Recent Post

1, జులై 2013, సోమవారం

మహిళల కోసం మన దేశంలో మొదలైన సినిమా సంబరాలు


vihanga
మహిళలు తరతరాలుగా ఆర్జించి పెట్టి ఈ సమజానికి అందించిన జ్ఞానం, మాతృస్వామ్య వ్యవస్థనుంచి ఇంటిపెద్దగా వారిపాలనానుభవం,శక్తిసామర్ధ్యాలు, అందం,అధికారం,అనేకరకాల స్వభావాలతో ఈ ప్రపంచాన్ని అర్ధవంతం చేస్తున్నారు.అసలు వారు లేని ప్రపంచం దిక్కు లేకుండా, అనాధ ప్రేతంలా ఎలా ఉంటుందో అనే ఊహే వెన్నులో వణుకు పుట్టిస్తుంది! లక్ష్మీ,సరస్వతులనుంచి,ఆఫ్రోడైట్ – ఎథీనాలు, వీనస్ - మినర్వాలు మొదలైన దేవతలనేగాక , మొత్తంగా స్త్రీజాతిని పురుష ప్రపంచం తమ ప్రార్ధనల్లో, ప్రేమ ప్రకటనల్లో, పాటల్లో, నాటకాల్లో ప్రశంసలతో ముంచెత్తుతూనే ఉంది.

18 వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ “celebrating women” పేరిట భారత్ లోని వివిధ ప్రముఖ నగరాల్లో బ్రహ్మాండంగా మొదలైంది . ఇది మహిళలకే గాక ఆయా నగరాల్లోని సినీ ప్రియులందరికీ పరవశం కలిగించింది.ఇండియాలో ఇంతకు ముందెప్పుడూ ఎక్కడా ఈ సినిమాలను ప్రదర్శించలేదు.
అంతర్జాతీయ మహిళా దినం మార్చ్ 8న మొదలైన ఈ సంబరాలు
కోయంబత్తూర్ లో- 8 మార్చ్ నుంచి 14 మార్చ్ వరకు
బెంగుళూరులో -21 మార్చ్-28 మార్చ్ వరకు
పూనాలో - 5 ఏప్రిల్ – 10 ఏప్రిల్ వరకు
చెన్నైలో -5 ఏప్రిల్ – 14 ఏప్రిల్ వరకు
గోవా లో – 19 ఏప్రిల్ -30 ఏప్రిల్ వరకు
ముంబై లో 20 ఏప్రిల్-28 ఏప్రిల్ వరకు
ఢిల్లీలో 8 మే -19 మే వరకు
కోల్ కతాలో 24 మే -1 జూన్ వరకు
హైదరాబాద్ లో 25 మే-8 జూన్ వరకు
చండీఘర్ లో25 జూన్ - 7జులై వరకు
జోధ్ పూర్ లో 12 జులై – 28 జులై వరకు
తన ఆధ్వర్వంలో యూరోపియన్ యూనియన్ ఇండియాలో జరిగేలా శ్రద్ధ వహించింది. హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్లో ప్రారంభించారు.కొన్ని చిత్రాలు అన్నపూర్ణా స్టుడియోస్ లో, కొన్ని చిత్రాలు అలయన్స్ ఫ్రాంచైజ్ లో , కొన్ని చిత్రాలు గోథే జెంత్రం లలో ప్రదర్శించారు. యూరప్ లోని వివిధ దేశాలనుంచి వచ్చిన 24 చిత్రాలను ఆయా దేశాల చిత్ర, విచిత్ర వైవిధ్యాలను, యూరప్ కళా సంస్కృతుల్ని భారత్ ప్రేక్షకులు తెలుసుకోవడానికి వీలుగా అందించింది.
పురుషాధిపత్య సమాజాల్లో మహిళల కథలు బలంగా వినబడవు.లేకపోతే కొన్నిసార్లు కావాలనే ఇతర సంఘటనల మాటున దాచేస్తారు.కానీ నేటి ఆధునిక యుగపు స్త్రీలు నిరంతరం పట్టిన పట్టు వదలకుండా బలమైన స్వరాల ద్వారా  అన్ని రంగాల్లోనూ స్త్రీ-పురుష సమానత్వాన్ని సాధించే దిశగా అడుగులేస్తూ తమ హక్కులు డిమాండ్ చేస్తున్నారు.అందులో భాగంగానే, ఆడవాళ్ళ జీవితాల్లోని రకరకాల అంశాలను,పైకి అల్పంగా కనిపిస్తూ అనుభవిస్తున్నవాళ్ళకు నరకప్రాయంగా ఉండడాన్నీ,అసలు మహిళలైనందుకే పుట్టిన దగ్గరనుంచి పడుతున్న కష్టాలనూ ఈ సినిమాలు షో కేస్ లో పెట్టి చూపిస్తాయి. కొన్ని వ్యక్తిగత కథలు, కొన్ని నాటకాలు, కొన్ని హాస్య పూర్వకమైనవి ఉంటే, కొన్నైతే అచ్చు జీవితం లాగే ఉండి ఏ కేటగిరిలోనూ ఒదగకుండా వున్నాయి . కధానాయికలు యొక్క దృష్టికోణం నుంచి ఆలోచించి, వారి కష్ట-సుఖాల్లో మన భాగస్వామ్యాన్ని తెలుపుతూ, మన గొంతుల్ని కోరస్ గా అందించమని ఈ పండగ ద్వారా యూరప్ మహిళలు భారత్ కీ, ప్రపంచానికీ విజ్ఞప్తి చేస్తున్నారు.
మొత్తానికి ఈ ఆసక్తికరమైన కథలన్నీ వాస్తవిక జీవితాలనూ,విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే అందమైన వ్యాఖ్యానాలతో సినిమా భాష ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకునే వారందరినీ అలరించాయి.
ముందుగా నేను చూసిన ఒక బెల్జియం మూవీ గురించి :

