుల స్వభావాలను గురించి
చర్చిస్తుందీ సినిమా.
పోర్చుగీస్
లో జన్మించిన 101 ఏళ్ల దర్శకుడు మనోయల్ డి ఒలివియర (Manoel
de Oliveira) 48 వ తాజా-ఫీచర్ ఫిల్మ్ ఇది. ఎంతోమంది యువ
దర్శకులకు ధీటుగా ఈ వయస్సులో ఆయన తన మానసిక పరిపక్వతతో అతి చిన్న చిత్రంలో అత్యంత
భావగర్భితమైన మనో విశ్లేషణాత్మక పాత్రను రూపొందించి అన్ని రకాల ప్రేక్షకులను
మంత్రముగ్ధుల్ని గావించారు.ఈ సినిమా కి 1900 లో మరణించిన
ప్రముఖ పోర్చుగీస్ రచయిత ఎకా డి క్వేరోజ్( Eça de Queirós )కథ
ఆధారం. మానవస్వభావంలోని బలహీనతల్ని ఆసరా చేసుకుని పెట్టుబడిదారీవ్యవస్థలోని
మార్కెట్ మనుషుల్ని ఏ విధంగా వశపరచుకుంటుందో తెలియపరచడానికి చాలా తెలివిగా,నర్మగర్భంగా ఒక సుందరమైన ఈ ప్రేమ కథను అద్భుతంగా అల్లుకున్నారు.మారిన ప్రస్తుత
పరిస్తితుల కనుగుణంగా నవీనీకరించి, స్క్రీన్ ప్లే సంఘటనల
ద్వారా ఆర్ధిక మాంద్యాన్నీ, డార్క్ హ్యూమర్ నీ, సున్నితమైన శృంగారాన్నీ సృష్టించారు ఒలివియర .
ఒక్క
వాద్యంతో పాడే రాగం తప్ప చిత్రం లో వేరే సంగీతం లేదు. రైలు ధ్వనులను, శబ్దాలను
దర్శకుడు బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు,దూరంగా
వినిపించే శబ్దాల్ని బట్టి ప్రేక్షకులు గతం లోని ఫ్లాష్ బ్యాక్ లను, వర్తమానంలోని ప్రస్తుత పరిస్థితుల మధ్య తేడాని సులభంగా గుర్తించగలరు.
"ట్విస్ట్"కొంత నిరాశ పరిచినప్పటికీ ఆమె మనోహరమైన అందం,విలాసంగా కనిపించే వస్తువులకోసం తపించే ఉద్వేగం,చివర్లో
ఆమె చేసిన వెర్రి చేష్ట మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆమె తలతిక్క లోని వింతైనగుణము
మనల్ని వెంటాడుతుంది. టీనేజ్ అందాల్ని చూసి ఆహ్లాదపడిన ప్రేక్షకులు " ఈ
అసాధారణమైన మనస్తత్వమున్న అమ్మాయి " ని చూసి ఆశ్చర్యపోతారు,బాధపడతారు.నిశ్చింతగా ఉండలేరు.
తెలిసినవారికి
ప్రముఖ నగల వ్యాపారి హ్యారీ విన్ స్టన్ కథ గుర్తుకొస్తుంది. అతను అమెరికాలో తన
తండ్రి దుకాణంలో పని చేసే వాడు. 12 సంవత్సరాల వయస్సులో అతను ఒక పాన షాప్ లో
రెండు కారట్ల “పచ్చ” ని 25 సెంట్లు పెట్టి కొని రెండు రోజుల తరువాత 800 డాలర్ల
కి అమ్ముతాడు. అలా మొదలైన అతని వజ్రాల నగల సామ్రాజ్యం “అంతై,ఇంతై,వటుడింతై” అన్నట్లు
ప్రపంచమంతా శాఖోప శాఖలుగా విస్తరించింది. ప్రపంచం లోని నలుమూలల్ల్లో ఉన్న వజ్రాల
ప్రీతి కలిగిన సాధారణ స్త్రీలందరికీ అతని దుకాణాల ప్రశస్తి తెలిసిపోయింది.1953
లొ వచ్చిన సoగీతాత్మక సినిమా “జెంటిల్మెన్ ప్రిఫర్ బ్లాండ్స్” (Gentlemen Prefer Blondes) లోని పాట "డైమండ్స్ ఆర్ ఎ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్" ( Diamonds Are a Girl's Best Friend)
గుర్తుకొస్తుంది. అతి కోమలంగా కనిపించే అమ్మాయి షాపింగ్
కొచ్చినప్పుడు తనక్కావలసిన వస్తువు కోసం ఎంత పిచ్చెక్కిపోతుందో ,ఆ పిచ్చిలో జీతానికి పని చేసే షాపులోని ఉద్యోగి అంత ఖరీదైన వజ్రాల ఉంగరం
దొంగిలిస్తే ఎంత కష్టానికి గురౌతాడో ఆలోచించలేని లూయిసా మూర్ఖత్వం,కౄరత్వం తెలిసొచ్చి ప్రేక్షకులు ఆ అమాయి పట్ల అసహనానికీ అసంతృప్తికీ
లోనవుతారు.
రైలు
కిటికీ లోనుంచి కనిపించే గ్రామీణ దృశ్యాలు ఆహ్లాదాన్నిస్తాయి.
తేరగా డబ్బు
సంపాదించడానికి నైతిక విలువలన్నిటికీ తిలోదకాలిచ్చే నేటి ప్రపంచాన్ని కళనీ,ఆర్ధిక
శాస్త్రాన్ని మిళితం చేసి చూపించారు ప్రపంచ కురు వృద్ధ దర్శక నిర్మాత. బహుశా
ప్రపంచం లోనే 101 సంవత్సరాల వయసులో ఇంత చలాకీగా మంచి చిత్రాల
నిర్మాణం చేస్తున్న ఏకైక ఇర్మాత ఇతనేనంటే అతిశయోక్తి కాదేమో! టైటిల్ రోల్
పోషించిన అమ్మాయికే గాక విలాసాల వస్తు వ్యామోహం ఉన్న ప్రతి ఒక్కరి పైనా తన వ్యంగ్య
బాణాలు విసిరారు . అతనొక నిశ్శబ్ద మేధావి. ప్రేమ ల్లోని అనారోగ్య సమస్యల పట్ల
దృష్టి పెట్టి "మేడి పండు చూడ మేలిమై ఉండు-పొట్ట విప్పి చూడ పురుగులుండు"అనే
విషయాన్ని చెప్పడానికి లూయిసా పాత్రను పైకి మిరుమిట్లు గొలిపేలా ఏకాగ్రతతో
సృష్టించడానికి అత్యంత ప్రతిభావంతంగా సినిమా కళను ఎన్నుకున్నారు.47 వ
న్యూయార్క్ ఫిల్మ్ ఫిస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.అంతేగాక ఈ
సినిమా పోర్చుగీస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను గెల్చుకుంది.

కామెంట్లు లేవు:
Write comments