అల్తిప్లనోవ్ (Altiplano): ఈ సినిమాని ఐదు ఖండాల్లో(ద్వీపాలు), ఐదు భాషల్లో పీటర్ బ్రోసెన్స్,జెస్సికా వుడ్ వర్త్ కలిసి తీశారు. ఇది ఇద్దరు స్త్ర్రీ మూర్తుల విషాద భరితమైన జీవితాలను ఆవిష్కరిస్తుంది.
(స్థూలంగా కథను గమనిస్తే)ఫొటోగ్రాఫర్ గ్రేస్ యుద్ధ చిత్రాలను తీస్తుoటుంది. ఇరాక్ యుద్ధంలో భీభత్సంగా చంపబడిన తన గైడ్ ఫొటొ ను ఆమె బలవంతంగా తియ్యాల్సొస్తుంది.దాంతో కలవరపడిన ఆమె తన ఉద్యోగానికి తిలోదకాలిచ్చి బెల్జియం కొచ్చేస్తుంది. ఆమె భర్త “మాక్స్” బెల్జియన్. కానీ ఆయన పెరూ లోని ఆండిస్ అనే ఒక ఎత్తైన ప్రదేశంలో ఐ క్లినిక్ లో కంటి సర్జన్ గా పని చేస్తుంటాడు. ఇక్కడికి దగ్గరగా ఉన్న "తురుబాంబ" అనే ఆదివాసీ గ్రామానికి పక్కనున్న ఒక గని నుంచి, పాదరసం ఒలికిపోయి, అందులోని విషప్రభావానికి గ్రామస్థులందరూ కంటి జబ్బు బారిన పడతారు. ఇదే గ్రామానికి చెందిన “శాచునా” అనే యువతికి కాబోయే వరుడు ఈ విష మాలిన్యమంటుకోవడం వల్ల చనిపోతాడు. గ్రామస్థుల కంటి జబ్బును నయం చెయ్యలేకపోతే నీకు ‘సర్జన్’ అని ఆ పేరెందుకని కోపంగా ప్రశ్నిస్తుంది శాచునా.గ్రామస్థులందరూ హాస్పటల్ కి ఒక్కో రోగిని నలుగురు నలుగురు చొప్పున మోసుకుంటూ పరుగు పరుగున వస్తుంటారు.కానీ డాక్టర్ల బృందానికి ఏమి చెయ్యాలో అంతు బట్టదు. ఏమవుతుందో పరిశీలించడానికి వైద్యుల బృందం గ్రామానికి వస్తుంది. శాచునా తల్లి వైద్య బృందం శవాన్ని ముట్టుకోవడానికి అంగీకరించదు. ఆమెతో పాటు గ్రామస్థులందరూ విదేశీ డాక్టర్లమీద ఆగ్రహోదగ్రులవుతారు. వాళ్ళు చేసిన రాళ్ళ దాడిలో మాక్స్ చనిపోతాడు.
వాళ్ళ భూముల్లోకి ప్రవేశించి వాళ్ళకే చెందిన వనరులను కొల్లగొట్టడానికి వీల్లేదంటూ గని యజమానులకు వ్యతిరేకంగా గ్రామస్థులందరితో కలిసి శాచునా ఒక గొప్ప ప్రదర్శనకు నాయకత్వం వహిస్తుంది . సహజంగానే ఉద్యమాలను అణచివేసే ప్రభుత్వం ఆ ప్రయత్నాలను దౌర్జన్యంగా, అతి దారుణంగా ,దాష్టీకంగా తిప్పి కొడుతుంది. ప్రియుడు పోవడంతో పాటు తన గ్రామానికి నిరంతరం ఎదురవుతున్న కష్టాలు, భూఆక్రమణలు జీర్ణించుకోలేని శాచునా తీవ్రంగా కలత చెంది తన వంతు నిరసన ప్రకటనగా పాదరసంతో ఆత్మహత్య చేసుకుంటుంది. చనిపోవడానికి ముందు, మాక్స్ చనిపోయినప్పుడు దొరికిన కెమెరాలో విషాదకర పరిస్థితులన్నింటినీ వీడియో తీస్తుంది.
ఇక గ్రేస్ , మాక్స్ చనిపోయిన స్థలాన్ని వెతుక్కుంటూ వస్తుంది. శాచునా తల్లి ఆమెను తన ఇంటికి ఆహ్వనించి ఆశ్రయమిస్తుంది. శాచునా తీసిన వీడియోని గ్రేస్ చూస్తుంది. విషయం తెలుసుకుని శాచునా శవయాత్రలో పాల్గొంటుంది.చివరికి గ్రేస్ భర్త పోయిన విషాదాన్నుంచి కాస్త తెరిపిన పడుతుంది.
షూటింగ్ 2008 జూన్ – అక్టోబర్ ల మధ్య 43 రోజుల పాటు బెల్జియం లోని పెరూ ప్రాంతాల్లో జరిగింది. పెరూ లోని అండీస్ లో 5,000 మీటర్ల ఎత్తులో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండి, ఏమాత్రం అనుకూలించని కారణంగా ఒక వైద్య బృందం 24 గంటలూ సిబ్బందినీ తారలనూ అంటిపెట్టుకుని ఉంది. ఇది సినిమా పట్ల వారి అంకిత భావాన్ని తెలియజేస్తుంది.
ఇది “కొరొపాంప“ అనే ఒక పెరువియన్ గ్రామంలో, 2000 లో జరిగిన నిజ జీవిత సంఘటనల ప్రేరణతో తీసిన కాల్పనిక చిత్రం. శాచునా , మాక్స్ వంటి పాత్రలు - పూర్వీకుల చరిత్ర ఆధారంగా స్థానిక గ్రామస్తుల, విదేశీ వైద్యుల నివేదికల ఆధారంగా రూపుదిద్దుకున్నాయి.
వైద్యుల బృందాన్ని చిన్నా-పెద్దా తేడా లేకుండా గ్రామప్రజలందరూ ఐక్యంగా అడ్డుకున్న తీరు,ఆదివాసీలైన రెడ్ ఇండియన్ తెగలు వారి జెండాలతో, వారి పూర్వీకుల ఫొటోలతో, "మీరు దుర్మార్గులు, (మీరు) మోసగాళ్ళు, మా భూముల్లోకి ప్రవేశించడానికి వీల్లేదు"మొదలైన నినాదాలున్న ప్లకార్డులతో ఉద్యమాన్ని నడిపిన తీరు నన్ను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. దురాక్రమణ దారుల పట్ల,ప్రజావ్యతిరేకుల పట్ల నేడు మనం చేస్తున్న ఉద్యమాలకు వారే మార్గదర్శకులని తెలిసింది!!
ఆదివాసీలనగానే స్వచ్చమైన జలాలతో పారే సెలయేళ్ళూ,అందమైన ప్రకృతిల మధ్య వారి అమాయక ముఖాల్లో చిరునవ్వులు గుర్తొస్తాయి.కానీ ఈ సినిమాలో అందరి ముఖాల్లో చిరునవ్వులు మాయమై విషాదమే పలకరించింది.వనరుల విధ్వంసం, కార్పొరేటీకరణ వలన అంటు రోగాల బారిన పడుతున్న గిరిపుత్రుల ముఖాల్లో ఆందోళనే కనపడింది . ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ఆదివాసుల పట్ల ప్రభుత్వాలన్నీ అమలుపరుస్తున్న విధానాలను వాస్తవికంగా చిత్రించిందీ చిత్రం.
( వచ్చే సంచికలో మరి కొన్ని సినిమాలు )                                                         - శివ లక్ష్మి

    Choose :
  • OR
  • To comment
కామెంట్‌లు లేవు:
Write comments